వంటింట్లో ‘ధర’ల మంటలు..
ABN , Publish Date - Oct 16 , 2026 | 12:53 AM
పేద, మధ్యతరగతి, ధనిక అనే తేడా లేకుండా ఎంతో ఇష్టంగా జరుపుకునే పండుగలు బతుకమ్మ, దసరా ఉత్సవాలు.
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
పేద, మధ్యతరగతి, ధనిక అనే తేడా లేకుండా ఎంతో ఇష్టంగా జరుపుకునే పండుగలు బతుకమ్మ, దసరా ఉత్సవాలు. ఈసారి ఎల్నినో ఎఫెక్ట్తో నిత్యావసరాల సరుకులు పేద, మధ్యతరగతి కుటుంబాల బడ్జెట్ను తలకిందులు చేస్తున్నాయి. దీనికి తోడుగా కూరగాయల ధరలు కూడా వర్షాభావ పరిస్థితుల్లో ధరలు భగభగ మండుతుండడంతో ఏం కొనాలి.. ఎలా వండాలి అనే సందిగ్ధంలో ప్రజలు పడిపోతున్నారు. పండుగలకు కొత్త బట్టలు కొనుగోలు కంటే నిత్యావసర సరుకులు భయపెడుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒకవైపు బతుకమ్మ, దసరా పండుగలు సమీపించడంతో సామాన్య కుటుంబాలు బడ్జెట్ పండుగ ఉత్సవాలకు తగ్గించుకుంటున్నారు. ప్రధానంగా బియ్యం అందనంత దూరంగా వెళ్తున్నాయి.
సెంచరీకి చేరువలో సన్నబియ్యం
ఎల్నినో విపత్తుతో ఊహించిన విధంగా సన్న బియ్యం ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. సన్న బియ్యం కిలో ధర సెంచరీ వైపు దూసుకుపోతుంది. డిమాండ్ సరిపడా సన్న రకం బియ్యం సరఫరా లేక ధరలు పెరుగుతున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు వర్షాలు లేక పంటలు దిగుబడి ఉండదని భావించి కృత్రిమ కొరతతోనే రేట్లు పెరుగుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి. ప్రకృతి, వైపరీత్యాల కంటే మిల్లర్ల మాయాజాలం ఎక్కువగా ఉందని చెబుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో సాధారణంగా ప్రజలు నిత్యం జైశ్రీరామ్(జేఎస్ఆర్), బీపీటీ, హెచ్ఎంటీ వంటి సన్న రకాల బియ్యం వినియోగిస్తారు. ఇందులో జైశ్రీరామ్ క్వింటాలు ధర రూ.9 వేలకు చేరుకుంది. బీపీటీ రూ.6500 నుంచి రూ.7వేలు వరకు, హెచ్ఎంటీ రూ.7 వేల నుంచి రూ.8 వేల వరకు అమ్ముతున్నారు. కిలో బియ్యం రూ.100కు చేరుతుందని భావిస్తున్నారు. దీంతో సామాన్య కుటుంబాలు ముందస్తుగానే కొనుగోలు చేస్తున్నారు.
పండుగ పూట వంటింట్లో మంటలు
జిల్లాలో బతుకమ్మ, దసరా సెలవులకు దూర దూర ప్రాంతాల్లో ఉద్యోగరీత్యా, చదువుల రీత్యా వెళ్లినవారు తిరిగి సొంత ఊర్లకు చేరుకున్నారు. దీంతో నిత్యావసర సరుకుల వాడకం కూడా పెరిగింది. రోజువారీగా ఉపయోగించే నిత్యావసర సరుకులు, కూరగాయలు పెరిగాయి. కందిపప్పు, నువ్వులు, శనగపప్పు, జిలకర, పల్లీలు, చక్కెర వంటి సరుకుల ధరలు కూడా భారీగా పెరిగాయి. కందిపప్పు రూ.180 కిలో కాగా, నువ్వులు 230, పల్లీలు 180, పెసరపప్పు రూ.140, చక్కెర రూ.60, కందిపప్పు రూ.180 పెరిగింది. దీంతో పాటు టీ పొడి, సబ్బులు, సర్ఫ్ ప్యాకెట్లు, నూనెలు ఇతర వస్తువులపై కూడా 5 నుంచి 10 శాతం ధరలు పెరిగాయి.
ఉడకని కూరగాయలు...
నిత్యావసర సరుకులకు తోడుగా కూరగాయల ధరలు కూడా పెరగడంతో వంటింట్లో కూరలు వండకముందే భగభగమంటున్నాయి. ఉల్లి కిలో ధర రూ.70 దాటింది. కూరలు, ఇతర కూరగాయలు కిలో రూ.100కు చేరాయి. సాధారణంగా స్థానికంగా పండించే కూరగాయలు కూడా పావు కిలో రూ.20 అమ్ముతున్నారు. పల్లెటూరు కూడా భారీగా పెరిగే అందరికీ అందుబాటులో ఉండే అరటి పండ్లు కూడా ఇప్పుడు డజన్ రూ.60 నుంచి రూ.70 విక్రయిస్తున్నారు. పండుగ సమయంలో ధరల నియంత్రణ లేకపోవడంతో సామాన్య ప్రజలు విలవిల్లాడుతున్నారు. బియ్యంతో పాటు ఇతర సరుకుల ధరల తగ్గుదలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని కోరుతున్నారు.