చెరువులపై కన్నేసిన మట్టిమాఫియా
ABN , Publish Date - May 12 , 2026 | 01:07 AM
చెరువుల మట్టి కోసం మట్టి మాఫియా నయా స్కెచ్ వేసింది. తమకు ఏ చెరువు మట్టి అవసరం ఉన్నదో ఆ చెరువులో ఉన్న నీళ్లను ఖాళీ చేసి సంబంధిత అధికా రుల నుంచి నామమాత్రపు అనుమతులు తీసుకుని పెద్దఎత్తున మట్టిని అక్రమంగా ఇటుక బట్టీలకు తరలించి సొమ్ము చేసుకోవాలని చేస్తోంది. వారి ఆగడాలను రైతులు, గ్రామస్తులు అడ్డుకున్నారు.
చెరువుల మట్టి కోసం మట్టి మాఫియా నయా స్కెచ్ వేసింది. తమకు ఏ చెరువు మట్టి అవసరం ఉన్నదో ఆ చెరువులో ఉన్న నీళ్లను ఖాళీ చేసి సంబంధిత అధికా రుల నుంచి నామమాత్రపు అనుమతులు తీసుకుని పెద్దఎత్తున మట్టిని అక్రమంగా ఇటుక బట్టీలకు తరలించి సొమ్ము చేసుకోవాలని చేస్తోంది. వారి ఆగడాలను రైతులు, గ్రామస్తులు అడ్డుకున్నారు.
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
చెరువు మట్టి కోసం కొందరు అక్రమాలకు పాల్పడుతున్నారు. పెద్దపల్లి మండలం ముత్తారంలో గల చెరువులో మోటార్లు పెట్టి ట్యాంకర్ల ద్వారా నీటిని తోడి వేయగా, తాజాగా పెద్దకల్వలలో గల భోజన్నపేట చెరువుకు గండిపెట్టి చెరువును ఖాళీ చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. చెరువు కట్టకు ఈ నెల 6వ తేదీన గండిపెట్టిన విషయం తెలుసుకుని అప్రమత్తమైన రైతులు వెంటనే చెరువు వద్దకు వెళ్లి గండిపెట్టిన ఎక్స్‌కవేటర్‌తోనే చెరువు నీళ్లు బయటకు వెళ్లకుండా అడ్డుకట్ట వేశారు. చెరువుకు గండి కొడుతున్నారని సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా కూడా ఇప్పటి వరకు చర్యలు చేపట్టలేదు. కలెక్టర్, నీటి పారుదల శాఖ కార్యాలయానికి, రూరల్ పోలీస్‌స్టేషన్‌కు పెద్దకల్వల చెరువు కూత వేటు దూరంలో ఉన్నా కూడా అక్రమార్కులు పగటి పూటనే చెరువుకు గండికొట్టడం గమనార్హం. గ్రామస్తులు, రైతులు గండిపెట్టిన సమాచారం తెలుసుకుని ఉండక పోతే చెరువు ఖాళీ అయి ఉండేది. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాల్సి ఉండగా ఎలాంటి చర్యలు లేవని గ్రామానికి చెందిన రైతులు తెలిపారు. ఈ విషయమై సోమవారం కలెక్టర్‌కు రైతులు ఫిర్యాదు చేశారు. చెరు వుల్లో నీళ్లు లేనప్పుడే రైతులు, ఇతరులు నిర్ణీత లోతు, వెడల్పులో నీటి పారుదల శాఖాధికారులు నిర్ధేశించిన మేరకు మట్టిని తీసుక వెళ్లేందుకు అనుమతులు ఇస్తారు. కానీ చెరువుల్లో ఉన్న నీళ్లను ఖాళీ చేసి అటు.. రైతులకు, ఇటు.. మత్స్యకారులకు నష్టం కలిగే విధంగా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై ఐదు రోజులైనా చర్యలు లేకపోవడం గమనార్హం. ఇంకా పెద్దకల్వల చెరువు కింద పూర్తి స్థాయిలో వరి పొలాలు కోయలేదు. గండి పెట్టి నీళ్లు వదిలితే పొలాలు నీట మునిగేవి. రైతులు అప్రమత్తం కావడంతో ఆ ప్రమాదం తప్పింది.
ఫ వేసవి వచ్చిందంటే చెరువుల మట్టిపై కన్ను..
వేసవి కాలం వచ్చిందంటే చాలు మట్టి మాఫియా కన్ను జిల్లాలో గల చెరువులపై పడుతుంది. రాజకీయ పలుకుబడిని ఉపయోగించి నామమాత్రంగా తక్కువ పరిమాణంలో అనుమతులు పొంది ఎక్కువ మట్టిని తరలించుకు పోవడం యేటా జరుగుతున్నది. జిల్లాలోని పెద్దపల్లి, సుల్తానాబాద్, ధర్మారం, కమాన్‌పూర్, రామ గిరి, ముత్తారం, మంథని, అంతర్గాం, పాలకుర్తి, తదితర ప్రాంతాల్లో 150 వరకు ఇటుక బట్టీలు ఉన్నాయి. ఇక్కడ తయారయ్యే ఇటుకకు మంచి డిమాండ్ ఉంటుంది. జిల్లాలోనే గాకుండా హైదరాబాద్, కరీంనగర్, సిద్ధిపేట, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల వంటి జిల్లాలకు ఇక్కడి నుంచి ఇటుక సరఫరా అవుతుంది. వర్షాకాలంలో మినహా చలి, వేసవి కాలంలో ఇటుకలు తయారు చేస్తారు. ఏడాది, రెండేళ్లకు సరిపడా చెరువుల మట్టిని తీసుక వచ్చి నిల్వ చేసుకుంటారు. ఒకప్పుడు నేరుగా ఇటుక బట్టీల యజమానులే చెరువుల మట్టి కోసం దరఖాస్తు చేసుకుంటే వారికే అనుమతులు ఇచ్చే వాళ్లు. అయితే ఎనిమిదేళ్లుగా ఇటుక బట్టీల యజమానుల పేరిట ఆయా పార్టీలకు చెందిన నాయకులు అనుమతులు తీసుకుని మట్టిని ఇటుక బట్టీల యజమా నులకు విక్రయించుకోవడం ఆరంభించారు. గత ఏడాది కలెక్టర్ కోయ శ్రీహర్ష టన్నుల లెక్కన గాకుండా ఒక లారీ ట్రిప్పునకు ధర నిర్ణయించి ఆయా చెరువుల్లో మట్టిని తరలించుకునేందుకు అనుమతులు ఇచ్చారు. అయినా కూడా తక్కువ అనుమతులు తీసుకుని ఎక్కువ పరిణామంలో ఓవర్ లోడ్‌తో మట్టిని తరలిం చారు. ఈ ఏడాది కూడా అదే విధానాన్ని అమలు చేయనున్నట్లు సమాచారం. పెద్దపల్లి మండలం ముత్తారం చెరువు, కొదురుపాక చెరువు, రాయకుంట చెరువులో మట్టిని తరలించేందుకు 11 మంది ఇటుక బట్టీల యజమానులు దరఖాస్తు చేసుకోగా వారికి అధికారులు అనుమతులు ఇచ్చారు.
ఫ అక్రమ మట్టి, ఇసుక రవాణాకు వ్యతిరేకం..
జిల్లాలో అక్రమంగా మట్టి, ఇసుక తవ్వకాలకు మంథని, పెద్దపల్లి, రామగుండం నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణారావు, రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్‌లు వ్యతిరేకం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇసుక, మట్టి అక్రమ రవాణా జరగకుండా చర్యలు తీసుకోవాలంటూ అధికారులకు చెబుతున్నారు. అయినా అక్కడక్కడ ఇసుక, మట్టి రవాణా జరుగు తూనే ఉన్నది. వేసవిలో చెరువుల్లో మట్టి తవ్వకాలు చేపడతారని భావించిన సదరు ప్రజాప్రతినిధులు ఎస్సారెస్పీ నీళ్లతో చెరువులను నింపి ఉంచారు. ఈ నెల 25వ తేదీన రోహిణి కార్తె ప్రవేశిస్తుంది. ఆ రోజు నుంచే వానాకాలం సీజన్ ఆరంభం అవుతుంది. జూన్ మొదటి వారంలోనే చెరువులు, కుంటల కింద రైతులు వరి నార్లు పోసుకునేందుకు వీలుగా నీళ్లు నింపిపెడితే, కొందరు అక్రమార్కులు ఆయా చెరువులపై కన్నేసి నీళ్లను ట్యాంకర్ల ద్వారా తోడేయడమే గాకుండా, ఏకంగా గండి కొడుతున్నారని రైతులు చెబుతున్నారు. జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి పెద్దకల్వల చెరువుకు గండి కొట్టిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.