Share News

వస్త్రాల తయారీ ఆర్డర్‌ను నిలిపివేయడం దుర్మార్గమైన చర్య

ABN , Publish Date - Apr 04 , 2026 | 12:47 AM

సిరిసిల్లలో తయారు చేస్తున్న ఆర్వీఎం వస్త్రాలను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయడం దుర్మార్గమైన చర్య అని సీఐటీయూ పవర్‌లూంవర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్రఅధ్యక్షుడు మూషం రమేష్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

వస్త్రాల తయారీ ఆర్డర్‌ను నిలిపివేయడం దుర్మార్గమైన చర్య

సిరిసిల్ల అర్బన్‌, ఏప్రిల్‌ 3 (ఆంధ్రజ్యోతి): సిరిసిల్లలో తయారు చేస్తున్న ఆర్వీఎం వస్త్రాలను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయడం దుర్మార్గమైన చర్య అని సీఐటీయూ పవర్‌లూంవర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్రఅధ్యక్షుడు మూషం రమేష్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. సిరిసిల్లపట్టణం బీవైనగర్‌లోని అమృత్‌ లాల్‌శుక్లా కార్మికభవనంలో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావే శంలో రమేష్‌ మట్లాడారు. 2026-2027సంవత్సరానికి రూ.105కోట్ల విలువ గల ఆర్వీఎం వస్త్రాల తయారీ ఆర్డర్‌లను రాష్ట్రప్రభుత్వం రద్దుచేయడం సరికాదన్నారు. చేనేతపవర్‌లూం పరిశ్రమలపై రాష్ట్రప్రభుత్వం కక్ష సాధిం పు చర్యలు మానుకోవాలన్నారు. 2026-27విద్యాసంవత్సరానికి సంబంధించి టెస్కోకు ఇచ్చిన ఏకరూప దుస్తుల ఆర్డర్‌లను అకస్మాత్తుగా రద్దు చేస్తూ చేనేత శాఖకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేయడంతో చేనేత మరమగ్గాల కార్మికుల జీవనోపాధిపై పెద్దఎత్తున ప్రభావం పడుతుందన్నారు. కమీషన్ల కోసం టెండర్‌లతో ఆర్డర్‌లను ప్రైవేట్‌ సంస్థలకు ఇవ్వడం ఒక దుర్మార్గపు చర్య అని అన్నారు. ఆర్వీఎం వస్త్రాలు తయారు చేయడానికి రూ.50కోట్ల విలువగల నూలు ఖరీదుచేసి వస్ర్తాలను తయారు చేయడానికి సిద్ధమవు తున్న తరుణంలో అకస్మాత్తుగా చేనేత జౌళిశాఖ అధికారులు ఆర్డర్‌లను రద్దు చేశారన్నారు. నేతన్నల పరిస్థితి ఏం కావాలని ప్రశ్నించారు. ఇప్పటికే వస్త్ర పరిశ్రమలు మూతపడే పరిస్థితిచేరుకున్నాయన్నారు. ప్రజాప్రభుత్వం అని చెప్పుకునే కాంగ్రెస్‌విధానం ఇదేనా అని ప్రశ్నించారు. టెండర్‌ విధా నాన్ని వెంటనే రద్దుచేసి టెస్కోకు విద్యాశాఖ నుంచి ఏకరూప దుస్తుల ఆర్డర్‌లను పునరుద్ధరిస్తూ ఆర్డర్‌ జారీచేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు కోడం రమణ, జిల్లా నాయకులు సిరిమల సత్యం, ఒగ్గు గణేష్‌, నక్క దేవదాస్‌, సందుపట్ల పోచమల్లు, సత్యం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 04 , 2026 | 12:47 AM