Share News

గోదావరి నీటిశుద్ధి పనుల్లో తీవ్ర జాప్యం...

ABN , Publish Date - Apr 06 , 2026 | 02:15 AM

పవిత్ర గోదావరి జలాలు తాగేందుకు కాదు కదా స్నానాలకు కూడా పనికి రాకుండా పోయాయి.

గోదావరి నీటిశుద్ధి పనుల్లో తీవ్ర జాప్యం...

కోల్‌సిటీ, ఏప్రిల్‌ 5(ఆంధ్రజ్యోతి): పవిత్ర గోదావరి జలాలు తాగేందుకు కాదు కదా స్నానాలకు కూడా పనికి రాకుండా పోయాయి. పారిశ్రామిక వ్యర్థాలు నేరుగా నదిలో కలువడంతో విషపూరితమయ్యాయి. రామగుండం లో సీవరేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ ఆదేశాలు జారీ చేసింది. దీంతో కేంద్ర ప్రభుత్వం అమృత్‌ 2లో భాగంగా రూ.88కోట్ల నిధులు మంజూరు చేసింది. పారిశ్రామిక వ్యర్థాలు రామగుండం పట్టణం నుంచి వెలువడే వ్యర్థ జలాలు నేరుగా గోదావరి నదిలో కలువకుండా శుద్ధి చేసిన తరువాత నదిలోకి పంపేలా ప్రణాళికలు వేసి కాంట్రాక్టర్లకు పనులు అప్పగించారు. ఏడాదిగా పనులు ముందుకు సాడం లేదు. కేవలం నామమాత్రంగా పనులు చేస్తున్నారనే విమర్శ లున్నాయి. 24నెలల్లో పూర్తి కావాల్సిన పనుల్లో ఇప్పటికీ 10శాతం కూడా పూర్తి కాని పరిస్థితి ఉంది.

ఎస్‌బీఆర్‌ టెక్నాలజీలతో ఎస్‌టీపీల నిర్మాణం

రామగుండంలో అత్యాధునిక ఎస్‌బీఆర్‌ టెక్నాలజీతో ఐదు ఎస్‌టీపీలు నిర్మించాలని మొదట ప్రతిపాదించారు. మల్కాపురం వద్ద పాత ఎస్‌టీపీ స్థానంలో 21 మిలియన్‌ లీటర్‌ ఫర్‌ డే(ఎంఎల్‌డీ) సామర్థ్యం గల ఎస్‌టీపీ, రామగుండంలో 4ఎంఎల్‌డీ సామర్థ్యం గల ఎస్‌టీపీ, యైుటింక్లయిన్‌కాలనీ, అల్లూరుల్లో 6ఎంఎల్‌డీ సామర్థ్యం గల ప్లాంట్‌, జనగామ చెరువు దిగువన 1.5ఎంఎల్‌డీ సామర్థ్యంతో మరో ప్లాంట్‌ ఏర్పాటు చేయాల్సి ఉంది. పాములపేటలో 1ఎంఎల్‌డీ సామర్థ్యం గల ఎస్‌టీపీ ప్రతిపాదించినా ఆ ప్రాంతం గోదావరి నదిలో ముంపునకు గురవుతుండడంతో పాముల పేటలో ఎస్‌టీపీ నిర్మాణ ప్రతిపాదనను విరమించుకున్నారు. రోజుకు 52.5 ఎంఎల్‌డీ సామర్థ్యం గల ఎస్‌టీపీలను నిర్మించి ఇందులో శుద్ధి చేసిన జలాలను క్లోరినేషన్‌ చేసి గోదావరి నదిలోకి వదలాల్సి ఉంటుంది.

ఏడాదిగా నత్తనడక...

రామగుండంలో రూ.88కోట్ల విలువైన పనులను ప్రభుత్వం శోధ- ఐహెచ్‌పీ-ఏఎంఆర్‌ సంయుక్త భాగస్వామ్యం గల సంస్థకు అప్పగించింది. నాలుగు చోట్ల ఎస్‌టీపీల నిర్మాణంతోపాటు 300 నుంచి 800మిల్లీ మీటర్ల వ్యాసం గల పైప్‌లైన్లను నిర్మించాల్సి ఉంటుంది. నగరంలోని ప్రధాన నాలాలు అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీలను అనుసంధానం చేస్తూ సీవరేజ్‌ వాటర్‌ను ఎన్‌టీపీల వద్ద గల వెట్‌వెల్‌లకు తరలించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు కేవలం మల్కాపురం వద్ద మాత్రమే వెట్‌వెల్‌ నిర్మాణాన్ని ప్రారంభించారు. సుమారు 10నెలల క్రితం వెట్‌వెల్‌ నిర్మాణాన్ని ప్రారంభించినా ఇప్పటికీ 20శాతం పనులు కూడా పూర్తి కాలేదు. యైుటింక్లయిన్‌కాలనీలో కనీసం మట్టి పని కూడా పూర్తి చేయలేని పరిస్థితి ఉంది. అల్లూరు, రామగుండంలో ఓపెన్‌ డ్రైన్లు నిర్మించారు. ఈ స్కీమ్‌లో పూర్తిగా క్లోజ్డ్‌ డ్రైన్లు మాత్రమే నిర్మించాలని ఈఎన్‌సీ కార్యాలయం నుంచి ఆదేశాలు రావడంతో పైపుల నిర్మాణం చేపట్టారు. ప్రస్తుతం రామగుండం పట్టణంలో అండర్‌ గ్రౌండ్‌ పైప్‌లైన్‌ నిర్మాణం జరుగుతుంది. ఎన్‌టీపీసీ మేడిపల్లి సెంటర్‌ నుంచి వచ్చే డ్రైనేజీ నీటిని మల్కాపూర్‌ ఎస్‌టీపీకి మళ్లించేందుకు, గోదావరిఖని రాజేష్‌ థియేటర్‌ నాలా, మల్కాపూర్‌ మల్లపు రాణికుంట నాలాలను మళ్లించేందుకు పైప్‌లైన్లు నిర్మిస్తున్నారు. రాజేష్‌ థియేటర్‌ నాలాకు ఇంటర్‌ సెక్షన్‌ డైవర్షన్లు నిర్మించాల్సి ఉంది. ఈ పనులు ఇంకా మొదలు కాలేదు. నాలుగు చోట్ల నిర్మాణాలకుగాను కేవలం ఒక చోట మాత్రమే వెట్‌వెల్‌ నిర్మాణం జరుగుతుంది. 88కోట్ల పనుల్లో రూ.5కోట్ల పనులు కూడా పూర్తి కాని పరిస్థితి ఉంది.

గోదావరి జలాలు కలుషితం కావడంతో రాజకీయ వివాదం...

రామగుండం నియోజకవర్గంలోని గోదావరిఖని, యైుటింక్లయిన్‌కాలనీ, మంథని నియోజకవర్గంలోని సెంటినరీకాలనీ ప్రాంతాలకు గోదావరి నుంచే మంచినీటి సరఫరా జరుగుతుంది. 40ఏళ్ల క్రితం నిర్మించిన ఇన్‌ ఫిల్టరేషన్‌ గ్యాలరీ ద్వారా సేకరించిన నీటినే సింగరేణి పంపింగ్‌ చేస్తుంది. ఈ గ్యాలరీ సమీపంలో ఆర్‌ఎఫ్‌సీఎల్‌, ఎన్‌టీపీసీ నుంచి వెలువడే రసా యనిక విషపూరిత వ్యర్థ జలాలు, నగరం నుంచి వెలువడే సీవరేజ్‌ నాలాలు కలుస్తుండడంతో గోదావరినదిలో నీరు పూర్తిగా కలుషితమైంది. దీనికి తోడు సింగరేణి నిర్మిస్తున్న ర్యాపిడ్‌ ఫిల్టర్‌ బెడ్‌ నిర్మాణం కూడాపూర్తి కాలేదు. దీంతో రెండు నియోజకవర్గాల పరిధిలోని సింగరేణి ఏరియాలకు నీటి సరఫరాలో ఇబ్బందులెదురవుతున్నాయి.

పుష్కరాల వరకైనా పూర్తయ్యేనా...

2027జూన్‌ 26న గోదావరి నదికి పుష్కరాలున్నాయి. ఆలోగా సుందిళ్ల బ్యారేజీలో నీటిని నిల్వ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. గోదావరి పుష్కరాలకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కోట్ల సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశాలున్నాయి. అప్పటిలోగా ఎస్‌టీపీల నిర్మాణం పూర్తికాకపోతే గోదావరి జలాలు కాలుష్యంతో దుర్గంధం వెదజల్లే ప్రమాదం ఉంది. ఈ ఏడాదిలో ఎస్‌టీపీలు పూర్తి చేసుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది.

Updated Date - Apr 06 , 2026 | 02:15 AM