శ్రీరామ దూతం శిరసా నమామి
ABN , Publish Date - May 10 , 2026 | 11:59 PM
వైశాఖ బహుళ దశమి పూర్వాభాద్ర నక్షత్రుంలో జన్మించిన ఆంజనేయుడు శ్రీరాముడి భక్తుడు. మహాధీశాలి. వీరుడు. సర్వ సమర్ధుడు. సప్త చిరంజీవుల్లో ఒకడు. శివపురాణం-రుద్రసంహితలో చెప్పినట్లుగా శివాంశా సంభూతుడైన ఆంజనేయుడు విష్ణు స్వరూపుడైన శ్రీరాముడిని కొలుస్తూ వ్యాకరణ, నీతి, త్తత్వ, వాస్తు శాస్త్ర కోవిదుడిగా, బుద్ధి పరాక్రమాలను చూపే వ్యక్తిగా రామాయణంలో దర్శనమిస్తాడు.
కరీంనగర్ కల్చరల్, మే 10 (ఆంధ్రజ్యోతి): వైశాఖ బహుళ దశమి పూర్వాభాద్ర నక్షత్రుంలో జన్మించిన ఆంజనేయుడు శ్రీరాముడి భక్తుడు. మహాధీశాలి. వీరుడు. సర్వ సమర్ధుడు. సప్త చిరంజీవుల్లో ఒకడు. శివపురాణం-రుద్రసంహితలో చెప్పినట్లుగా శివాంశా సంభూతుడైన ఆంజనేయుడు విష్ణు స్వరూపుడైన శ్రీరాముడిని కొలుస్తూ వ్యాకరణ, నీతి, త్తత్వ, వాస్తు శాస్త్ర కోవిదుడిగా, బుద్ధి పరాక్రమాలను చూపే వ్యక్తిగా రామాయణంలో దర్శనమిస్తాడు. భగవంతుడి కంటే భక్తుడు గొప్పవాడని మారుతి నిరూపించాడు. అందుకే హనుమలేని రామాలయం, నంది లేని శివాలయం ఉండదు. తన లోకాన్ని చేరబోతూ రాముడు జగత్కల్యాణం కోసం భూమిపై ఉండమని హనుమను ఆదేశిస్తాడు. హనుమంతుడు సీతాన్వేషణలో సహాయం చేశాడు. లక్ష్మణుడిని సంజీవని తెచ్చి బతికించాడు. భోగ, మోక్షాలను ఇచ్చే కల్పవృక్షం, కామధేనువు వంటి దేవుడు ఆంజనేయుడని శౌన సంహిత చెబుతుంది. బ్రహ్మకు కూడా వర్ణించలేని మహిమ గల హనుమను పూజిస్తే సకల దేవతలను పూజించినట్లేనని పరాశర సంహిత చెప్పింది. ప్రతి మంగళ, శనివారాల్లో స్వామిని కొలవటం, సుందరకాండలోని సర్గలను పారాయణం, హవనం చేయడం ద్వారా కోరికలు నెరవేర్చుకోవచ్చు. మంగళవారం పెద్ద హనుమాన్ జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని ఆంజనేయస్వామి ఆలయాలన్నీ ముస్తాబయ్యాయి. దీక్షా విరమణలు, ఇరుముడులు, ప్రత్యేక పూజలు, అభిషేకాలకు సిద్ధం చేశారు. ఎక్కడ చూసినా సింధూరవర్ణ వస్త్రధారణలు కలిగిన దీక్షాపరులు కన్పిస్తున్నారు. నగరంలోని దాదాపు నలభై ఐదు నుంచి యాభైకి పైగా గల హనుమదాలయాలన్నీ దీక్షాపరులు, భక్తుల రామ, హనుమ నామస్మరణలు, భజనలతో మార్మోగనున్నాయి. జయంతి మంగళవారం కావడంతో విశిష్టతను సంతరించకోగా దీక్షా విరమణలకు స్థానిక ఆలయాలతో పాటు కొడగట్టు, అగ్రహారం, గూడెం, గట్టుదుద్దెనపల్లి, విజయవాడ తదితర ప్రాంతాలకు దీక్షాపరులు తరలి వెళ్లనున్నారు.