ఆగమై.. అప్పులు భారమై..
ABN , Publish Date - Feb 19 , 2026 | 12:50 AM
మున్సిపల్ ఎన్నికల పుణ్యామా అని... వందలాది కుటుంబాల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. పోటీ కోసం చేసిన ఖర్చు తడిసి మోపడయ్యాయి. ఇప్పుడు అప్పులు తీర్చేదెలా..? అని ఓటమి చెందిన అభ్యర్థుల కుటుంబాల్లో తీవ్ర అంతర్మథనం నెలకొంది. రిజర్వేషన్లు అనుకూలంగా వచ్చాయని పోటీ చేస్తే..తీరా ఇంత పెద్ద ఎత్తున ఖర్చు చేసినా..గెలువకపోతిమి. ఉన్న ఆస్థులు, బంగారం పాయే..అప్పుల కుప్పాయే..అంటూ చాలా కుటుంబాలు కుమిలి పోతున్నాయి.
జగిత్యాల, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి): మున్సిపల్ ఎన్నికల పుణ్యామా అని... వందలాది కుటుంబాల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. పోటీ కోసం చేసిన ఖర్చు తడిసి మోపడయ్యాయి. ఇప్పుడు అప్పులు తీర్చేదెలా..? అని ఓటమి చెందిన అభ్యర్థుల కుటుంబాల్లో తీవ్ర అంతర్మథనం నెలకొంది. రిజర్వేషన్లు అనుకూలంగా వచ్చాయని పోటీ చేస్తే..తీరా ఇంత పెద్ద ఎత్తున ఖర్చు చేసినా..గెలువకపోతిమి. ఉన్న ఆస్థులు, బంగారం పాయే..అప్పుల కుప్పాయే..అంటూ చాలా కుటుంబాలు కుమిలి పోతున్నాయి.
అగమ్యగోచరంగా అభ్యర్థుల పరిస్థితి..
జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, రాయికల్, ధర్మపురి మున్సిపల్ ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. తాహతుకు మించి ఖర్చుపెట్టినా ఫలితం లేకపోవడంతో దిక్కుతోచని పరిస్థితికి గురవుతున్నారు. ఉన్న ఆస్థులు పోయి అప్పుల పాలయ్యారు. చాలా మంది ఎన్నికల ఖర్చు కోసం తమ పొలాలు, ప్లాట్లు, ఇళ్లు, బంగారం కుదవ పెట్టి అప్పులు తీసుకున్నారు. మరికొందరైతే ఏకంగా ఆస్థులకు రిజిసే్ట్రషన్లే చేసి డబ్బులు తీసుకున్నారు. రూ. 50 లక్షల వరకు పైగా విలువ ఉన్న ప్లాటును, పొలాన్ని కేవలం రూ. 20 లక్షల నుంచి రూ. 30 లక్షల లోపే తీసుకొని సేల్ డీడ్‌లు చేయించిన సంఘటనలు ఉన్నాయి. మరికొందరు తమకు నమ్మకం ఉన్న వారి దగ్గర, తమ బంధువుల వద్ద రూ. లక్షల్లో అప్పులు తెచ్చి ఖర్చు పెట్టారు. తీరా ఫలితాలు విరుద్ధంగా రావడంతో తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు.
పార్టీల నుంచి భరోసా అందక..
ఓడిపోయి నైరాశ్యంలో ఉన్న అభ్యర్థులకు వారివారి ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు పెద్దల నుంచి పెద్దగా ధైర్యం, భరోసా కూడా లేకపోవడంతో ఇంకా ఆందోళనకు గురవుతున్నారు.
జిల్లాలో పోటీచేసిన అభ్యర్థులు 655 మంది...
జిల్లాలోని అయిదు మున్సిపాలిటీల్లో గల వార్డుల్లో 655 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. ఇందులో ధర్మపురి మున్సిపాలిటీల్లోని 15 వార్డుల్లో 52 మంది అభ్యర్థులు, జగిత్యాలలోని 50 వార్డుల్లో 254 మంది, కోరుట్లలో 33 వార్డుల్లో 150 మంది, మెట్‌పల్లిలోని 26 వార్డుల్లో 150 మంది, రాయికల్‌లోని 12 వార్డుల్లో 49 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. కాగా జిల్లాలోని అయిదు మున్సిపాలిటీల్లో కలిపి అమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి ఒక్కరు, బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థి ఒక్కరు, బీజేపీ అభ్యర్థులు 125 మంది, సీపీఐ (ఎం) అభ్యర్థులు ఇద్దరు, కాంగ్రెస్ అభ్యర్థులు 135 మంది, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థులు తొమ్మిది మంది, సీపీఐ అభ్యర్థులు ముగ్గురు, జనసేన అభ్యర్థులు 24 మంది, ఇతర రిజిస్టర్డ్ పార్టీల అభ్యర్థులు 12 మంది, స్వతంత్రులు 184 మంది మున్సిపల్ ఎన్నికల్లో పోటీ పడ్డారు.
పోటాపోటీగా ఖర్చు...
జిల్లాకేంద్రంలోని పలు వార్డులు, జిల్లాలో పట్టణాలకు దగ్గరగా ఉన్న వార్డులు, రాజకీయంగా పలుకుబడి ఉన్న వార్డుల్లో, పట్టణాల్లో ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో చాలా మంది అభ్యర్థులు పోటీ పడి ఖర్చు చేశారు. చాలా మంది అభ్యర్థులు రూ. 30 లక్షల నుంచి రూ. 60 లక్షల వరకు, మరికొందరు రూ. 60 లక్షల నుంచి రూ. కోటికి పైగా ఇలా ఇంతకంటే ఎక్కువే ఖర్చు పెట్టి ఓడిపోయారు. మరికొందరు అధికంగా ఖర్చు చేసి గెలుపొందారు.
ప్రధాన పార్టీల్లో పోటాపోటీ....
ప్రధాన రాజకీయ పక్షాలకు చెందిన పలువురు అభ్యర్థులు వ్యయం చేయడానికి పోటీ పడ్డారు. ఎక్కువ ఖర్చు పెట్టగలిగే సత్తా ఉన్న నాయకులకే పార్టీలు టికెట్లను కేటాయిస్తామని తేల్చి చెప్పారు. మున్సిపల్ ఎన్నికల గెలుపొందాలంటే అంగబలం, అర్ధబలం ఉంటేనే విజయం వరిస్తుందన్న కారణంతో పార్టీలు సైతం అటువంటి అభ్యర్థులను ఆచితూచి ఎంపిక చేశారు. దీంతో పోటీలో నిలిచిన పార్టీ అభ్యర్థులకు వ్యయభారం తప్పలేదు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఇతర పార్టీల్లో సైతం వ్యయం వ్యవహారంలో అదేతీరు చోటుచేసుకుంది.. ప్రధాన పార్టీ అభ్యర్థులతో పోటీపడి ఖర్చులు పెట్టడానికి పలు పట్టణాలు, వార్డుల్లో ప్రయత్నించారు. మున్సిపల్ చైర్మన, వైస్ చైర్మన పదవిపై ఆశతో పోటీలో ఉంటున్న పలువురు అభ్యర్థులు వ్యయభారం మోశారు. ప్రత్యర్థులకు ధీటుగా అర్ధబలం, అంగబలం ఉపయో గించి పలు స్థానాల్లో అభ్యర్థులు పోటికి దిగారు.
గెలిచిన వారి పరిస్థితి అంతే...
ఓడిపోయిన మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, వార్డు కౌన్సిలర్ల పరిస్థితే కాదు..రూ. లక్షలు పెట్టి గెలిచిన మున్సిపల్ చైర్మన్లు, వైస్‌చైర్మన్లు, వార్డు కౌన్సిలర్ల పరిస్థితి కూడా దయనీయంగానే తయారైంది. రూ. లక్షలు పెట్టి గెలిచాం.. ఈ అప్పులు ఎలా తీర్చాలో ఏం చేద్దామన్న ఆలోచనలో చాలా మంది గెలిచిన మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, వార్డు కౌన్సిలర్లు తలలు పట్టుకుంటున్నారు. ఏదిఏమైనా మున్సిపల్ ఎన్నికలు చాలా కుటుంబాలను ఆర్థికంగా, మానసికం గా కోలుకోలేకుండా చేశాయన్న అభిప్రాయాలున్నాయి.
కుటుంబాల్లో కంటతడి..
గెలుస్తామన్న నమ్మకంతో ఉన్న ఆస్థులు తాకట్టు పెట్టి లక్షల రూపాయలు ఖర్చు పెట్టినా గెలవకపోవడంతో చాలామంది ఓడిపోయిన అభ్యర్థులు, వారి కుటుంబాలు ఇంకా ఆ షాక్ నుంచి తేరుకోలేకపోతున్నాయి. పైసలు తీసుకుండ్రు...తాగిండ్రు...తిన్నరు..మమ్నల్ని మోసం చేసిండ్రు.. ఈ అప్పులు ఎట్లా తీర్చాలో... అంటూ చాలా కుటుంబాలు కంటతడి పెడుతున్నాయి. బంధువులు వచ్చి ధైర్యం చెబుతూ ఓదారుస్తున్న పరిస్థితి చాలా కుటుంబాల్లో కనబడుతోంది.