శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు
ABN , Publish Date - Jun 16 , 2026 | 11:42 PM
శాంతిభద్రతలకు విఘాతంకలిగించే వారిపట్ల కఠినంగా వ్యవహరించాలని ఎస్పీ మహేష్ బీ గీతే సూచించారు.
ఇల్లంతకుంట, జూన్ 16 (ఆంధ్రజ్యోతి) : శాంతిభద్రతలకు విఘాతంకలిగించే వారిపట్ల కఠినంగా వ్యవహరించాలని ఎస్పీ మహేష్ బీ గీతే సూచించారు. పోలీస్‌స్టేషన్‌ను మంగళవారం తనిఖీచేసి రికార్డులను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నేరాల నియంత్రణలో కీలకంగా భావించే సీసీ కెమారాలను దాతల సహకారంతో అన్ని గ్రామాలలో ఏర్పాటు చేయడానికి కృషి చేయాలన్నారు. యువకులు లక్ష్యాలను నిర్దేశించుకొని వాటి సాధనకు పాటుపడాలే తప్ప క్షణికమైన సంతోషం కోసం వ్యసనాలకు బానిసలుగా మారవద్దన్నారు. గంజాయి మత్తుకు అలవాటుపడి జీవితాలను పాడుచేసుకోవద్దని పేర్కొన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపి పట్టుబడితే చర్యలు తప్పవన్నారు. వాహనదారులు సరైన ధ్రువీకరణ పత్రాలు కలిగి ఉండాలని, మైనర్లకు తల్లిదండ్రులు వాహనాలు ఇవ్వవద్దని సూచించారు. పోలీస్‌స్టేషన్‌కు వచ్చేవారి సమస్యలు తెలుసుకొని పరిష్కారానికి ప్రాధాన్యమివ్వాలన్నారు. స్టేషన్‌లో నమోదు అయిన కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల రూరల్ సీఐ నాగేశ్వర్‌రావు, ఎస్సై సిరిసిల్ల అశోక్, పోలీస్‌సిబ్బంది పాల్గొన్నారు.