Share News

పక్కదారి పడుతున్న సబ్సిడీ సిలిండర్లు

ABN , Publish Date - Jun 13 , 2026 | 01:35 AM

జిల్లాలో సబ్సిడీ సిలిండర్లు పక్కదారి పడుతున్నాయి. కమర్షియల్‌ సిలిండర్ల ధరలు పెరగడం, యుద్ధ ప్రభావంతో కొంత కొరత ఉండడంతో హోటల్‌ యజమానులు డొమెస్టిక్‌ గ్యాస్‌ను బహిరంగంగా వినియోగిస్తు న్నారు.

పక్కదారి పడుతున్న సబ్సిడీ సిలిండర్లు

- హోటళ్లు, టిఫిన్‌ సెంటర్లలో డొమెస్టిక్‌ సిలిండర్ల వినియోగం

- గ్యాస్‌ ధరలు పెరిగాయని వినియోగదారులపై భారం

- నామమాత్రంగా వ్యవహరిస్తున్న పౌర సరఫరాలు, విజిలెన్స్‌

జిల్లాలో సబ్సిడీ సిలిండర్లు పక్కదారి పడుతున్నాయి. కమర్షియల్‌ సిలిండర్ల ధరలు పెరగడం, యుద్ధ ప్రభావంతో కొంత కొరత ఉండడంతో హోటల్‌ యజమానులు డొమెస్టిక్‌ గ్యాస్‌ను బహిరంగంగా వినియోగిస్తు న్నారు. అయినప్పటికీ సంబంధించి అధికారులు చూసీచూడనట్లు వదిలేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు సిలిండర్లు ధరలు పెరిగాయని ధరలు పెంచి వినియోగదారులపై భారం మోపుతున్నారు.

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

ఇరాన్‌, ఇరాక్‌ యుద్ధ ప్రభావం వల్ల వంటగ్యాస్‌ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో జిల్లాలో కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్లు వాడే హోటళ్లు, టిఫిన్‌ సెంటర్లు, టీస్టాళ్ల నిర్వాహకుల్లో చాలా మంది డొమెస్టిక్‌ (గృహ అవసరాలు) గ్యాస్‌ను బహిరంగంగా వినియోగిస్తున్నారు. దీంతో ప్రభుత్వం అందించే సబ్సిడీ గ్యాస్‌ పక్కదారి పడుతున్నది. ఇదే సమయంలో కమర్షియల్‌ గ్యాస్‌ ధరలు పెరిగాయని కారణం చూపుతూ వినియోగదారు లపై అదనపు భారం మోపడం విమర్శలకు తావిస్తోంది. వాణిజ్య అవస రాలకు తప్పనిసరిగా ఉపయోగించాల్సిన కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్ల స్థానంలో గృహ అవసరాల కోసం ప్రభుత్వం సబ్సిడీతో అందిస్తున్న డొమె స్టిక్‌ సిలిండర్లను హోటళ్లు, రెస్టారెంట్లు, టీ స్టాళ్లు, టిఫిన్‌ సెంటర్లు విస్తృ తంగా వినియోగిస్తున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. కొంతకాలంగా అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు, గ్యాస్‌ ధరలు పెరుగుతున్నాయి. ఇరాన్‌-ఇజ్రాయిల్‌ ఉద్రిక్తతలు, అంతర్జాతీయ రవాణా వ్యయాల పెరు గుదల ప్రభావంతో కమర్షియల్‌ ఎల్పీజీ సిలిండర్ల ధరలు కూడా పెరి గాయి. ఒక 19 కిలోల కమర్షియల్‌ సిలిండర్‌ ధర ప్రస్తుతం 3,406 రూపాయలు, గృహ అవసరాలకు ఉపయోగించే 14.5 కిలోల డొమెస్టిక్‌ సిలిండర్‌ ధర 1013 రూపాయలు ఉంది. ఈ రెండింటి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఆసరాగా చేసుకుని హోటళ్ల నిర్వాహకులు డొమెస్టిక్‌ సిలిండర్లను వాడుతున్నారు.

ఫ బహిరంగంగానే డొమెస్టిక్‌ సిలిండర్ల వినియోగం..

జిల్లాలోని పెద్దపల్లి, గోదావరిఖని, రామగుండం, సుల్తానాబాద్‌, ఆయా మండల కేంద్రాల్లో ఉండే హోటళ్లు, టిఫిన్‌ సెంటర్లు, ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్లు, టీ స్టాళ్లు, బేకరీలు, చిన్నపాటి భోజనశాలల్లో కమర్షియల్‌ సిలిండర్లకు బదులుగా గృహ వినియోగ డొమెస్టిక్‌ సిలిండర్లు కనిపిస్తున్నాయి. కొన్నిచోట్ల ఒకేసారి రెండు, మూడు డొమెస్టిక్‌ సిలిండర్లను వంటకు వినియోగిస్తున్నట్లు తెలుస్తున్నది. నిబంధనల ప్రకారం ఇది చట్టవిరుద్ధం అయినప్పటికీ, ఎలాంటి భయం లేకుండా ఈ వ్యవహారం కొనసాగు తుండడం గమనార్హం. గ్యాస్‌ ధరలు పెరిగాయని చెబుతూ హోటల్‌ నిర్వాహకులు టిఫిన్లు, భోజనాలు, టీ, స్నాక్స్‌ ధరలను పెంచుతున్నారు. కానీ అదే సమయంలో అధిక ధర గల కమర్షియల్‌ సిలిండర్లకు బదులుగా తక్కువ ధరకు లభించే డొమెస్టిక్‌ సిలిండర్లను వినియోగించడం ద్వారా అదనపు లాభాలు ఆర్జిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. వినియోగదారుల నుంచి పెరిగిన ధరలు వసూలు చేయడమే కాకుండా గ్యాస్‌ ఖర్చులో కూడా ఆదా చేసుకుంటూ ప్రయోజనం పొందుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.

ఫ సబ్సిడీ లక్ష్యానికే గండి..

ప్రభుత్వం గృహ అవసరాల కోసం సామాన్య ప్రజలకు అందిస్తున్న సబ్సిడీ గ్యాస్‌ అసలు లబ్ధిదారుల కోసం ఉద్ధ్దేశించినది. అయితే వ్యాపార అవసరాలకు సిలిండర్లు వాడడం వల్ల ప్రభుత్వ ఖజానాపై అదనపు భారం పడుతోంది. అంతేకాకుండా నిజమైన గృహ వినియోగదారులకు సిలిండర్ల సరఫరాలో ఇబ్బందులు తలెత్తే ప్రమాదమేర్పడింది. ఈ క్రమంలో పౌర సరఫరాల శాఖ, ఆయిల్‌ కంపెనీల ఫీల్డ్‌ అధికారులు, విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగాలు తరచూ తనిఖీలు నిర్వహించి అక్రమాలను అరికట్టాల్సి ఉంటుంది. కానీ జిల్లాలో ఇరాన్‌, ఇజ్రాయిల్‌ దేశాల మధ్య యుద్ధం భీకరంగా జరిగిన సమయంలో ముమ్మరంగా తనీఖీలు చేశారని, ఇప్పుడు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు. ఎప్పుడో ఒకసారి దాడులు నిర్వహించి కొన్ని సిలిండర్లు స్వాధీనం చేసుకోవడం మినహా నిరంతర పర్యవేక్షణ లేకపోవడంతో అక్రమాలు కొనసాగుతున్నాయని చెబుతున్నారు.

ఫ ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టాలి..

జిల్లాలోని అన్ని హోటళ్లు, రెస్టారెంట్లు, టీ స్టాళ్లు, టిఫిన్‌ సెంటర్లు, బేకరీల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు. కమర్షియల్‌ గ్యాస్‌ వినియోగంపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి, నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై కేసులు నమోదు చేయడంతో పాటు జరిమానాలు విధించాలని డిమాండ్‌ చేస్తున్నారు. అక్రమంగా విని యోగిస్తున్న సబ్సిడీ సిలిండర్లను స్వాధీనం చేసుకుని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటేనే వాణిజ్య అవసరాలకు డొమెస్టిక్‌ సిలిండర్ల వాడకానికి అడ్డుకట్ట వేయవచ్చనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ విషయమై కలెక్టర్‌, సంబంధిత శాఖల అధికారులు వెంటనే స్పందించి జిల్లాలో సమగ్ర తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

ఫ జిల్లాలో తనిఖీలు చేస్తున్నాం..

- శ్రీనాథ్‌, జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి, పెద్దపల్లి

వంట గ్యాస్‌ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో వాణిజ్య అవసరాలకు డొమెస్టిక్‌ సిలిండర్లు వాడకుండా ఉండేందుకు జిల్లా వ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తూ చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే 70కి పైగా సిలిండర్లను సీజ్‌ చేసి వాటిని వినియోగించిన వారిపై 5 వేల వరకు జరిమానాలు విధించాం. నిరంతరంగా తనిఖీలు చేస్తున్నాం. సిలిండర్లు పక్కదారి పడకుండా చర్యలు తీసుకుంటాం.

Updated Date - Jun 13 , 2026 | 01:35 AM