Share News

నిలిచిన ఆర్థికసంఘం నిధులు

ABN , Publish Date - Oct 24 , 2026 | 12:37 AM

జడ్పీటీసీ, ఎంపీటీసీల పదవీ కాలం 2024 జూలై 4వ తేదీతో ముగియడంతో ఆర్థికసంఘం నిధులు నిలిచిపోయాయి. జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌లలో ప్రత్యేకాధికారుల పాలన అమలులోకి వచ్చింది.

నిలిచిన ఆర్థికసంఘం నిధులు

-27 నెలల క్రితం ముగిసిన పరిషత్‌ పాలకవర్గాల పదవీకాలం

- అప్పటి నుంచి ప్రత్యేకాధికారుల పాలనలోనే..

- పరిష్కారానికి నోచుకోని ప్రజా సమస్యలు

- జిల్లాలో 20 మండల పరిషత్‌లు

జగిత్యాల, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): జడ్పీటీసీ, ఎంపీటీసీల పదవీ కాలం 2024 జూలై 4వ తేదీతో ముగియడంతో ఆర్థికసంఘం నిధులు నిలిచిపోయాయి. జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌లలో ప్రత్యేకాధికారుల పాలన అమలులోకి వచ్చింది. అప్పటి నుంచి ఆరు నెలల కొకసారి పొడిగిస్తూనే ఉన్నారు. పంచాయతీ ఎన్నికల అనంతరం మండల, జిల్లా పరిషత్‌లకు ఎన్నికల నిర్వహణ కోసం రిజర్వేషన్లు ఖరారు చేసి ప్రక్రియ కూడా మొదలైన తరువాత ఎన్నికలు వాయిదా పడ్డాయి. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుదల అంశం కొలిక్కి రాకపోవడంతో ఎన్నికలను వాయిదా వేశారు. ఆ తర్వాత మళ్లీ ఎన్నికల ఊసే ఎత్తడం లేదు. జిల్లా వ్యాప్తంగా 20 మండల పరిషత్‌లు, ఒకటి జిల్లా పరిషత్‌లకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది.

ఫఏటా రూ.6.5 కోట్లు నిధులు..

మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌లకు పాలకవర్గాలు లేకపోవడంతో 15వ ఆర్థిక సంఘం నిధులు నిలిచిపోయాయి. జనరల్‌ ఫండ్‌ మినహా మరే ఇతర నిధులు లేకపోవడంతో ఆయా కార్యాలయాల ద్వారా ఎలాంటి అభివృద్ధి పనులు జరిగే పరిస్థితి లేకుండా పోయింది. జిల్లా పరిషత్‌కు ప్రతీ సంవత్సరం రూ.1.80 కోట్లు మేర 15వ ఆర్థిక సంఘం నిధులు వచ్చేవి. మండల పరిషత్‌లన్నింటికి కలిపి రూ.4.70 కోట్లు వచ్చేవి. రెండేళ్ల కాలంలో మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌లకు రూ.6.50 కోట్ల మేర నిధులు నిలిచిపోయాయి. మండల, జిల్లా పరిషత్‌ల ద్వారా ఎంపీటీసీ సభ్యులు, జడ్పీటీసీ సభ్యులు గ్రామాల్లో వివిధ అభివృద్ధి పనులు చేపట్టేవారు. రెండేళ్లుగా పాలకవర్గాలు లేకపోవడంతో నిధులు నిలిచిపోయాయి. దీంతో అభివృద్ధికి ఆటంకం కలుగుతోంది.

ఫచర్చకు నోచుకోని సమస్యలు..

ప్రతి మూడు నెలలకు ఒకసారి జరిగే జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌ సమావేశాలు నిర్వహించే వారు. ఇందులో ప్రజల సమస్యలపై సమగ్ర చర్చ జరిగేది. ఆయా సమస్యలపై సంబంధిత అధికారులు స్పందించి వాటికి పరిష్కార మార్గం చూపేవారు. జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశంలో అయితే మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు పాల్గొని ఎన్నో సమస్యలను సభ దృష్టికి తీసుకువెళ్లి వాటిపై చర్చ జరిపి పరిష్కారం చూపేవారు. ప్రభుత్వం వద్ద పరిష్కరించాల్సిన సమస్య అయితే సభలో తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపించేవారు. మండల స్థాయి లోనూ మండల పరిషత్‌ సర్వసభ్య సమావేశాల్లో ఎమ్మెల్యేలు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్‌లు పాల్గొని సమస్యలను లెవనెత్తేవారు. ఒక్కోసారి ఒక్కో శాఖపై గంటల కొద్ది చర్చలు జరిపేవారు. వ్యవసాయం, విద్యుత్‌, తాగునీరు, సాగు నీరు ఇలా ఆయా ప్రధాన శాఖలపై సుధీర్ఘంగా చర్చించేవారు. ప్రస్తుతం ఎల్‌నినోతో నెలకొన్న కరువు పరిస్థితులు, కరెంటు కోతల గురించి చర్చించాలంటే మండల, జిల్లా పరిషత్‌లకు పాలకవర్గాలు లేకుండా పోయాయి. దీంతో వాటిపై ఎలాంటి చర్చ జరిగే అవకాశం లేదు. జిల్లాలో అనేక సమస్యలు ఉన్నా వాటిపై చర్చించే వేదికలు లేకపోవడంతో ప్రజల సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు.

ఫకరువైన పర్యవేక్షణ...

మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌లకు పాలక వర్గాలు లేకపోవడంతో కార్యాలయాల్లో పర్యవేక్షణ కూడా కరువైంది. మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌లలో జడ్పీ చైర్మన్‌, ఎంపీపీలకు ప్రత్యేక చాంబర్‌లు ఉంటాయి. నిత్యం ఎంపీపీ, జడ్పీ చైర్మన్‌ తన కార్యాలయానికి రావడం, అధికారులతో వివిధ అంశాలపై చర్చించేవారు. అధికారులతో కలిసి క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణకు వెళ్లే వారు. పాలక వర్గాలు లేకపోవడం వల్ల అధికారులపై, కార్యాలయాలపై పర్యవేక్షణ సైతం కొరవడింది. పరిషత్‌ ఎన్నికలు నిర్వహించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Oct 24 , 2026 | 12:37 AM