విద్యార్థులు కావలెను
ABN , Publish Date - Nov 07 , 2026 | 01:39 AM
- లా కాలేజ్ సీటు.. ఇప్పుడు హాట్ కేకులా మారింది. ప్రైవేటులో రూ.2.50లక్షల నుంచి రూ.3 లక్షలు పెడితేగానీ సీటు దొరకడం లేదు. కానీ కరీంనగర్‌లోని శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలోని ప్రభుత్వ లా కళాశాలలో 120 సీట్లకు గాను 96 మాత్రమే భర్తీ అయ్యాయి. మెరిట్ ఆధారంగా పలువురు చేరారు. అయినా ఇంకా 24 సీట్లు ఇక్కడ నిండాల్సి ఉంది.
- ఖాళీ సీట్లు.. నిండక పాట్లు
- శాతవాహన యూనివర్సిటీ పరిధిలో ఇబ్బందులు
- చొరవ చూపితేనే మేలు
(ఆంధ్రజ్యోతి, కరీంనగర్)
- లా కాలేజ్ సీటు.. ఇప్పుడు హాట్ కేకులా మారింది. ప్రైవేటులో రూ.2.50లక్షల నుంచి రూ.3 లక్షలు పెడితేగానీ సీటు దొరకడం లేదు. కానీ కరీంనగర్‌లోని శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలోని ప్రభుత్వ లా కళాశాలలో 120 సీట్లకు గాను 96 మాత్రమే భర్తీ అయ్యాయి. మెరిట్ ఆధారంగా పలువురు చేరారు. అయినా ఇంకా 24 సీట్లు ఇక్కడ నిండాల్సి ఉంది. నిబంధనల ప్రకారం ఆన్‌లైన్ కౌన్సెలింగ్ పూర్తయినా.. స్పాట్ కౌన్సెలింగ్ ఏర్పాటు చేసే దిశగా వర్సిటీ అధికారులు నిర్ణయాలు తీసుకుంటే పేద విద్యార్థులకు న్యాయం జరిగే వీలుంది. ఈ నిర్ణయం వీరి పరిధిలో లేకున్నా.. ఉన్నతాధికారుల ఆదేశాలతో కొత్తగా ఏర్పాటు చేసిన ఈ న్యాయ కళాశాలలో సీట్ల భర్తీకి వర్సిటీ అధికారులు, అధ్యాపకులు చొరవ చూపాలి.
- శాతవాహన యూనివర్సిటీ పరిధిలోని ఇంజినీరింగ్, బీఫార్మసీ, ఎం ఫార్మసీ, పీజీ కోర్సులకు సంబంధించి ప్రభుత్వ కళాశాలల్లో 315 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఇవే కాకుండా ఇంజినీరింగ్ కాలేజీలోనూ కొన్ని సీట్లు భర్తీ కావాల్సి ఉంది. ఎమ్మెస్సీ కెమిస్ర్టీలో 32, మ్యాథ్స్‌లో 30, ఫిజిక్స్‌లో 26 వరకున్నాయి. కీలకమైన కంప్యూటర్ సైన్స్‌లోనూ 23 సీట్లు నిండాల్సి ఉంది. ఇటీవల స్పాట్ కౌన్సెలింగ్‌ను నిర్వహించగా.. బీఫార్మసీలో ఐదుగురు, ఇంజినీరింగ్‌లో 22 మంది చేరారు. ఆర్స్ట్ కాలేజీలో ఎంఎస్‌డబ్ల్యూలో 20, ఎకనామిక్స్‌లో 15 చొప్పున చాలా సబ్జెక్ట్‌లలో పీజీ విద్యార్థులు చేరలేదు. అన్నిరకాల కోర్సులు కలిపి దాదాపుగా 900 వరకు ఉండగా అందులో మరో 30 శాతం మేర విద్యార్థులు ఈ విద్యా సంవత్సరంలో చేరాల్సి ఉంది.
ఆలస్యమైతే నష్టం
ఈ విద్యాసంవత్సరానికి సంబంధించి మరింత ఆలస్యం చేస్తే విద్యార్థులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. వెబ్ ఆప్షన్‌లు పెట్టుకున్న పలువురు విద్యార్థులు వేరే చోట సీటు వచ్చినా దూరభారంతో చేరకుండా ఉన్నారు. ఇలాంటి వారికి స్పాట్ ప్రక్రియతో మేలు చేయాలని విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి. ఇటీవల పలు సంఘాలు వీసీని కలిసి ఈ విషయమై వినతుల్ని అందజేశాయి. ఇప్పటికే యూనివర్సిటీలో వివిధ రకాల సమస్యలతో విద్యావ్యవస్థ పరంగా పలు లోపాలతో సతమతమవుతోంది. ఇలాంటి తరుణంలో పూర్తి స్థాయిలో అన్ని కోర్సుల్లో విద్యార్థులు చేరితే ఇక్కడి విద్యావిధానం మెరుగయ్యే వీలుంది. టీజీఎప్‌సెట్ ద్వారా ఇంజినీరింగ్, పీజీఈసెట్ ద్వారా బీఫార్మసీ, ఎంఫార్మసీ సీట్లను మూడు విడతల్లో భర్తీ చేశారు. ఖాళీల కోసం స్పాట్ కౌన్సెలింగ్‌ను ఇటీవల యూనివర్సిటీ నిర్వహిం చినా ఆశించిన స్థాయిలో విద్యార్థులు చేరలేదు. దీంతో ఖాళీ సీట్లు ఎలా భర్తీ అవుతాయనే బెంగ వర్సిటీలో నెలకొంది.
ప్రైవేటుకు దీటుగా తీర్చిదిద్దాలి
ఇప్పుడున్న పరిస్థితుల్లో శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలోని ప్రభుత్వ కళాశాలల్లోని వివిధ కోర్సులను ప్రైవేటుకు దీటుగా తీర్చిదిద్దాల్సిన అవసరముంది. అయితే కీలకమైన లా కళాశాల మంజూరీ కోసం స్థానిక ప్రజాప్రతినిధులు, వర్సిటీ అధ్యాపకులు, అధికారులు ఎంతగానో శ్రమించి సాధించారు. ఇలా సాధించి తెచ్చిన కాలేజీలో సీట్లన్నీ నింపడానికి అంతేస్థాయిలో కృషి చేయాల్సిన అవసరముంది. అవసరమైతే రాష్ట్రస్థాయిలో ఉన్నతాధికారుల నుంచి ప్రత్యేక అనుమతులు తెప్పించి అర్హత ఆధారంగా విద్యార్థులను చేర్చుకోవాలి. కానీ అలా చేయకపోవడంతో ప్రైవేటు లా కళాశాలలకు పరోక్షంగా మేలు జరుగుతుందనే అపవాదును యూనివర్సిటీ మోయాల్సి వస్తోంది. ఇటీవల మిగతా కోర్సులకు స్పాట్ అవకాశాలు ఇచ్చినట్లుగానే లా కాలేజీ కోసం అవకాశాలివ్వాల్సిన అవసరముంది.