కొత్తపల్లి పోలీస్ స్టేషనకు ‘శాతవాహన’లో స్థలం కేటాయింపు
ABN , Publish Date - Jan 09 , 2026 | 12:01 AM
శాతవాహన విశ్వవిద్యాలయ పరిధిలోని 15 గుంటల భూమిని కొత్తపల్లి పోలీస్ స్టేషన శాశ్వత భవన నిర్మాణానికి కేటాయిస్తూ యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ నిర్ణయం తీసుకున్నట్లు విశ్వవిద్యాలయ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ యు ఉమేష్ కుమార్ తెలిపారు.
కరీంనగర్ క్రైం, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): శాతవాహన విశ్వవిద్యాలయ పరిధిలోని 15 గుంటల భూమిని కొత్తపల్లి పోలీస్ స్టేషన శాశ్వత భవన నిర్మాణానికి కేటాయిస్తూ యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ నిర్ణయం తీసుకున్నట్లు విశ్వవిద్యాలయ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ యు ఉమేష్ కుమార్ తెలిపారు. గత ఏడాది డిసెంబరు 24న జరిగిన 84వ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేసినట్లు ఆయన చెప్పారు. మల్కాపూర్ జంక్షన నుంచి చింతకుంట వెళ్లే రహదారిలో యూనివర్సిటీ వెస్ట్ గేట్ (పడమర ద్వారం) పక్కన ఉన్న స్థలాన్ని పోలీస్‌స్టేషన భవన నిర్మాణం కోసం కేటాయించామని ఆయన తెలిపారు. ఈ సందర్బంగా దీనికి సంబంధించి అధికారికంగా నో అబ్జెక్షన సర్టిఫికేట్ (ఎనఓసీ)ని పోలీస్ కమిషనర్‌కు గురువారం అందజేశారు. ఈ సందర్బంగా సీపీ గౌస్ ఆలం మాట్లాడుతూ... యూనివర్సిటీలో కొత్తపల్లి పోలీస్ స్టేషన శాశ్వత భవన ఏర్పాటుతో ప్రజలకు మరింత సమర్థవంతంగా సేవలందించవచ్చన్నారు. పోలీస్ శాఖ విజ్ఞప్తి మేరకు, విద్యార్థుల భద్రతను, ఈ ప్రాంతంలో నిరంతర నిఘా అవసరాన్ని గుర్తించి యూనివర్సిటీ ఈ నిర్ణయం తీసుకున్నందుకు వీసీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ ఐపీఎస్ సోహం సునిల్, శాతవాహన విశ్వ విద్యాలయ రిజిసా్ట్రర్ ప్రొఫెసర్ సతీష్‌కుమార్, డాక్టర్ హరికాంత, కంట్రోలర్ డాక్టర్ డి సురేష్‌కుమార్, అడిషనల్ డీసీపీ వెంకటరమణ, ఏసీపీ విజయకుమార్, ఇనస్పెక్టర్ బిల్లా కోటేశ్వర్, ఎస్సై సాంబమూర్తి పాల్గొన్నారు.