Share News

కొంత మోదం.. కొంత ఖేదం..

ABN , Publish Date - Mar 21 , 2026 | 01:38 AM

తెలంగాణ బడ్జెట్‌పై బోలెడు ఆశలు పెంచుకున్న రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలకు నిరాశలే మిగిలాయి. జిల్లాకు ప్రత్యేక నిధులు కేటాయింపులు లభించలేదు. ముఖ్యంగా సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు ఆశించిన మేరకు ప్రయోజనకరంగా లేకపోవడంతో నేత కార్మికులు నిరాశ చెందారు. విద్యార్థులకు, ఉద్యోగులు, పెన్షనర్లకు ఊరటనిచ్చింది.

కొంత మోదం.. కొంత ఖేదం..

- ఆధ్యాత్మిక కేంద్రంగా వేములవాడ..

- మళ్లీ సిరిసిల్ల నేతన్నలకు కంటితుడుపే

- వర్కర్‌ టు ఓనర్‌ పథకానికి లభించని ఊరట

- చేనేత రంగానికి రూ.258 కోట్ల నిధులు

- సిరిసిల్ల పవర్‌లూం రంగానికి ప్రత్యేక కేటాయింపులు దూరం

- రాజీవ్‌ యువ వికాసం పఽథకానికి నిధులు

- విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, అల్పాహారం

- జిల్లాలో 2026-27 బడ్జెట్‌పై మిశ్రమ స్పందన

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)

తెలంగాణ బడ్జెట్‌పై బోలెడు ఆశలు పెంచుకున్న రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలకు నిరాశలే మిగిలాయి. జిల్లాకు ప్రత్యేక నిధులు కేటాయింపులు లభించలేదు. ముఖ్యంగా సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు ఆశించిన మేరకు ప్రయోజనకరంగా లేకపోవడంతో నేత కార్మికులు నిరాశ చెందారు. విద్యార్థులకు, ఉద్యోగులు, పెన్షనర్లకు ఊరటనిచ్చింది. శుక్రవారం ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క శాసనసభలో 2026- 27 సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్‌ జిల్లాలో మిశ్రమ స్పందన లభించింది. స్వయం సహాయక సంఘాలకు ఆర్థిక భరోసా, దివ్యాంగులకు, ఇంటి పెద్దకు కుటుంబ జీవిత బీమా పథకం, చేయూత పింఛన్ల ప్రస్తావనలు, ప్రభుత్వ ఆరు గ్యారంటీలు, అభయ హస్తంలో మహాలక్ష్మి, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, మహిళా శక్తి మిషన్‌, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమం కోసం నిధుల కేటాయింపులు, భూభారతి ద్వారా రైతుల సమస్యలను పరిష్కరించే దిశగా అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు. బడ్జెట్‌ రాజన్న సిరిసిల్ల జిల్లాకు కొంచెం చేదు.. కొంచెం తీపిగా నిలిచింది.

నేతన్నలకు ఎదురుచూపులే..

సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో నేత కార్మికులు, యజమానులు ఎన్నో ఏళ్లుగా మెగా పవర్లూమ్‌ క్లస్టర్‌ కోసం ఎదురుచూస్తున్నారు. ప్రతిసారి కేంద్ర బడ్జెట్‌లో నిరాశే మిగులుతోంది. రాష్ట్ర బడ్జెట్‌లోనైనా సిరిసిల్ల టెక్స్‌టైల్‌ జోనుగా మార్చే విధంగా నిధులు కేటాయింపు జరుగుతుందని గత ప్రభుత్వ కాలం నుంచి భావిస్తున్న నిరాశే మిగులుతోంది. ఈసారి తెలంగాణ బడ్జెట్‌లో పెండింగ్‌లో ఉన్న నేత కార్మికులను యజమానులుగా మార్చే వర్కర్‌ టు ఓనర్‌ పథకం అందుబాటులోకి వచ్చే విధంగా నిధుల కేటాయింపుతో స్పష్టత వస్తుందని భావించారు. బడ్జెట్‌లో ప్రస్తావన లేకపోవడంతో నేతన్నలకు ఎదురుచూపులు అలాగే మిగిలాయి. బడ్జెట్‌లో చేనేత, పవర్‌లూం రంగాలు దేశంలోనే ప్రత్యేక స్థానాన్ని తెలంగాణ సంపాదించిందని ప్రస్తావించినా అరకోర నిధులే కేటాయించారు. కోటి మహిళకు కోటి చీరలు కార్యక్రమం ద్వారా మహిళలకు ఉచితంగా చీరలు పంపిణీ చేస్తున్నామని, ఇప్పటికే 70 లక్షల చీరలు అందజేశామని మిగిలిన చీరలు త్వరలో పంపిణీ చేస్తామని మాత్రమే ప్రస్తావించారు. బడ్జెట్‌లో చేనేత రంగానికి రూ.258 కోట్లు ప్రతిపాదించారు. ప్రతిపాదించిన నిధులు చేనేత, పవర్లూమ్‌ రంగాలకు సంబంధించిన బీమా పథకాలు, పొదుపు పథకాలకు సరిపోయే పరిస్థితి ఉంది. సిరిసిల్ల పవర్‌లూం పరిశ్రమకు కొత్త ఆర్డర్లు, పరిశ్రమపై నేత కార్మికులకు ఎలాంటి హామీ లభించలేదని నిరాశ చెందుతున్నారు.

విద్యారంగానికి ఊరట

ప్రభుత్వం ఈసారి విద్యారంగంపై ప్రత్యేక దృష్టి పెట్టడం ఊరటగానే భావించవచ్చు. యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలల నిర్మాణానికి సంబంధించిన ప్రస్తావనతో పాటు ప్రాథమిక విద్యను బలోపేతం చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ముఖ్యంగా ఈసారి విద్యార్థులకు పౌష్టికాహారం అందించే విధంగా బడ్జెట్‌ కేటాయింపులు చేశారు. 2026-27 విద్యా సంవత్సరం నుంచి ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్‌ వరకు నూతనంగా బ్రేక్‌ ఫాస్ట్‌ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. విద్యార్థులకు వారంలో మూడు రోజులు పాటు, మరో మూడు రోజులు రాగి జావా అందిస్తారు. ఈసారి ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని అందించనట్లు తెలిపారు మధ్యాహ్న భోజన పథకం, పోషకాహారం ద్వారా రాజన్న సిరిసిల్ల జిల్లాలో 75 వేల మంది విద్యార్థులకు ఉపయోగకరంగా మారనుంది. దివ్యాంగ విద్యార్థులకు వాహనాలను పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. వసతి గృహాలు, గురుకుల విద్యాసంస్థల్లో వంటశాలలను ఆధునీకరించడానికి రూ.100 కోట్ల బడ్జెట్‌లో ప్రతిపాదించారు. పాలిటెక్నిక్‌ కళాశాలను అడ్వాన్స్‌ టెక్నాలజీ కేంద్రాలుగా మార్చినట్లు తెలిపారు. కొత్తగా 15 కోర్సులను ప్రవేశపెట్టన్నారు. ప్రభుత్వ ఐటీఐలను అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ కేంద్రాలుగా మార్చుతున్నారు. విద్యార్థులకు రూ 200 స్కాలర్‌షిప్‌ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఉద్యోగులు, పెన్షనర్లకు ఆరోగ్య భద్రత

కొంతకాలంగా ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఎదురుచూస్తున్న నగదు రహిత ఆరోగ్య భద్రత పథకానికి బడ్జెట్‌లో శ్రీకారం చుట్టారు. కుటుంబ సభ్యులందరికీ వర్తించే విధంగా నగదు రహిత ఆరోగ్య భద్రతా పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు, రాజీవ్‌ ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ ద్వారా అమలుచేసే ఈ పథకంలో 421 ప్రైవేట్‌ ఆస్పత్రిలో 1998 వ్యాధులకు చికిత్సను పొందవచ్చు. ప్రతి ఉద్యోగికి డిజిటల్‌ హెల్త్‌కార్డులను అందిస్తారు. దీంతోపాటు ఉద్యోగుల భద్రత కోసం సమగ్ర ప్రమాద బీమా పథకాన్ని ప్రవేశపెట్టారు. ప్రమాదవశాత్తు ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు చనిపోతే రూ.కోటి 20 లక్షల ప్రమాద బీమా లభిస్తుంది. 60 ఏళ్ల వరకు రూ.10 లక్షల వరకు టర్మ్‌లైఫ్‌ ఇన్సూరెన్స్‌, విమాన ప్రమాదంలో మరణిస్తే రూ.2 కోట్లు అదనంగా లభించే విధంగా పథకాన్ని రూపకల్పన చేసినట్లు పేర్కొన్నారు.

మొబైల్‌ అంగన్‌వాడీ కేంద్రాలకు శ్రీకారం

స్టేట్‌ న్యూట్రిషన్‌ మిషన్‌ ద్వారా పట్టణాల్లోని పేదలకు అదనపు పోషకాహారాన్ని అందించే లక్ష్యంగా ఈ సంవత్సరం కొత్తగా 274 మొబైల్‌ అంగన్‌వాడీ కేంద్రాలను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. పాలనా పథకం ద్వారా పనిచేసే మహిళల కోసం అంగన్‌వాడీ, క్రెచ్‌ సెంటర్లను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. పిల్లలకు పోషకాహారంతో పాటు డే - కేర్‌ సేవలు అందించి జాగ్రత్తగా చూసుకోనున్నారు. వృద్ధుల సంక్షేమం కోసం ప్రాణం డే - కేర్‌ కేంద్రాలను మంజూరుచేసినట్లు ప్రకటించారు. బాల భరోసా పథకం ద్వారా నుంచి ఐదేళ్లలోపు చిన్నారులు పుట్టుకతో వచ్చే శారీరక మానసిక వైకల్యాలు, ఎదుగుదల్లో ఉండే లోపాలను తొలిదశలో గుర్తించి చికిత్స అందించే విధంగా భరోసా పథకం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. దివ్యాంగుల మధ్య జరిగే వివాహాలను ప్రోత్సహించే దిశగా రూ.2 లక్షల నగదును ప్రభుత్వం కానుకగా అందించనుంది. అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్ల పదవీ విరమణ ప్రయోజనాలను మంజూరు చేస్తున్నట్లుగా ప్రకటించారు.

యువ వికాసం దరఖాస్తులకు మోక్షం

ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ, ఓసీ వర్గాలకు చెందిన యువతకు ఆర్థిక సహాయం అందించే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రాజీవ్‌ యువ వికాసం పథకం కోసం వచ్చిన దరఖాస్తులకు మోక్షం లభించనుంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో రాజీవ్‌ యువ వికాసం కోసం 36,819 మంది దరఖాస్తులు చేసుకున్నారు. 7680 యూనిట్లు జిల్లాకు కేటాయించిన పెండింగ్‌లోనే ఉండిపోయాయి. బడ్జెట్లో రూ.6 వేల కోట్లు కేటాయించడంతో ఈసారి యువ వికాసం దరఖాస్తులకు మోక్షం లభిస్తుందని యువతలో ఆశలు కల్పించింది.

దేవాలయాల అభివృద్ధికి నిధులు

తెలంగాణ సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వాన్ని కాపాడేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని ప్రకటించారు. ఇందులో భాగంగా వేములవాడ, ధర్మపురి, భద్రాచలం, కాళేశ్వరం వంటి దేవాలయాల అభివృద్ధి నిధులు మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు. వేములవాడ రాజన్న దేవాలయాన్ని పూర్తిస్థాయి ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నట్లు ప్రకటించారు.

కుటుంబానికి ఇందిరమ్మ జీవిత బీమా

కుటుంబానికి అండగా ఆదాయం తెచ్చే వ్యక్తి దురదృష్టవశాత్తు చనిపోతే ఆ కుటుంబం రోడ్డున పడకుండా ఉండేవిధంగా ఈ బడ్జెట్లో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ సంవత్సరం జూన్‌ 2 నుంచి పేద, మధ్యతరగతి, ధనిక అనే తేడా లేకుండా రూ 5 లక్షలు భీమా అందే విధంగా నూతనంగా పథకాన్ని అందించనున్నారు.

Updated Date - Mar 21 , 2026 | 01:38 AM