Share News

ఆయిల్‌పామ్‌ సాగు వైపు మొగ్గు..

ABN , Publish Date - Jul 25 , 2026 | 12:48 AM

ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు కురవడం లేదు. సంప్రదాయ పంటల సాగు సవాల్‌గా మారుతున్న నేపథ్యంలో జిల్లా రైతులు ప్రత్యామ్నాయంగా ఆయిల్‌పామ్‌ సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహం, ఎకరానికి 50 వేల రూపాయల వరకు సబ్సిడీ అందిస్తుండడం, గిట్టుబాటు ధరలు లభిస్తుండడంతో యేటా ఆయిల్‌పామ్‌ విస్తీర్ణం పెరుగుతున్నది.

ఆయిల్‌పామ్‌ సాగు వైపు మొగ్గు..

- ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో పెరుగుతున్న సాగు

- ఈ ఏడాది టార్గెట్‌ 1150 ఎకరాలు

- ఇప్పటికే 428 ఎకరాల్లో మొక్కలు నాటిన రైతులు

- గత ఏడాది వరకు 3,569 ఎకరాల్లో సాగు

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు కురవడం లేదు. సంప్రదాయ పంటల సాగు సవాల్‌గా మారుతున్న నేపథ్యంలో జిల్లా రైతులు ప్రత్యామ్నాయంగా ఆయిల్‌పామ్‌ సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహం, ఎకరానికి 50 వేల రూపాయల వరకు సబ్సిడీ అందిస్తుండడం, గిట్టుబాటు ధరలు లభిస్తుండడంతో యేటా ఆయిల్‌పామ్‌ విస్తీర్ణం పెరుగుతున్నది. నాలుగేళ్లుగా జిల్లాలో ఆయిల్‌పామ్‌ సాగుకు రైతులు శ్రీకారం చుట్టగా, ఇప్పటి వరకు 900 ఎకరాల్లో పంట కోతకు రావడం గమనార్హం. జిల్లాలో ఉన్న భూములు సైతం సాగుకు అనుకూలంగా ఉండడం, ఆయిల్‌పామ్‌తో పాటు మధ్యలో అంతర పంటలు సాగు చేసుకునే అవకాశం ఉండడంతో రైతులు ఆ పంటపై దృష్టి సారిస్తున్నారు. 2026-27 సంవత్సరానికి గాను జిల్లాలో 1150 ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ సాగు చేయించాలని ప్రభుత్వం లక్ష్యం విధించింది. ఇప్పటి వరకు 428 ఎకరాల్లో రైతులు తమ పంట పొలాల్లో ఆయిల్‌పామ్‌ మొక్కలను నాటారు. పెద్దపల్లి ఎమ్మెల్యే చింత కుంట విజయరమణారావు సైతం ఐదు ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ చేపట్టారు. శుక్రవారం ఒక్కరోజే 120 ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ మొక్కలు నాటడం గమనార్హం. కలెక్టర్‌ కోయ శ్రీహర్ష, జిల్లా ఉద్యాన శాఖాధికారి గడ్డం శ్యామ్‌ప్రసాద్‌ రైతులను ప్రోత్సహిస్తున్నారు. ఎల్‌నినో ప్రభావం వల్ల వరి, మొక్కజొన్న, పత్తి పంటలు ముందుకు సాగడం లేదు. ఈ నేపథ్యంలో పత్యామ్నాయంగా ఆయిల్‌పామ్‌ సాగు చేపట్టాలని సంబంధిత శాఖాధికారులు రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుండడంతో రైతులు ముందుకు వస్తున్నారు.

ఫ 2022లో ఆయిల్‌పామ్‌కు శ్రీకారం..

రాష్ట్ర వ్యాప్తంగా ఆయిల్‌పామ్‌ సాగుపై రైతులను ప్రోత్సహించేందుకు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ శ్రీకారం చుట్టారు. అప్పటికే రాష్ట్రంలోని ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఆయిల్‌పామ్‌ సాగు చేస్తున్నారు. రైతులు పండించిన పంటను కొనుగోలు చేసేందుకు ఆశ్వరావుపేటలో పామాయిల్‌ ఫ్యాక్టరీని ఏర్పాటు చేశారు. పంట విక్రయించుకోవడం సులువుగా మారడం, గిట్టుబాటు ధరలు లభిస్తుండడం, అంతర పంటల సాగుకు ఆస్కారం ఉండడంతో ఆయిల్‌పామ్‌పై రైతులు ఆసక్తి చూపారు. ఆయిల్‌పామ్‌ పంటను రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు విస్తరించేందుకు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా జిల్లాలో ఆయిల్‌పామ్‌ సాగు చేసే రైతుల నుంచి గెలలను స్థానికంగానే కొనుగోలు చేసే విధంగా కాల్వశ్రీరాంపూర్‌ మండలం పెదరాతుపల్లిలో ఆయిల్‌పామ్‌ ఫ్యాక్టరీని నిర్మిస్తున్నారు. మరో 6 మాసాల్లో ఆ ఫ్యాక్టరీ పూర్తి కానున్నది. గత ఏడాది నుంచే జిల్లాలో ఆయిల్‌పామ్‌ పంట మొదటి కోత చేతికి వచ్చింది. జిల్లాలోని భూములు అనువుగా ఉండడంతో 3 నుంచి మూడున్నర ఏళ్లకే మొదటి కోత వచ్చింది. గత ఏడాది వరకు జిల్లాలో 3,569 ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ సాగు చేయగా, ఇప్పటి వరకు 900 ఎకరాల్లో పంట చేతికి వచ్చింది. ఒక్కో టన్నుకు 23,500 రూపాయల ధర పలుకుతున్నదని రైతులు తెలిపారు. మొదటి కోతలో దిగుబడి 3 టన్నులు, నాలుగైదేళ్ల తర్వాత రెండో కోత 6 టన్నులు, ఎనిమిదేళ్లకు 10 టన్నుల వరకు దిగుబడి వస్తుందని అధికారులు చెబుతున్నారు. ఈ పంట కాలం 35 ఏళ్లు. ఆయిల్‌పామ్‌తో పాటు అంతర పంటగా కూరగాయలు, వేరుశెనగ, తదితర పంటలు సాగు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఒక్కో ఎకరానికి ప్రభుత్వం 50 వేల వరకు సబ్సిడీ ఇస్తున్నది. ఎకరానికి 57 మొక్కల కోసం 11 వేలు, నిర్వహణకు 4,500, డ్రిప్‌ కోసం 23 వేల రూపాయల వరకు సబ్సిడీ ఇవ్వనున్నారు. దీంతో రైతులు ఆయిల్‌పామ్‌ సాగుపై ఆసక్తి చూపుతున్నారు.

ఫ ఆయిల్‌పామ్‌ సాగుతో అధిక లాభాలు..

- గడ్డం శ్యామ్‌ ప్రసాద్‌, జిల్లా ఉద్యాన శాఖాఽధికారి

ఆయిల్‌పామ్‌ సాగు చేయడం వల్ల రైతులకు అధిక లాభాలు వస్తాయి. ఆయిల్‌పామ్‌తో పాటు అంతర పంటల వల్ల కూడా ఆదాయం వస్తుంది. ఈ ఏడాది 1150 ఎకరాల్లో టార్గెట్‌ విధించగా కలెక్టర్‌ ప్రోత్సాహంతో ఇప్పటి వరకు 428 ఎకరాల్లో మొక్కలు నాటించాం. టార్గెట్‌ పూర్తి చేసేందుకు రైతులను ప్రోత్సహిస్తున్నాం. ఎకరానికి 50 వేల వరకు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తున్నది. మరో ఆరు నెలల్లో పెద్దరాతుపల్లిలో నిర్మిస్తున్న ఆయిల్‌ ఫ్యాక్టరీ అందుబాటులోకి రానున్నది.

Updated Date - Jul 25 , 2026 | 12:49 AM