ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం
ABN , Publish Date - May 12 , 2026 | 01:09 AM
ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా విద్యా వారోత్సవాలను ప్రారంభించింది.
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా విద్యా వారోత్సవాలను ప్రారంభించింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలతోపాటు ప్రతి గ్రామం, తండాల్లో ప్రభుత్వ బడుల్లో అందిస్తున్న సౌకర్యాలను తల్లిదండ్రులు, స్థానిక ప్రజాప్రతినిధులకు వివరిస్తూ అధికారులు, ప్రభుత్వ ఉపాధ్యాయులు సంయుక్తంగా కార్యక్రమాల నిర్వహణకు శ్రీకారం చుట్టారు. ప్రజా భాగస్వామ్యంతో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచేలా అవగాహన కార్యక్రమాలు, వేసవి శిబిరాలు, ఆచార్య జయశంకర్ బడిబాట కార్యక్రమాలు, విద్యాభివృద్ధిపై వర్క్‌షాప్‌లు వంటి కార్యక్రమాలతో ఈనెల 17వతేది వరకు వారోత్సవాలు నిర్వహణ మొదలైంది. దీంతో పాటు రాబోయే 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన పాఠ్యపుస్తకాలతో పాటు ఇతర ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఇప్పటికే పీఎంశ్రీ పాఠశాలలో వివిధ పనుల కోసం ప్రభుత్వం నిధులు మంజూరుచేసింది. విద్యా ప్రమాణాల పెంపున కోసం విద్యార్థులకు ప్రత్యేకంగా కిట్లు పంపిణీ చేయనున్నారు. మధ్యాహ్నం భోజనంతో పాటు బ్రేక్‌ఫాస్ట్ అందించే కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమ మార్కులు సాధించిన పదో తరగతి, ఇంటర్ విద్యార్థులకు, ఉత్తమ క్రీడాకారులకు పదివేల చొప్పున 9 మందికి రూ 90 వేల నగదు పురస్కారాలను అందిస్తారు.
పకడ్బందీగా కార్యక్రమాలు..
రాజన్న సిరిసిల్ల జిల్లాలో 535 పాఠశాలల్లో 46,598 మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుంది. రెండు ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, 109 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, 13 కేజీబీవీ, 7మోడల్ స్కూల్, 337 మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలు, 38 మండల పరిషత్ అప్పర్ ప్రైమరీ పాఠశాలలు, మూడు మండల పరిషత్ ఉన్నత పాఠశాలలో, ఒకటి ఆర్‌బీఎస్, ఒకటి డీఎన్‌టీ పాఠశాలలు ఉన్నాయి. వీటి పరిధిలో 38,629 మంది విద్యార్థులు ఉన్నారు. ఇందులో బాలురు 18,179 మంది. బాలికలు 20,450మంది విద్యార్థులు ఉన్నారు. విద్యావారోత్సవాల్లో భాగంగా సోమవారం తొలిరోజు ప్రభుత్వ పాఠశాలల్లో భవనాలు, తాగునీటి సదుపాయాలు, బయోటాయిలెట్లు, పీఎంశ్రీ, కేజీబీవీలో సమ్మర్ క్యాంపులో నిర్వహణ మౌలిక సదుపాయాలపై సమీక్షలు నిర్వహించడంతోపాటు ప్రజాప్రతినిధులు, అధికారులు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ఇందులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గీతానగర్ పీఎంశ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తొలిరోజు వేసవి శిబిరాలను వేములవాడలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, సిరిసిల్లలో కలెక్టర్ గరీమ అగ్రవాల్ ప్రారంభించారు. జిల్లాలోని తొమ్మిది పీఎంశ్రీ పాఠశాలలతో పాటు రుద్రంగిలోని కేజీబీవీలో కార్యక్రమాలు చేపట్టారు. 12వ తేదీన 10వ తరగతి విద్యార్థులకు ప్రత్యేకంగా శిబిరాల నిర్వహణ, అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు రాసే విద్యార్థులకు ఈనెల 15 నుంచి ఉదయం 9.30 సాయంత్రం 4.30గంటల వరకు ప్రత్యేకత శిబిరాలను నిర్వహించారు. 13వ తేదీన గ్రామ సర్పంచులతో విద్యాభివృద్ధిపై నియోజకవర్గాల స్థాయి వర్క్‌షాప్ నిర్వహిస్తారు. విద్యార్థుల నమోదు పెంపు, డ్రాప్ అవుట్ తగ్గింపు వంటి అంశాలపై చర్చిస్తారు.
14న బడిబాట
విద్యావారోత్సవాల్లో భాగంగా ఉపాధ్యాయులందరితోపాటు ప్రజల భాగస్వామ్యంతో ఆచార్య జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. పాఠశాలలను శుభ్రపరిచి, అలంకరిస్తారు. ఇంటింటికి వెళ్లి పాఠశాలలో విద్యార్థుల ప్రవేశాలపై అవగాహన కల్పించనున్నారు. తల్లిదండ్రులు, పోషకులతో సమావేశాలు నిర్వహించి విద్యార్థుల ప్రవేశాల సంఖ్య పెంచేందుకు చర్యలు తీసుకుంటారు. 15న గ్రంథాలయ దినోత్సవం నిర్వహిస్తారు ప్రతి పాఠశాలలో గ్రంథాలయం ఏర్పాటు చేస్తారు. పాఠశాల, పంచాయతీ, పట్టణ, జిల్లా గ్రంథాలయాలను అలంకరించి పుస్తక ప్రదర్శనలను ఏర్పాటు చేస్తారు డిజిటల్ క్లాస్ రూమ్ ప్రదర్శన, విద్యార్థులు పట్టణాభివృద్ధి పెంపొందించే దిశగా అవగాహన కల్పిస్తారు. 16వ తేదీన సాహిత్యం, హస్తకళలు, సంగీతం, నృత్యం నాటకం పోటీలు మండల, జిల్లాస్థాయిలో నిర్వహిస్తారు. పర్యావరణహిత పదార్థాల వినియోగాన్ని ప్రోత్సహిస్తూ విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీయనున్నారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారిని రాష్ట్రస్థాయి పోటీలకు పంపిస్తారు.
చివరి రోజు విద్యార్థులకు నగదు పురస్కారాలు
జిల్లాలో వారం రోజులపాటు వివిధ కార్యక్రమాలను విద్యావారోత్సవాల్లో నిర్వహించి చివరిరోజు విద్యా విజయోత్సవాన్ని నిర్వహిస్తారు. ఇందులో భాగంగా 10వ తరగతి, ఇంటర్, క్రీడారంగాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సన్మానిస్తారు. పదో తరగతి, ఇంటర్ ఫలితాల్లో టాప్-3 సాధించిన విద్యార్థులకు, అలాగే క్రీడారంగంలో ప్రతిభ చూపిన ముగ్గురికి రూ 10వేల చొప్పున నగదు పురస్కారాలను అందిస్తారు.