Share News

సోలార్‌ విద్యుత్‌ వైపు అడుగులు

ABN , Publish Date - Jul 03 , 2026 | 12:38 AM

రైతులకు ఎరువులు, విత్తనాలు, పంట రుణాలు అందించడం, ధాన్యం కొనుగోలు, పెట్రోల్‌ బంకుల నిర్వహణతోనే పరిమితమైన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఇప్పుడు మరో రంగంలోకి అడుగు పెడుతున్నాయి.

సోలార్‌ విద్యుత్‌ వైపు అడుగులు

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

రైతులకు ఎరువులు, విత్తనాలు, పంట రుణాలు అందించడం, ధాన్యం కొనుగోలు, పెట్రోల్‌ బంకుల నిర్వహణతోనే పరిమితమైన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఇప్పుడు మరో రంగంలోకి అడుగు పెడుతున్నాయి. రాష్ట్రంలోనే తొలిసారిగా పెద్దపల్లి జిల్లాలోని నాలుగు సహకార సంఘాలు సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేస్తూ ప్రత్యా మ్నాయ ఆదాయ వనరులను సృష్టిస్తున్నాయి. జిల్లా లోని పెద్దపల్లి మండలం అప్పన్నపేట ప్రాథమిక వ్యవ సాయ సహకార సంఘం పరిధిలోని రాఘవపూర్‌, మంథని సహకార సంఘం పరిధిలోని గుంజపడుగు, కాల్వశ్రీరాంపూర్‌ సహకార సంఘం ఆధ్వర్యంలోని పాం డవులగుట్ట, ధర్మారం మండలం నందిమేడారం తదితర ప్రాంతాల్లో ఒక్కో మెగావాట్‌ సామర్థ్యంతో సోలార్‌ విద్యుత్‌ కేంద్రాల నిర్మాణం జరుగుతోంది. ఒక్కో కేంద్రం కోసం మూడు నుంచి నాలుగు ఎకరాల స్థలాన్ని జిల్లా యంత్రాంగం కేటాయించింది. రెడ్కో సాంకేతిక సహకా రంతో ఒక్కో ప్లాంటు నిర్మాణానికి 3.50 కోట్ల రూపా యల నుంచి 4 కోట్ల రూపాయల వరకు వ్యయం చేస్తు న్నారు. ఇందులో నాబార్డు 3 కోట్ల రూపాయల వరకు రుణం సమకూర్చింది. 2 కోట్ల వరకు ఒక శాతం వడ్డీకే రుణం అందిస్తుండగా, మిగిలిన కోటి రూపాయల వరకు నాలుగు శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది.

ఫ విద్యుత్‌ కొనుగోలుకు ఒప్పందం..

ఈ ప్లాంట్లలో ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను కొనుగోలు చేసేందుకు ఉత్తర తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఎన్‌పీడీసీఎల్‌) ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకుంది. ఒక్కో యూనిట్‌కు 3 రూపాయల చొప్పున చెల్లించను న్నట్లు సమాచారం. ఒక్కో ప్లాంటులో రోజుకు సగటున 10 వేల నుంచి 12 వేల యూనిట్ల విద్యుత్‌ ఉత్పత్తి అయితే 9 లక్షల నుంచి 12 లక్షల రూపాయల వరకు ఆదాయం వచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. రుణ కాలపరిమితి ఎనిమిదేళ్ల ఉం డడంతో సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి ద్వారా వచ్చే డబ్బు లను రుణ కాల పరిమితి ముగిసేలోపే చెల్లించవచ్చు. ఆ తర్వాత వచ్చే ఆదాయంలో నిర్వహణ ఖర్చులు పోనూ సంఘాలకు ఆదాయం మిగలనున్నది. ఆరు నెలల క్రితం ప్రారంభమైన నిర్మాణ పనులు ప్రస్తుతం తుది దశకు చేరుకున్నాయి. రాఘవాపూర్‌, గుంజప డుగు, నందిమేడారం తదితర ప్రాంతాల్లో సోలార్‌ ప్యానెళ్ల బిగింపు దాదాపు పూర్తయింది. మిగిలిన సాంకేతిక పనులు పూర్తి చేసి ప్లాంట్లను ఆరంభించి వచ్చే నెలాఖరు నాటికి విద్యుత్‌ ఉత్పత్తిని ప్రారంభించేం దుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

ఫ సంఘాలకు శాశ్వత ఆదాయం..

ఈ ప్రాజెక్టులు అందుబాటులోకి వస్తే సహకార సం ఘాలకు ప్రతీ నెల స్థిరమైన ఆదాయం సమకూర నున్నది. ఆ నిధులను రైతు సేవల విస్తరణ, మౌలిక వసతుల అభివృద్ధి, సంఘాల ఆర్థిక బలోపేతానికి వినియోగించే అవకాశం ఉండటంతో జిల్లాలో సహకార రంగానికి కొత్త ఊపు రానుందని అధికారులు భావిస్తు న్నారు. ఇప్పటికే ధాన్యం కొనుగోళ్ల ద్వారా వచ్చే కమిషన్‌ డబ్బులతో జిల్లాలోని సహకార సంఘాలు అభివృద్ధి బాటలో నడుస్తున్నాయి. చిన్నకల్వల, సుల్తానాబాద్‌ సం ఘాల పరిధిలో పెట్రోల్‌ బంకులను ఏర్పాటు చేశారు. ఇక్కడి సోలార్‌ ప్లాంట్లు విజయవంతమైతే రాష్ట్ర వ్యాప్తంగా సహకార సంఘాలకు పెద్దపల్లి జిల్లా ఆదర్శంగా నిలిచే అవకాశం కనిపిస్తోంది.

ఫ వచ్చే నెలాఖరుకల్లా అందుబాటులోకి..

- శ్రీమాల, జిల్లా సహకార శాఖాధికారి, పెద్దపల్లి

రాష్ట్రంలో సోలార్‌ విద్యుత్‌కు డిమాండ్‌ పెరగడంతో జిల్లాలోని నాలుగు సహకార సంఘాల పరిధిలో సోలార్‌ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష నిర్ణయించారు. మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, ప్రభుత్వ విప్‌ చింతకుంట విజయరమణారావుల ప్రోత్సాహంతో ఒక్కో సంఘానికి 3 నుంచి 4 ఎకరాల వరకు ప్రభుత్వ భూమిని కేటా యించారు. ప్లాంట్ల నిర్మాణ పనులు తుది దశలో ఉన్నాయి. సాంకేతిక సమస్యలను అధిరోహించిన తర్వాత వచ్చే నెలాఖరు వరకు విద్యుత్‌ అందుబాటులోకి తీసుకవస్తాం.

Updated Date - Jul 03 , 2026 | 12:38 AM