Share News

లక్ష్యానికి దూరంగా సింగరేణి

ABN , Publish Date - Mar 04 , 2026 | 01:03 AM

సింగరేణి యేటా ఉత్పత్తి లక్ష్యాలను అధిగమిస్తూ ఇన్నేళ్ళు రికార్డు సాధించింది. 1996 నుంచి 30ఏళ్ల పాటు నిర్ధేశించు కున్న ఉత్పత్తి లక్ష్యాలను అధిగమిస్తూ చరిత్ర సృష్టిస్తూ వస్తున్నది.

లక్ష్యానికి దూరంగా సింగరేణి

గోదావరిఖని, మార్చి 3(ఆంధ్రజ్యోతి): సింగరేణి యేటా ఉత్పత్తి లక్ష్యాలను అధిగమిస్తూ ఇన్నేళ్ళు రికార్డు సాధించింది. 1996 నుంచి 30ఏళ్ల పాటు నిర్ధేశించు కున్న ఉత్పత్తి లక్ష్యాలను అధిగమిస్తూ చరిత్ర సృష్టిస్తూ వస్తున్నది. కాగా ప్రస్తుత 2025-26 ఆర్థిక సంవత్స రంలో ఉత్పత్తి లక్ష్యాల సాధనకు ఎంతో దూరంలో ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం ఈ నెలాఖరుకు 19.30 మిలి యన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక నెలలో 4.5 నుంచి 5మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసేందుకు ప్రయాస పడుతున్న సింగరేణి 19.5మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయడం అసాధ్యమవుతుంది.

ఈ ఆర్థిక సంవత్సరం 72 మిలియన్‌ టన్నుల వార్షిక లక్ష్యాన్ని ఎంచుకున్న సింగరేణి సంస్థ 11నెలల్లో అంటే ఫిబ్రవరి మాసాంతం వరకు 19.98మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తిలో వెనుకంజలో ఉంది. 64.68 మిలియన్‌ టన్నులు చేయాల్సి ఉండగా 52.70మిలియన్‌ టన్నులు మాత్రమే ఉత్పత్తి చేసింది. అంటే ఫిబ్రవరి వరకు 81శాతం మాత్రమే ఉత్పత్తిని సాధించింది. దీంతో ఒక్క మార్చి నెలలోనే సుమారు 20మిలియన్‌ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయాల్సి ఉంది. అంటే రోజు 6.5లక్షల టన్నుల బొగ్గును సింగరేణి ఉత్పత్తి చేయాలి. కానీ 1.5 లక్షల టన్నులు మాత్రమే సింగరేణిలో ఉత్పత్తి జరుగు తున్నది. ఈ లెక్కన మార్చి 31వరకు 4 నుంచి 5 మిలి యన్‌ టన్నుల బొగ్గు మాత్రమే ఉత్పత్తి చేసే అవ కాశాలున్నాయి. అంటే కనీసం 15మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి తగ్గిపోతున్నది. సుమారు ఇది సింగరేణి సంస్థకు అనూహ్యమైన ప్రతికూల పరిస్థితులను తీసుకువచ్చే ప్రమాదం ఉంది.

ఇంతేకాకుండా ఒడిశాలోని నైనీ బొగ్గు బ్లాకు నుంచి కూడా సింగరేణి సంస్థ 2025-26 ఆర్థిక సంవత్సరంలో 4 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకు న్నది. అక్కడ బొగ్గు నాణ్యమైనది, ఉత్పత్తి వ్యయం చాలా తక్కువ ఉండడంతో లాభాలు ఎక్కువ వస్తా యని అంచనా వేసింది. కానీ రవాణా వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడంలో సింగరేణి వైఫల్యంతో నైనీ బొగ్గు బ్లాకు నుంచి ఉత్పత్తులు నిలిపివేసుకుంది. దీంతో నైనీ బ్లాక్‌ నుంచి రావాల్సిన 4మిలియన్‌ టన్నుల బొగ్గు కూడా ఉత్పత్తి చేయలేకపోయింది. ఈ పరిణామం కూడా సింగరేణి సంస్థపై శరాఘాతం కానున్నది. అయితే సింగరేణి సంస్థ కొంతకాలంగా మూడు నాలు గు మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించ లేకపోయినప్పటికీ సీఎస్‌పీలు, కోల్‌ బెంచ్‌లు, ఓపెన్‌ కాస్టుల్లో ల్వలు ఉన్నట్టు చూపించి ఉత్పత్తి లక్ష్యాలను సాధించినట్టు అప్పుడప్పుడు చేసింది. కొంత బొగ్గు కాలి పోయినట్టు, కొంత బొగ్గు కొన్నాళ్లకు మట్టిగా మారినట్టు కూడా చేయగలిగింది. కానీ 17మిలియన్‌ టన్నుల బొగ్గు తక్కువ ఉత్పత్తి కావడాన్ని సింగరేణి యాజమాన్యం కాకిలెక్కల ద్వారా కప్పిపుచ్చడం సాధ్యం కాదు.

అన్ని డివిజన్లలో అదే పరిస్థితి...

బొగ్గు ఉత్పత్తి విషయంలో సింగరేణిలోని అన్ని డివిజన్లలో ఇదే పరిస్థితి నెలకొన్నది. ఒక్క డివిజన్‌లో కూడా 11మాసాల్లో 100శాతం ఉత్పత్తి సాధించిన పరిస్థితి లేదు. గతంలో పోటీ పడి ఉత్పత్తి చేసిన స్ఫూర్తి సింగరేణిలో కొరవడింది. అండర్‌ గ్రౌండ్‌ గనులు ఎక్కువగా ఉన్న డివిజన్లలో ఉత్పత్తి తక్కువగా ఉన్నప్ప టికీ ఓపెన్‌కాస్టులు ఉన్న ప్రాంతాల్లో ఉత్పత్తి 130, 140 శాతంగా గతంలో నమోదయ్యేది. కానీ 2025-26 ఆర్థిక సంవత్సరం గడిచిన 11మాసాల్లో ఏ ఒక్క డివిజన్‌లో కనీసం 100శాతం ఉత్పత్తి జరుగలేదు. అత్యధికంగా కొత్తగూడెం డివిజన్‌లో 92శాతం ఉత్పత్తి అయితే అత్య ల్పంగా అడ్రియాల ప్రాజెక్టులో 11శాతం మాత్రమే బొగ్గును వెలికితీశారు. ఇల్లందు డివిజన్‌లో 52శాతం, ఎస్‌పీఎల్‌లో 101శాతం, మణుగూరులో 92శాతం, బెల్లంపల్లిలో 99శాతం, మందమర్రిలో 68శాతం, శ్రీరాం పూర్‌లో 70శాతం, ఆర్‌జీ-1లో 83శాతం, ఆర్‌జీ-2లో 92శాతం, ఆర్‌జీ-3లో 74శాతం, భూపాలపల్లిలో 63 శాతం ఉత్పత్తులు నమోదయ్యాయి.

మార్కెటింగ్‌ లోపాలు

సింగరేణి సంస్థ బొగ్గుకు గతంలో మార్కెట్‌లో చాలా డిమాండ్‌ ఉండేది. ఆ సందర్భంలో సింగరేణి తన బొగ్గుపై ధరను తానే నిర్ణయించుకునేది. మూడేళ్ల క్రితం వరకు బొగ్గు ధరను పెంచుకుంటూపోయింది. బొగ్గు మార్కెట్‌ నుంచి ఒత్తిళ్లు రావడంతో సింగరేణి తన బొగ్గుపై ధరను పెంచే ఆస్కారం లేకుండా పోయింది. బొగ్గు నాణ్యత విషయంలో సింగరేణి ప్రమాణాలను పాటించడం లేదని మార్కెట్‌లో డిమాండ్‌ తగ్గిపో యింది. నాణ్యతను పెంచుకుని మార్కెటింగ్‌ విషయం లో సింగరేణి నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ఉత్పత్తి చేసిన బొగ్గును అమ్ముకోవడం సింగరేణి సవాల్‌గా మారింది. ఈ కారణం చేత కూడా వార్షిక ఉత్పత్తి లక్ష్యా లను సాధించే విషయంలో సింగరేణి సంస్థ ఉదాసీన వైఖరిని అవలంభించింది.

తగ్గనున్న రూ.10వేల కోట్ల టర్నోవర్‌

ఈ ఆర్థిక సంవత్సరంలో 15వేల మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధ్యం కాని పరిస్థితుల్లో సింగరేణి సంస్థ టర్నోవర్‌పై రూ.10వేల కోట్లు తగ్గే అవకాశాలు కనిపి స్తున్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి సంస్థ టర్నోవర్‌ను రూ.45వేల కోట్లుగా చూపించి రూ.6వేల కోట్ల లాభాలను ప్రకటించింది. విద్యుత్‌, బొగ్గు విక్రయాలతో సింగరేణికి ఇంత భారీ టర్నోవర్‌ సాధ్యమైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 20శాతం బొగ్గు ఉత్పత్తి తగ్గే అవకాశాలున్న నేపథ్యంలో అదే దామా షాలో సమారు రూ.10వేల కోట్ల టర్నోవర్‌ కూడా తగ్గే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇది సింగరేణి లాభాలపై ప్రభావం చూపనున్నది. బొగ్గు ఉత్పత్తి లక్ష్యాల సాధ నలో ఇంత భారీ స్థాయిలో సింగరేణి వెనుకబడిన అంశం ఇటు యాజమాన్య వర్గాలతోపాటు అధికారుల్లో, కార్మికుల్లో ఆందోళన కలిగిస్తున్నది. 30ఏళ్లుగా అప్రతిహతంగా ఉత్పత్తి లక్ష్యాలను సాధిస్తూ వరుస లాభాలను గడిస్తున్న సింగరేణి ఈ పరిస్థితిని అధిగమించడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.

Updated Date - Mar 04 , 2026 | 01:03 AM