పాఠశాలలు, కళాశాలలను నిరంతరం పర్యవేక్షించాలి
ABN , Publish Date - Sep 28 , 2026 | 11:29 PM
ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, వసతి గృహాలను నిరంతరం పర్యవేక్షింంచాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సంజయ్‌జాజు కలెక్టర్లను ఆదేశించారు.
కరీంనగర్, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, వసతి గృహాలను నిరంతరం పర్యవేక్షింంచాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సంజయ్‌జాజు కలెక్టర్లను ఆదేశించారు. ఆయన హైదరాబాద్ నుంచి ఉన్నతాధికారులతోకలిసి వీడియో కాన్ఫరెన్సు ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ విద్యార్థుల భద్రత, హాజరు, భోజనం, పారిశుధ్యం, ఉపాధ్యాయుల పనితీరు, లెర్నింగ్ ఔట్‌కమ్స్‌పై నిరంతరం పర్యవేక్షణ ఉండాలన్నారు. కలెక్టర్లు, సంబంధితశాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేయాలని సూచించారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యం మెరుగుపడేలా ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలన్నారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణ పురోగతిని క్రమంతప్పకుండా సమీక్షించాలని, 2027 విద్యా సంవత్సరం నాటికి కనీసం 15 నుంచి 20 పాఠశాలలు పూర్తి చేసేలా పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. పాఠశాలలు, వసతి గృహాల్లో పారిశుధ్యం, వంటశాలల పరిశుభ్రత, ఆహారపదార్థాల నాణ్యత, సరఫరాపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. అనుమతి లేకుండా విధులకు గైర్హాజరయ్యే వారిపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం కలెక్టర్ చిత్రామిశ్రా అధికారులతో సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ పాఠశాలలు, కళాశాలలు, సంక్షేమ వసతి గృహాలను పర్యవేక్షిస్తూ విద్యార్థులకు అత్యుత్తమ విద్య అందించాలన్నారు. కార్యక్రమంలో డీఆర్వో స్వామి, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి అనిల్ ప్రకాశ్, సంక్షేమ వసతి గృహాల అధికారులు పాల్గొన్నారు.