అర్బన్ బ్యాంకు పాలకవర్గానికి షాక్..
ABN , Publish Date - Jun 24 , 2026 | 01:06 AM
‘పిట్ట పోరు.. పిట్ట పోరు.. పిల్లి తీర్చింది..’ అన్నట్టుగా మారింది కరీంనగర్ అర్బన్ బ్యాంకు పాలకవర్గం వ్యవహారం. పాలకవర్గాన్ని రద్దు చేస్తూ ప్రత్యేక అధికారిని నియమించాలని రాష్ట్ర హైకోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం.
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్)
‘పిట్ట పోరు.. పిట్ట పోరు.. పిల్లి తీర్చింది..’ అన్నట్టుగా మారింది కరీంనగర్ అర్బన్ బ్యాంకు పాలకవర్గం వ్యవహారం. పాలకవర్గాన్ని రద్దు చేస్తూ ప్రత్యేక అధికారిని నియమించాలని రాష్ట్ర హైకోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం. అధికార కాంగ్రెస్ పార్టీకే చెందిన ఇద్దరు నేతలు చైర్మన్ పదవికి పోటీపడగా నెలకొన్న వివాదం ఎన్నికలు ముగిసి పాలకవర్గం ఏర్పడి ఆరు నెలలు గడిచినా కొనసాగుతూనే ఉంది. అర్బన్ బ్యాంకు పరిస్థితి మూడు పిటిషన్లు.. ఆరు కేసులు అన్న చందంగా మారింది. ఆఖరుకు సొంత పార్టీ నేత వేసిన కేసులోనే అర్బన్ బ్యాంకు చైర్మన్, పాలకవర్గం పదవి కోల్పోయినట్లు జిల్లాలో ప్రచారం జరుగుతున్నది. కోర్టు జారీ చేసిన ఉత్తర్వులు ఇంకా అందక పోయినా కేసు వేసిన మాజీ చైర్మన్ గడ్డం విలాస్‌రెడ్డి, ఆయన వర్గీయులు ఈ విషయాన్ని పార్టీ వర్గాల్లో ప్రచారం చేస్తున్నారు.
ఫ చైర్మన్ వర్సెస్ మాజీ చైర్మన్
అర్బన్ బ్యాంకు ఎన్నికల వ్యవహారంలో ప్రస్తుత చైర్మన్ కర్ర రాజశేఖర్, మాజీ చైర్మన్ గడ్డం విలాస్‌రెడ్డి మధ్య నెలకొన్న పోటీ వాతావరణం, ట్రిబ్యునల్‌లో, హైకోర్టులో కేసులు వేసిన వ్యవహారం జిల్లాకే చెందిన మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి చేరింది. ఇద్దరు ఈ విషయంలో సర్దుబాటు చేసుకోండని ఆయన సూచించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో అధికారపార్టీకి చెందిన పాలకవర్గం పదవి కోల్పోవలసి వచ్చింది. గత నవంబరు 1న అర్బన్ బ్యాంకు పాలకవర్గానికి ఎన్నికలు జరిగాయి. సహకార చట్టం, బ్యాంకు బైలా ప్రకారంగా మార్చి 31వ తేదీలోగా బ్యాంకు సర్వసభ్య సమావేశం నిర్వహించక పోవడంతో పాలకవర్గం రద్దయినట్లు భావించి పీఐసీ (పర్సన్ ఇన్‌చార్జి కమిటీ) లేదా స్పెషల్ ఆఫీసర్‌ను నియమించాలని కోరుతూ బ్యాంకు మాజీ చైర్మన్ గడ్డం విలాస్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంకుకు నాలుగువారాల్లో పీఐసీ లేదా ప్రత్యేకాధికారిని నియమించాలంటూ రిజిస్ట్రార్ అండ్ కమిషనర్‌కు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం. ప్రస్తుత చైర్మన్, పాలకవర్గ సభ్యులు కోర్టు ఉత్తర్వులేవి తమకు అందలేదని, పాలకవర్గ రద్దు ఉత్తర్వులు వస్తే స్టేకు వెళ్తామని అంటున్నారు.