కార్మిక, ధార్మిక క్షేత్రాల అభివృద్ధికి కృషి
ABN , Publish Date - Mar 07 , 2026 | 12:39 AM
ప్రజా ప్రభుత్వ పాలనలో సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో కార్మిక, ధార్మిక క్షేత్రాలైన సిరిసిల్ల, వేములవాడ అభివృద్ధికి ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని వేములవాడ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు.
- ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
- ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ప్రారంభం
వేములవాడ, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): ప్రజా ప్రభుత్వ పాలనలో సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో కార్మిక, ధార్మిక క్షేత్రాలైన సిరిసిల్ల, వేములవాడ అభివృద్ధికి ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని వేములవాడ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని వేములవాడలో కలెక్టర్ గరిమ అగ్రవాల్‌తో కలిసి శుక్రవారం ప్రారంభించారు. పారిశుద్య, ఇతర పనులపై ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, వాటిపై ప్రజలను చైతన్య పరచాలనే ఉద్దేశంతో సీఎం రేవంత్‌రెడ్డి ప్రజాపాలన, ప్రగతి ప్రణాళిక కార్యక్రమం అమలుకు శ్రీకారం చుట్టారని తెలిపారు. జిల్లాలోని మున్సిపాలిటీల ప్రజలకు ప్రజాపాలన, ప్రగతి ప్రణాళిక కింద ఆరు విభాగాల్లో స్పెషలిస్ట్ వైద్యుల ఆధ్వర్యంలో ఉచిత వైద్య పరీక్షలు నిర్వహిస్తామని వివరించారు. వేములవాడ నుంచి కోరుట్ల వరకు నిర్మిస్తిస్తున్న 100 ఫీట్ల రహదారి పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక నిధులతోనే మంజూరైందని స్పష్టం చేశారు. రహదారి మంజూరును కేంద్ర ప్రభుత్వ నిధులుగా చూపిస్తూ బీఆర్‌ఎస్ నాయకులు చేస్తున్న ప్రచారం పూర్తిగా దుష్పచారమని కొట్టిపడేశారు.
ఫ ప్రజలు భాగస్వామ్యం అయ్యేలా చూడాలి
కలెక్టర్ గరిమ అగ్రవాల్
ప్రజాపాలన, ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ప్రజలు భాగస్వామ్యం అయ్యేలా చూడాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ అన్నారు. వేములవాడలో చేపట్టిన కార్యక్రమానికి హాజరైన ఆమె మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, హాస్టళ్ల బయట, లోపల పరిశుభ్ర పనులు చేయాలని, రోడ్డు, మురుగు కాలువలు శుభ్రం చేయాలని, డంపింగ్ యార్డు పూర్తిస్థాయిలో వినియోగించాలని సూచించారు. ప్రజల భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. యువతకు జాబ్ మేళాలు నిర్వహించి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. ఫార్మర్స్ రిజిస్ర్టీ కింద జిల్లాలోని రైతులు తమ వివరాలు వ్యవసాయ అధికారుల వద్ద నమోదు చేసుకోవాల ని పిలుపునిచ్చారు. వచ్చే నెల ఏప్రిల్ 2వ తేదీన గ్రామసభ ఉంటుందని వెల్లడించారు. విద్యార్థులకు శారీరక, మానసిక ఆరోగ్యం కీలకమని స్పష్టం చేశారు. జిల్లాలోని రెసిడెన్షియల్ విద్యాలయాల్లో ప్రత్యేక వైద్య నిపుణుల ఆధ్వర్యంలో ఆరోగ్య పరీక్షలు చేయుస్తామని తెలిపారు. మహిళలు, మహిళా సంఘాల సభ్యులు సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో హెల్త్ ఫ్రొఫైల్‌లో భాగంగా వైద్య పరీక్షలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ, మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, వైస్‌చైర్మన్ నరాల శేఖర్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సంద్రగిరి శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, వైస్ చైర్మన్ కనికరపు రాకేష్ మున్సిపల్ కమిషనర్ సంపత్‌కుమార్ తదితరులు ఉన్నారు.