Share News

ధాన్యం టెండర్లకు రంగం సిద్ధం

ABN , Publish Date - Aug 26 , 2026 | 12:55 AM

గడిచిన యాసంగి సీజన్‌లో కోటాకు మించి కొనుగోలు చేసిన ధాన్యం రైస్‌మిల్లులు, గోదా ముల్లో గుట్టలు గుట్టలుగా పేరుకుపోయింది.

 ధాన్యం టెండర్లకు రంగం సిద్ధం

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

గడిచిన యాసంగి సీజన్‌లో కోటాకు మించి కొనుగోలు చేసిన ధాన్యం రైస్‌మిల్లులు, గోదా ముల్లో గుట్టలు గుట్టలుగా పేరుకుపోయింది. దీంతో మిగులు ధాన్యాన్ని టెండర్లు వేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేయడంతో మిల్లర్లు ఊపిరి పీల్చుకుంటున్నారు. గడిచిన యాసంగి సీజన్‌లో రాష్ట్రంలో రికార్డు స్థాయిలో రైతులు ధాన్యాన్ని పండించారు. ఈ ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసేందుకు గ్రామ గ్రామాన కొను గోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఎక్కువగా రైతులు దొడ్డు ధాన్యాన్ని పండించడంతో ప్రభు త్వం ప్రకటించిన మద్దతు ధరలను పొందేం దుకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు ఎక్కువగా ధాన్యాన్ని విక్రయించారు. దొడ్డు రకంఽ ధాన్యం మొత్తం బాయిల్డ్‌ రైస్‌ కింద ఎఫ్‌సీఐకి ఇవ్వనున్నారు. ఈ సీజన్‌కు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో 45 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు అనుమతులు ఇచ్చింది. అయితే రికార్డు స్థాయిలో ధాన్యం రావడంతో ప్రభుత్వం 72 లక్షల 30 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. ఇందులో 58 లక్షల 80 వేల దొడ్డు రకం ధాన్యం కాగా, 13 లక్షల 50 వేల మెట్రిక్‌ టన్నులు సన్నరకం ధాన్యాన్ని కొనుగోలు చేశారు. 45 లక్షలకు మించి ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు అనుమితించా లని రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు కేంద్రాన్ని కోరడంతో మరొక ఐదు లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో 50 లక్షల టన్నులకు చేరింది. అయితే అంతకు మించి ధాన్యం కొనుగోలు చేయడంతో మిగులు ధాన్యాన్ని బహిరంగ మార్కెట్లో విక్రయించాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు మొదట 17 లక్షల 54 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని విక్రయించేందుకు రెండు, మూడు రోజుల్లో ఈ టెండర్లను ఆహ్వానించింది.

ఫ జిల్లాలో 4.80 లక్షల టన్నుల ధాన్యం..

గడిచిన రబీ సీజన్‌లో జిల్లాలో కొనుగోలు కేం ద్రాల ద్వారా 4 లక్షల 46 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఈ ధాన్యాన్ని సీఎంఆర్‌ కింద కేటాయించిన రైస్‌మిల్లులకు పంపించారు. అలాగే వీటికి తోడు నిర్మల్‌, మంచిర్యాల, మేడ్చల్‌, వికారాబాద్‌, భూపాలపల్లి జిల్లాల నుంచి 34 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం ఇక్కడ మిల్లులకు కేటాయించారు. మొత్తం నాలుగు లక్షల 80 వేల టన్నుల ధాన్యాన్ని మరఆడించి సీఎంఆర్‌ కింద రైస్‌మిల్లర్లు ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంది. ఈ సీజన్‌కు సంబంధించిన ధాన్యమే కాకుండా వానాకాలం సీజన్‌కు సంబంధించిన ధాన్యం నిల్వలు కూడా రైస్‌మిల్లులు, ఇతర ప్రభుత్వ సంస్థల గోదా ములలో నిల్వ ఉన్నాయి. వానాకాలం సీజన్‌ కు సంబంధించి ప్రభుత్వం సీఎంఆర్‌ కింద ఇచ్చిన ధాన్యంలో 45 శాతం మర ఆడించి బియ్యాన్ని ప్రభుత్వానికి అందజేశారు. రబీ సీజన్‌కు సం బంధించిన ధాన్యంలో 35 శాతం సీఎంఆర్‌ పూర్తి చేసి బియ్యాన్ని పెట్టారు. మిల్లులు, గోదా ముల్లో ఉన్న ధాన్యాన్ని విక్రయించేందుకు ప్రభు త్వం టెండర్లను ఆహ్వానించాలని నిర్ణయించింది.

ఫ ముందస్తుగా టెండర్లు..

గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం రైస్‌మిల్లులో ఉన్న ధాన్యం ముక్కిపో కుండా ఉండేందుకు ముందస్తుగానే టెండర్లను ఆహ్వానిస్తున్నది. కేంద్ర ప్రభుత్వం అనుమతిం చిన 50 లక్షల టన్నులకు మించి అదనంగా ధాన్యం కోటా ఇవ్వదని భావించిన ప్రభుత్వం ఉన్న ధాన్యాన్ని టెండర్లు వేసి ప్రజా ధనాన్ని దుర్వినియోగం గాకుండా చర్యలు చేపడుతు న్నది. ఇప్పటికే గత ప్రభుత్వ హయాంలో సీఎంఆర్‌ కింద సేకరించిన ధాన్యానికి సం బంధించిబియ్యాన్ని రికవరీ చేయడానికి ప్రభు త్వం తంటాలు పడుతున్నది. క్రిమినల్‌ కేసులు పెడుతున్నా కూడా రికవరీ పూర్తి కావడం లేదు. రెండేళ్ల క్రితం టెండర్‌ వేసిన ధాన్యాన్ని ఇప్పటికీ మిల్లర్లు ఇవ్వాల్సి ఉంది. ఆలస్యం చేస్తే ఎక్కడ మిల్లర్లు ఆ ధాన్యాన్ని విక్రయించుకుని సొమ్ము చేసుకుంటారోనని, ఒకవేళ విక్రయిస్తే రికవరీ విషయంలో ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుం దని భావిస్తున్న ప్రభుత్వం మిగులు ధాన్యాన్ని టెండర్లు వేయాలని నిర్ణయించింది. ఇప్పుడున్న ధాన్యం మిల్లుల నుంచి నల్ల బజారుకు తరలి పోకముందే ప్రభుత్వం టెండర్లకు వెళుతున్నది.

Updated Date - Aug 26 , 2026 | 12:55 AM