Share News

గ్రామాల్లో కుంటుపడుతున్న అభివృద్ధి

ABN , Publish Date - Apr 24 , 2026 | 01:03 AM

గ్రామ పంచాయతీలు నిధుల కొరతతో కొట్టుమిట్టాడుతున్నాయి.

గ్రామాల్లో కుంటుపడుతున్న అభివృద్ధి

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

గ్రామ పంచాయతీలు నిధుల కొరతతో కొట్టుమిట్టాడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 15వ ఆర్థిక సంఘం నిధులు మినహా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా విడుదల కాకపోవడంతో గ్రామాల్లో అభివృద్ధి పనులు కుంటుపడుతున్నాయి. పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాల్సిన స్టేట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (ఎస్‌ఎఫ్‌సీ) నిధులకు నాలుగేళ్లుగా దిక్కులేదు. గత ప్రభుత్వ హయాంలోనే నిలిచిపోగా, ప్రస్తుతం అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కూడా రెండేళ్లుగా ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. గ్రామ పంచాయతీలకు పన్నుల రూపేణా పెద్దగా ఆదాయం సమకూరడం లేదు. ఇంటి పన్నులు, నల్లా పన్నులు, దుకాణాలకు లైసె న్సుల జారీ, రెన్యూవల్స్‌ ద్వారా, ఇతరత్రా పన్నుల ద్వారా రావాల్సిన ఆదా యం రావడం లేదు. యేటా చిన్న పంచాయతీలకు లక్ష రూపాయల లోపు ఆదాయం వస్తున్నది. వెయ్యి జనాభా గల పంచాయతీలకు 2 లక్షల వరకు, 3 వేల జనాభా గల పంచాయతీలకు 5 లక్షల ఆదాయం కూడా రావడం లేదు. 500లోపు జనాభా గల గ్రామాల పరిస్థితి మరింత దయనీయం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 15వ ఆర్థిక సంఘం నిధులు పంచాయతీల నిర్వహణకే సరిపోతున్నాయి. వాటితో అభివృద్ధి పనులు చేయడం గగనంగా మారింది. జనాభా ప్రాతిపదికన కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధులను విడుదల చేస్తున్నది. నీతి అయోగ్‌ ద్వారా ఆర్థిక సంఘాలను కొనసాగిస్తారు. ప్రతీ ఐదేళ్లకోసారి ఆర్థిక సంఘాలను ఏర్పాటు చేశారు. తద్వారా స్థానిక సంస్థలను బలోపేతం చేయడానికి, గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పనులను కొనసాగించడానికి నిధులను విడుదల చేస్తున్నది.

జిల్లాలో 263 గ్రామ పంచాయతీలు ఉండగా, గడిచిన డిసెంబర్‌ నెలలో 262 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. ఒక పంచాయతీ ఎన్నిక కోర్టు స్టే ఇవ్వడం వల్ల ఆగింది. పంచాయతీల పాలకవర్గాల పదవీ కాలం 2024 పిబ్రవరి మొదటి వారంలో ముగియడంతో 20 నెలలపాటు ప్రత్యేక అధికారుల పాలన సాగింది. దీంతో కేంద్ర ప్రభుత్వం విడుదల చేయాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధులను ఎన్నికలు నిర్వహించే వరకు నిధులను విడుదల చేయమని కేంద్రం స్పష్టం చేసింది. ఎన్నికలు పూర్తయిన తర్వాత వరుసగా మూడుసార్లు నిధులను విడుదల చేసింది. జనవరి 13వ తేదీన 2023-24 సంవత్సరానికి 2వ ఇన్‌స్టాల్‌ కింద టైడ్‌ ఫండ్స్‌ 6 కోట్ల 61 లక్షల రూపాయలు విడుదలయ్యాయి. ఫిబ్రవరి 17వ తేదీన 2024-25 సంవత్స రానికి ఒకటవ ఇన్‌స్టాల్‌ అన్‌ టైడ్‌ ఫండ్స్‌ 5 కోట్ల 72 లక్షల రూపాయలు విడుదల చేశారు. ఫిబ్రవరి 26వ తేదీన 2024-25 సంవత్సరానికి మొదటి ఇన్‌స్టాల్‌ టైడ్‌ ఫండ్స్‌ 8 కోట్ల 69 లక్షల రూపాయలు, మొత్తం 21 కోట్ల 3 లక్షల 64 వేల రూపాయలు గ్రామ పంచాయతీల ఖాతాల్లో జమ చేశారు. ఈ నిధులతో పంచాయతీల నిర్వహణతో పాటు విద్యుత్‌ బిల్లులు చెల్లిస్తూ, చిన్న చిన్న అభివృద్ధి పనులు చేస్తున్నారు. పంచాయతీల నిర్వహణకు నిధులు అధికంగా ఖర్చు అవుతాయి. మల్లీపర్పస్‌ కార్మికులు, కారోబార్‌, ట్రాక్టర్‌ డ్రైవర్ల వేతనాల, వీధిదీపాల నిర్వహణ, విద్యుత్‌ చార్జీలు చెల్లిం చడం, తాగునీటి సరఫరాకు సంబంధించి పాత, కొత్త పైప్‌లైన్లకు వెచ్చించాల్సి ఉంటుంది. పన్నుల రూపేణా పంచాయతీలకు జమ అయ్యే నిధులతోపాటు 15వ ఆర్థిక సంఘం నిధులు ఎక్కువగా నిర్వహణకు ఖర్చు అవుతున్నాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాల్సిన ఎస్‌ఎఫ్‌సీ నిధులను విడుదల చేయకపోవడంతో పంచాయతీల్లో అభివృద్ధి పనులు కుంటుపడుతున్నాయి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఎస్‌ఎఫ్‌సీ నిధులను విడుదల చేయాలని సర్పంచులు కోరుతున్నారు.

Updated Date - Apr 24 , 2026 | 01:03 AM