లక్ష్యానికి దూరంగా సింగరేణి
ABN , Publish Date - Mar 30 , 2026 | 01:10 AM
రెండు దశాబ్దాల కాలంగా లాభాల బాటలో పయనిస్తున్న సింగరేణి కాలరీస్ సంస్థ బొగ్గు ఉత్పత్తిలో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్నది.
పెద్దపల్లి, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): రెండు దశాబ్దాల కాలంగా లాభాల బాటలో పయనిస్తున్న సింగరేణి కాలరీస్ సంస్థ బొగ్గు ఉత్పత్తిలో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్నది. ఉత్పత్తి లక్ష్యాలను అధిగమించలేక పోతున్నది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను నిర్ధేశించిన బొగ్గు లక్ష్యంలో శుక్రవారం నాటికి 72 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తికిగాను 57.58 మిలియన్ టన్నులు 81 శాతం బొగ్గు ఉత్పత్తి జరిగింది. ఆర్థిక సంవత్సరం ముగింపునకు మరో రెండు రోజులు మాత్రమే గడువు మిగిలి ఉంది. సింగరేణి మొత్తం ఏరియాల్లో రోజు వారీగా 2.81 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి జరగాల్సి ఉండగా 1.90 లక్షల టన్నుల ఉత్పత్తి మాత్రమే జరుగుతున్నది. సింగరేణి వ్యాప్తంగా కొత్తగూడెం, సత్తుపల్లి, ఇల్లందు, మణుగూర్, బెల్లంపల్లి, మందమర్రి, శ్రీరాంపూర్, ఆర్‌జీ 1, 2, 3, ఏపీఏ, భూపాలపల్లి ఏరియాల్లో అండర్ గ్రౌండ్ గనులతో పాటు ఓపెన్ కాస్టు గనుల్లో బొగ్గు ఉత్పత్తి జరుగుతున్నది. ఇప్పటి వరకు ఆయా ఏరియాలకు సింగరేణి సంస్థ నిర్ధేశించిన లక్ష్యాల్లో సత్తుపల్లి, బెల్లంపల్లి ఏరియాలలో మాత్రమే వంద శాతానికి పైగా బొగ్గు ఉత్పత్తి జరిగింది. అడ్రియాల లాంగ్ వాల్ ప్రాజెక్టులో 11 శాతం మాత్రమే బొగ్గు ఉత్పత్తి జరిగింది. ధర్మల్ విద్యుత్ కేంద్రాల నుంచి గ్రేడ్ 14, గ్రేడ్ -15, గ్రేడ్ -16ల బొగ్గు దిగుమతులకు అభ్యంతరాలు వ్యక్తం అవుతుండడంతో కొంత మేరకు సింగరేణి సంస్థ 12 ఏరియాల్లో లక్ష్యాన్ని తగ్గించింది. అయినా కూడా బొగ్గు ఉత్పత్తిలో వెనుకబడే ఉంది. సింగరేణిలో అత్యధికంగా ఉత్పత్తి అవుతున్న గ్రేడ్-15 బొగ్గుకు మార్కెటింగ్ లేని కారణంగా సంస్థ ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్నది. థర్మల్ విద్యుత్ కేంద్రాలు గ్రేడ్-15 బొగ్గును నిరాకరిస్తుండడతో సింగరేణికి పెను సవాల్‌గా మారింది. ఎన్టీపీసీ, ఏపీ జెన్‌కో, కర్ణాటక విద్యుత్ కేంద్రాలు బొగ్గులో నాణ్యత లేదని నిరాకరిస్తున్నాయి. కోల్ ఇండియా, విదేశీ బొగ్గు ధరలతో పోలిస్తే సింగరేణి బొగ్గు ధర మూడు రెట్లు ఎక్కువగా ఉందని ఆ సంస్థలు కేంద్ర ప్రభుత్వానికి మొర పెట్టుకోవడంతో సింగరేణిలో ధరలను తగ్గించారు. బేసిక్ ప్రైస్‌లో 650 రూపాయలు తగ్గించినప్పటికీ ఆ సంస్థలు ఇంకా ధర తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాయి. సింగరేణిలో ఒక టన్ను బొగ్గు ఉత్పత్తికి 3,400 రూపాయలు అవుతుండగా, 3,622 రూపాయలకు అమ్మకాలు సాగిస్తున్నారు. ఇంకా ధర తగ్గించలేక సంస్థ సతమతమవుతున్నది. దేశవ్యాప్తంగా ఎక్కువగా సూపర్ క్రిటికల్ పవర్ ప్లాంట్లు ఉండడంతో అవి గ్రేడ్-14, గ్రేడ్-15 బొగ్గు రకాలను తీసుకునేందుకు నిరాకరిస్తుండడంతో బొగ్గు ఉత్పత్తి తగ్గడానికి కారణమని తెలుస్తున్నది. నాణ్యత గ్రేడ్ పెరగడానికి కోల్ వాషరీస్ ప్లాంట్లను ఏర్పాటు చేసినా రవాణా భారం పెరగడంతో గిట్టుబాటు కావడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆయా విద్యుత్ సంస్థలు నాణ్యత లేని కారణంగా బొగ్గును నిరాకరిస్తుండడంతో సింగరేణి వ్యాప్తంగా కొంత మేరకు గ్రేడ్-14, గ్రేడ్-15, గ్రేడ్-16, గ్రేడ్-17 బొగ్గు ఉత్పత్తిని నిలిపివేసినట్లు సమాచారం. గతంతో పోలిస్తే సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తిలో అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఆరంభం కావాల్సిన కొత్తగూడెం, ఇల్లందు ఓసీపీల్లో బొగ్గు ఉత్పత్తి జరగలేదు. అలాగే ఒడిశాలో గల నైనీ బొగ్గు గనుల్లో ఈ ఆర్థిక సంవత్సరంలో 4 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే టెండర్ల విషయంలో జరిగిన అవకతవకల వల్ల పాత టెండర్లను ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో అక్కడ ఇంకా బొగ్గు ఉత్పత్తి ఆరంభం కాలేదు. సింగ రేణిలో పని చేస్తున్న అధికారులకు పే రిలేటెడ్ పే (పీఆర్‌పీ)లు మూడే ళ్లుగా ఇవ్వని కారణంగా కూడా ఉత్పత్తిపై ప్రభావం చూపిందనే అభిప్రా యాలు వ్యక్తమవుతున్నాయి. లక్ష్యానికి మరో రెండు రోజులు మాత్రమే ఉండడంతో బొగ్గు ఉత్పత్తి 60 వేల మిలియన్ టన్నులకు చేరవచ్చని సింగరేణి వర్గాలు అంచనా వేస్తున్నాయి.
నిర్ధేశిత లక్ష్యంలో ఏరియాల వారీగా బొగ్గు ఉత్పత్తి
కొత్తగూడెం 91.6 శాతం
సత్తుపల్లి 100.5 శాతం
ఇల్లందు 49.0 శాతం
మణుగూరు 90.9 శాతం
బెల్లంపల్లి 99.7 శాతం
మందమర్రి 70.3 శాతం
శ్రీరాంపూర్ 67.1 శాతం
ఆర్జీ-1 81.3 శాతం
ఆర్జీ-2 88.4 శాతం
ఆర్జీ-3 70.7 శాతం
ఏపీఏ 11.0 శాతం
భూపాలపల్లి 60.5 శాతం