Share News

మెరిసిన క్రీడా స్ఫూర్తి..

ABN , Publish Date - Oct 05 , 2026 | 12:39 AM

రెండు రోజులుగా హోరాహోరీగా పోరాడిన కబడ్డీ క్రీడాకారులకు మూడో రోజు సాయంత్రం ఉత్సాహానికి హద్దులు లేకుండాపోయాయి.

మెరిసిన క్రీడా స్ఫూర్తి..

వేములవాడ, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): రెండు రోజులుగా హోరాహోరీగా పోరాడిన కబడ్డీ క్రీడాకారులకు మూడో రోజు సాయంత్రం ఉత్సాహానికి హద్దులు లేకుండాపోయాయి. క్యాంప్‌ఫైర్‌లో క్రీడాకారులు మంటల వెలుగులో ఆటాపాటలు, కేరింతలతో సంబరాలు జరుపుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని జూనియర్‌ కళాశాల మైదానంలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల్లో భాగంగా ఆదివారం సాయంత్రం ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ క్యాంప్‌ ఫైర్‌ను ప్రారంభించారు. రాష్ట్రంలోని ఆయా జిల్లాల నుంచి హాజరైన 1300 మంది క్రీడాకా రులను ఆయా పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు పరిచయం చేసుకున్నారు. తమ ప్రాంత కబడ్డీ అనుభవాలను పంచుకోవడం, జానప ద పాటలు, పాడుతూ డ్యాన్స్‌లు వేయ డంతో ఆ ప్రాంగణం అంతా కోలాహ లంగా మారింది.

ఆకట్టుకున్న నృత్యాలు

క్రీడాస్ఫూర్తిని నిలిపేందుకు ఏర్పాటు చేసిన క్యాంప్‌ఫైర్‌లో రాష్ట్ర ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌, మున్సిపల్‌ చైర్మన్‌ పుల్కం రాజు, వైస్‌చైర్మన్‌ నరాల శేఖర్‌, తూమ్‌ మధు, కౌన్సిలర్లు చేసిన నృత్యం ఆకట్టుకుంది. క్యాంప్‌ ఫైర్‌ వెలిగించిన విప్‌ ఆది శ్రీనివాస్‌ క్రీడాకారులతో కలిసి నృత్యాలు చేశారు. పీటీలు, మేనేజర్‌లు, క్రీడాకారులు, స్థానిక క్రీడాకారులు నృత్యాలు చేయడంతో డీజే సౌండ్స్‌ మధ్య ఆ ప్రాంతమంతా హోరెత్తిపోయింది.

క్యాంప్‌ఫైర్‌తో స్నేహభావం..

- రాష్ట్ర ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌

వేములవాడ రాజన్న క్షేత్రంలో రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందని స్థానిక శాసన సభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు. రెండు రోజులపాటు హోరాహోరీగా తలపడిన కబడ్డీ క్రీడాకారుల్లో ఉత్సాహం, స్నేహభావం నింపేందుకు క్యాంప్‌ఫైర్‌ ఎంతో దోహదపడుతుందన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన పల్లె బిడ్డలకు మరుపురాని అనుభూతిని మిగిల్చాలని ఏర్పాట్లు చేసినట్లు వివరించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ పుల్కం రాజు, వైస్‌ చైర్మన్‌ నరాల శేఖర్‌, కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షుడు తూమ్‌ మధు కౌన్సిలర్లు తదితరులు ఉన్నారు.

Updated Date - Oct 05 , 2026 | 12:39 AM