ఎస్ఐఆర్ దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి
ABN , Publish Date - Oct 17 , 2026 | 11:57 PM
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) ప్రక్రియలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి సుదర్శన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.
కరీంనగర్, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) ప్రక్రియలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి సుదర్శన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎస్ఐఆర్, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు తదితర అంశాలపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి సుదర్శన్‌రెడ్డి హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బూత్ స్థాయి అధికారులు (బీఎల్ఓలు) ఓటర్ల ఇళ్లకు వెళ్లి నోటీసులు అందజేయడంతో పాటు, అవసరమైన ధ్రువీకరణ పత్రాలను స్వీకరించాలని సూచించారు. ఓటర్ల అర్హతలను నిర్ధారించే సమయంలో సంబంధిత పత్రాలను జాగ్రత్తగా పరిశీలించి, అర్హులైన ఓటర్ల వివరాలు సక్రమంగా నమోదయ్యేలా చూడాలని ఆదేశించారు. ప్రతి బూత్ స్థాయి అధికారి తమ పరిధిలోని దరఖాస్తులు, ఓటర్ల వివరాలకు సంబంధించిన రికార్డులను భౌతిక పత్రాల రూపంలో సక్రమంగా నిర్వహించి, భవిష్యత్తు అవసరాల కోసం భద్రపరచాలని సూచించారు.