విద్యార్థులు సేవా భావాన్ని అలవర్చుకోవాలి
ABN , Publish Date - Jan 09 , 2026 | 12:35 AM
విద్యార్థులు సేవాభావాన్ని అలవర్చుకోవాలని జిల్లా విద్యాఽధికారి రాము సూచించారు.
వెల్గటూర్, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులు సేవాభావాన్ని అలవర్చుకోవాలని జిల్లా విద్యాఽధికారి రాము సూచించారు. వెల్గటూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గణితం స్కూల్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న కొండల్ రెడ్డి తన పూర్వ విద్యార్థుల సహకారంతో పాఠశాలలో రూ.3.65 లక్షలతో చేపట్టిన పలు కార్యక్రమాలను గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పనకు సీనియర్ ఉపాధ్యాయులు యాలం కొండాల్‌రెడ్డి చేసిన కృషి అభినందనీయమని అభిప్రాయపడ్డారు. ఉన్నత పాఠశాలలో విద్యార్థులను నాలుగు బృందాలుగా విభజిస్తూ హౌసెస్ ఏర్పాటుతో ప్రత్యేక కార్యక్రమానికి విద్యాశాఖ శ్రీకారం చుట్టింది. ఒక్కో గ్రూపు విద్యార్థికి ఒక్కో రకమైన క్రీడా దుస్తులు కొండాల్ రెడ్డి పూర్వ విద్యార్థుల దాతృత్వంతో సమకూరాయి. దీంతో పాటు విద్యార్థులకు ప్యూరిఫైడ్ వాటర్ అందించేందుకు గత ఎనిమిది ఏళ్ల క్రితం ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసిన ఆర్ ఓ ప్లాంట్ పునరుద్ధరించి విద్యార్థులకు తాగునీటి వసతికి చర్యలు చేపట్టారు. నాలుగు మరుగుదొడ్లు నిర్వహణ లేకపోవడంతో వీటిని మరమ్మతు చేయించి వినియోగంలోకి తీసుకువచ్చారు. ప్రధాన ద్వారం గేటు, పాఠశాల బోర్డు, నూతన భవనం రక్షణ కోసం ప్రత్యేక గేటు, తదితర కార్యక్రమాలను చేపట్టారు. వీటిని స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి జిల్లా విద్యాధికారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిపారు.
జిల్లా విద్యాశాఖ ద్వారా పాఠశాలలో అవసరమైన సౌకర్యాలు కల్పనకు తమ వంతు కృషి చేస్తామని పేర్కొన్నారు. పదో తరగతిలో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు. పాఠశాల విద్యార్థులు ఆంగ్లంలో ఉపన్యసించిన తీరును చూసి జిల్లా విద్యాధికారి అబ్బురపడ్డారు. కొండల్ రెడ్డి సేవా తత్పరత ఉపాధ్యాయులందరికీ ఆదర్శనీయమని కొనియాడారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని సూచించారు. భవిత కేంద్రంలో దివ్యాంగ విద్యార్థుల ఆట వస్తువుల కోసం స్థానిక సర్పంచ్ కవిత రూ.5 వేలు, ఉప సర్పంచ్ గండ్ర ప్రతాప్ రావు వారి తల్లి విజయలక్ష్మి జ్ఞాపకర్ధం రూ.5 వేలు, మాజీ ఉప సర్పంచ్ సందీప్ రెడ్డి కుర్చీలు, టేబుల్, కార్పెట్ విరాళంగా ఇచ్చేందుకు ప్రకటించారు. కార్యక్రమం అనంతరం నూతనంగా ఎన్నికైన సర్పంచ్ కవిత, ఉప సర్పంచ్ గండ్ర ప్రతాప్ రావులను అధికారులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఏఎంఓ చంద్ర శేఖర్ రెడ్డి మండల విద్యాధికారి బోనగిరి ప్రభాకర్, ఆర్ ఐ రాజేశ్వరి, ప్రధానోపాధ్యాయులు నందయ్య, మాజీ సర్పంచులు మెరుగు మురళీ గౌడ్, బండమీది ముత్తయ్య, మార్కెట్ కమిటీ డైరెక్టర్ జూపాక ప్రవీణ్, వార్డు సభ్యులు ఎర్రోళ్ల దీపక్, ఎనగనందుల నరేష్, సీఆర్పీ వైద్య వెంకటేష్, ఉపాద్యాయులు పాల్గొన్నారు.