రాజీ ద్వారా కేసుల సత్వర పరిష్కారం..
ABN , Publish Date - Jun 21 , 2026 | 12:24 AM
లోక్ అదాలత్‌లలో రాజీ ద్వారా కేసులు సత్వరంగా పరిష్కరించుకోవచ్చని జిల్లా జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఎస్ శివకుమార్ అన్నారు.
కరీంనగర్ క్రైం, జూన్ 20 (ఆంధ్రజ్యోతి): లోక్ అదాలత్‌లలో రాజీ ద్వారా కేసులు సత్వరంగా పరిష్కరించుకోవచ్చని జిల్లా జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఎస్ శివకుమార్ అన్నారు. జిల్లా కోర్టు ఆవరణలోని న్యాయ సేవా సదన్‌లో జాతీయ లోక్ అదాలత్‌ను శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజీ ద్వారా కేసులు పరిష్కరించుకుంటే సమయం, డబ్బు వృఽథా కాకుండా ఉంటుందన్నారు. సీసీఆర్‌బీ ఏసీపీ శ్రీనివాస్ జీ మాట్లాడుతూ... లోక్ ఆదాలత్‌లలో రాజీ చేయదగిన క్రిమినల్ కేసుల పరిష్కారానికి సీపీ ఆదేశాలతో పోలీసు అధికారులు తమ వంతు కృషి చేస్తున్నట్లు తెలిపారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్ మాట్లాడుతూ.. లోక్ ఆదాలత్‌ల వల్ల కేసుల పెండెన్సీ తగ్గడంతోపాటు కక్షిదారులకు సత్వర న్యాయం అందుతుందని తెలిపారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఇన్‌చార్జి కార్యదర్శి న్యాయమూర్తి రాణి లోక్ అదాలత్‌ల గురించి వివరించారు. జిల్లావ్యాప్తంగా 2,703 కేసులు పరిష్కారమైనట్లు తెలిపారు. మోటారు ప్రమాదం కేసుల్లో బాధితులకు 3,01,43,416 రూపాయలు పరిహారం ఇప్పించామన్నారు.