తిప్పలు తప్పేదెప్పుడో..
ABN , Publish Date - May 13 , 2026 | 12:22 AM
కరీంనగర్ రైల్వేస్టేషన్ సమీపంలో ప్రధాన రహదారిపై నిర్మాణంలో ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు నత్తనడకన సాగుతున్నాయి.
కరీంనగర్ రూరల్, మే 12 (ఆంధ్రజ్యోతి): కరీంనగర్ రైల్వేస్టేషన్ సమీపంలో ప్రధాన రహదారిపై నిర్మాణంలో ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు నత్తనడకన సాగుతున్నాయి. గత సంవత్సరమే పూర్తి కావలసిన ఆర్వోబీ పనుల్లో జాప్యం జరుగుతుండడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో రైల్వే గేటు పడినప్పుడు మాత్రమే ట్రాఫిక్‌జామ్ అయ్యేది. ప్రస్తుతం రహదారి దెబ్బతినడంతో వాహనాలు ఆ ప్రాంతం గుండా నెమ్మదిగా వెళుతున్నాయి.
ఫ మూడు సంవత్సరాల క్రితం పనులు ప్రారంభం
కరీంనగర్ రైల్వే స్టేషన్ వద్ద మూడు సంవత్సరాల క్రితం ఆగస్టునెలలో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులను ప్రారంభించారు. రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణంలో భాగంగా రెండు వైపులా నాలుగు వరుసల ఫ్లైఓవర్ నిర్మించాల్సి ఉన్నది. నాలుగు వరుసల రైల్వే వంతెన నిర్మాణంలో భాగంగా ఒక వైపు రెండు వరుసల నిర్మాణాన్ని చేపట్టారు. చొప్పదండి వైపు ఏడు పిల్లర్లు, కరీంనగర్ వైపు ఎనిమిది ఫిల్లర్లు నిర్మిస్తున్నారు. రెండు వైపులా వంతెన నిర్మాణం పిల్లర్ల దశలోనే ఉండగా మరి కొన్ని పిల్లర్లకు స్లాబ్‌లు వేశారు. గత సంవత్సరం మార్చి నాటికే పనులు పూర్తి కావలిసి ఉన్నా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా పనులు జరుగుతున్నాయి. ఈ యేడు రైల్వే స్టేషన్‌కు వెళ్లే దారి సమీపంలో రైల్వే గేటు వద్ద రెండు పిల్లర్లను మాత్రమే నిర్మించారు. అవి కూడా పూర్తి కాలేదు. దీంతో వాహనదారులు రైల్వే గేటును తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.
ఫ భారీగా నిలిచిపోతున్న వాహనాలు
రైళ్లు వచ్చిన సమయంలో గేటుకు ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోతున్నాయి. కరీంనగర్ నుంచి మంచిర్యాల, లక్షెట్టిపేట, ధర్మారం, చొప్పదండి ప్రాంతాలకు వెళ్లాల్సిన వాహనాలన్ని ఈ గేటు మీదుగానే వెళతాయి. ప్రతి రోజు పలుసార్లు ట్రాఫిక్ జామ్ ఏర్పడుతున్నది. దూర ప్రాంతాల నుంచి అంబులెన్స్‌లలో కరీంనగర్ వచ్చే రోగుల పరిస్థితి దయనీయంగా మారుతున్నది. ప్రతి రోజూ పదుల సంఖ్యలో రైళ్లు వెళుతుండడంతో తరుచూ గేటు పడుతుంది. దీంతో అత్యవసర సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి ఆర్వోబీ పనులు పూర్తి చేయాలని స్థానికులు, వాహనదారులు కోరుతున్నారు.