Share News

సూర్య ప్రతాపం

ABN , Publish Date - Oct 02 , 2026 | 12:58 AM

- గురువారం సాయంత్రం 5 గంటలకు కరీంనగర్‌ పట్టణంలో 32.7 డిగ్రీ సెల్సియస్‌ల ఉష్ణోగ్రత నమోదైంది.

సూర్య ప్రతాపం

(ఆంధ్రజ్యోతి, కరీంనగర్‌)

- గురువారం సాయంత్రం 5 గంటలకు కరీంనగర్‌ పట్టణంలో 32.7 డిగ్రీ సెల్సియస్‌ల ఉష్ణోగ్రత నమోదైంది. మిట్టమధ్యాహ్నం వేళ నెత్తిలో మాడు సుర్రుమని మండే పరిస్థితి జనాలను అల్లాడించింది. మిట్టమధ్యాహ్నం 36 డిగ్రీలతో భానుడి భగభగలు నగరవాసుల్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి.

- గడిచిన వారం రోజులుగా పగటి ఉష్ణోగ్రతల ప్రభావం జిల్లాలో క్రమంగా పెరుగుతోంది. ఈ వానాకాలంలో ఇంత ఎక్కువగా వేడి ఉన్న పరిస్థితులు ప్రజలకు ఎదురవలేదు. ఎల్‌నినో ప్రభావంతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. వేసవిని తలపించే విధంగా నెత్తిన సూరీడు ప్రతాపం చూపుతున్నాడు.

ఎల్‌నినో ప్రభావం క్రమంగా కరీంనగర్‌ జిల్లాపై పడుతోంది. ఊహకందని విధంగా సెప్టెంబరు చివరి వారంలో ఎండ తీవ్రత విపరీతంగా పెరిగింది. చల్లదనంతో కూడిన వాతావరణం ఉంటుందని భావించిన ప్రజలకు ఊష్ణతాపమే ఎదురొస్తోంది. అక్టోబరు మొదటి వారంలో రికార్డు స్థాయిలో గరిష్ఠ ఉష్ణోగ్రతలుంటాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ముఖ్యంగా బయటకు వెళ్లి ఎండలో పనిచేస్తున్న భవన నిర్మాణ కార్మికులు, ఉపాధి కూలీలు, దినసరి వేతన జీవులు ప్రస్తుతం తగులుతున్న సెగను తట్టుకోలేకపోతున్నారు. కొద్దిసేపు ఇంట్లోనుంచి బయటకు వెళ్లి వచ్చిన వారు తలనొప్పితో కూడిన ఉక్కిరిబిక్కిరికి లోనవుతున్నారు. వారం రోజులుగా 36 నుంచి 37 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు ఇబ్బంది పెడుతున్నాయి.

ఆరోగ్యానికి ముప్పు..

వేడిగాలి రూపంలో వృద్ధులు, చిన్నారుల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతుందని వైద్యనిపుణులు చెబుతున్నారు. తేమ ఎక్కువగా ఉండడం, గాలి తక్కువగా వస్తుండడం వల్ల శరీరంపై వడగాలి రూపంలో ఒత్తిడి పెరుగుతుంది. దీనివల్ల ఎండలో తిరిగేవాళ్లు డిహైడ్రేషన్‌ ప్రభావానికి లోనవుతున్నారు. చెమటద్వారా నీరు, లవణాలను కోల్పోతుండడంతో తలతిరగడం, తలనొప్పిలాంటి లక్షణాలు కొందరిలో కనిపస్తున్నాయి. అధిక చెమట వల్ల బలహీనత, వికారం కండరాల నొప్పులతో ఆస్పత్రులకు వెళ్లే వారు పెరుగుతున్నారు. శరీర ఉష్ణోగ్రత నియంత్రణ కోల్పోవడం వల్ల పలువురు జ్వరం, అలసటతో ఆస్పత్రులకు వస్తున్నారని జిల్లాసుపత్రి వెద్యులు చెబుతున్నారు. అందుకనే వీలైనంత ఎక్కువగా నీళ్లను తాగాలని సూచిస్తున్నారు. విపరీతమవుతున్న ఉక్కపోతల వల్ల నీడపట్టున ఉండడానికి పలువురు మొగ్గు చూపుతున్నారు. అత్యవసరమైతేనే కాలుబయట పెడుతున్నారు.

మీటర్లు గిరగిర...

ఎల్‌నినో పెడుతున్న సెగ వల్ల ఇళ్లు, కార్యాలయాల్లో కరెంట్‌ మీటర్లు గిరగిరా తిరుగుతున్నాయి. మధ్యాహ్నం, రాత్రి వేళల్లోనూ ఏసీలు, కూలర్ల వాడకం విపరీతంగా పెరిగింది. రాత్రి 8 గంటల సమయంలోనూ వడగాలి ప్రభావం ఉండడంతో తప్పనిసరై ఫ్యాన్లను వేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. బయట నుంచి గాలి వచ్చే పరిస్థితి లేకపోవడంతో నాలుగు గోడల మధ్య ఏసీ, కూలర్లు, ఫ్యాన్ల గాలితోనే ఊష్ణతాపాన్ని తీర్చుకోవాల్సిన పరిస్థితి జిల్లా వాసులకు ఎదురవుతోంది. ఈ వర్షాకాలంలో సరిగ్గా వర్షాలు కురవకపోవడం, గాలిలో తేమ, మేఘావరణం, నేలలోని తేమ పరిస్థితుల కారణంగా జిల్లాలోని వాతావరణంలో ఈ అనూహ్య మార్పు కనిపిస్తోంది. ఇప్పుడే ఇలాగే ఉంటే అసలు వేసవి పరిస్థితి ఇంకా ఎలా ఉంటుందోననే బెంగ జిల్లా జనాల్లో ఇంతకింతకు పెరుగుతోంది. మరోవైపు రైతులు ఈ ఎండల ప్రభావంతో పొలం వద్ద పనులు చేసే పరిస్థితులు కనిపంచడం లేదు. ఇదే సమయంలో అధిక ఉష్ణోగ్రతల వల్ల పంటలకు నష్టం కలుగుతుందనే వేదనలో కర్షకులున్నారు.

Updated Date - Oct 02 , 2026 | 12:58 AM