Share News

రుక్మాపూర్‌లో ఈదురుగాలుల బీభత్సం

ABN , Publish Date - Jun 01 , 2026 | 12:21 AM

మండలంలోని రుక్మాపూర్‌ గ్రామంలో ఆదివారం రాత్రి ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. పది నిమిషాల ఈదురుగాలులు అనేక విద్యుత్‌ స్తంభాలను నేలకూల్చాయి.

రుక్మాపూర్‌లో ఈదురుగాలుల బీభత్సం
రుక్మాపూర్‌లో విరిగిపోయిన విద్యుత్‌ స్తంభాలు

చొప్పదండి, మే 31 (ఆంధ్రజ్యోతి): మండలంలోని రుక్మాపూర్‌ గ్రామంలో ఆదివారం రాత్రి ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. పది నిమిషాల ఈదురుగాలులు అనేక విద్యుత్‌ స్తంభాలను నేలకూల్చాయి. షెడ్లపై ఉన్న రేకులు కొట్టుకుపోయాయి. విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో గ్రామమంతా అంధకారంగా మారింది. గ్రామ సర్పంచ్‌ కర్రె హేమలతకు చెందిన ట్రాక్టర్‌ ట్యాంకర్‌ గాలుల ధాటికి 50 అడుగుల దూరం కొట్టుకుపోయింది. ఇంటి ఎదుట నిలిపి ఉంచిన ట్రాక్టర్‌ ట్యాంకర్‌ ఈదురు గాలులకు పల్టీలు కొట్టింది. ఇంటి వెనకాల ఉన్న రేకుల షెడ్‌ ధ్వంసమయింది. రేకులు కొట్టుకుపోయి వంద మీటర్ల దూరంలో పడిపోయాయి. ఫకీర్‌పేట, కాట్నపల్లి గ్రామానికి వెళ్లే రోడ్డుపై విద్యుత్‌ స్తంభాలు విరిగిపోయాయి. అనేక చెట్లు నేలకూలాయి. పది నిమిషాల ఈదురుగాలలు గ్రామస్తులను భయభ్రాంతులకు గురి చేశాయి. రాయపట్నం రహదారిపై చెట్టు పడిపోయింది. దీంతో కాసేపు రాకపోకలు నిలిచిపోయాయి. గ్రామస్తులు పడిపోయిన చెట్టును తొలగించడంతో వాహనాల రాకపోకలు యథావిధిగా సాగాయి.

Updated Date - Jun 01 , 2026 | 12:21 AM