’బడిబాట‘ను సమర్థవంతంగా నిర్వహించాలి
ABN , Publish Date - May 29 , 2026 | 11:53 PM
జిల్లాలో బడిబాట కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తూ ప్రభుత్వ విద్యాసంస్థల్లో ప్రవేశాలు పెంచాలని కలెక్టర్ చిత్రామిశ్రా అన్నారు.
కరీంనగర్, మే 29 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలో బడిబాట కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తూ ప్రభుత్వ విద్యాసంస్థల్లో ప్రవేశాలు పెంచాలని కలెక్టర్ చిత్రామిశ్రా అన్నారు. కలెక్టరేట్ సమావేశమందిరంలో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, గురుకులాలు, సంక్షేమ హాస్టళ్ల ఉన్నతాధికారులతో శుక్రవారం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జూన్ 20 వరకు జిల్లాలో బడిబాట కార్యక్రమాన్ని పక్కాగా నిర్వహించాలన్నారు. ఎక్కువ మంది విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చేందుకు స్థానిక ప్రజాప్రతినిధుల సహకారం తీసుకోవాలన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ భవనాల్లో నిర్వహిస్తున్న విద్యాసంస్థల వివరాలను సమర్పించాలని ఆదేశించారు. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని అవసరమైన మరమ్మతులు చేయించాలన్నారు. అన్ని పాఠశాలలు, హాస్టళ్లలో మౌలిక సదుపాయాలు కల్పించాలని, మరమ్మతులు పూర్తి చేయాలన్నారు. ఎక్కువ మంది విద్యార్థులుండే పాఠశాలలు, హాస్టళ్లలో ఎక్కువ మంది సిబ్బంది, ఉపాధ్యాయులు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. పాఠశాలలు, హాస్టళ్లు ప్రారంభమయ్యే సమయంలోగా కామన్ డైట్ మెనూకు అవసరమైన సరకుల టెండర్ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ నిబంధనలను అనుసరించి నాణ్యమైన సరకులను టెండర్లు నిర్వహించాలని సూచించారు. విద్యార్థులకు అవసరమైన యూనిఫామ్, పుస్తకాలు తదితర మెటీరియల్ సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో ఎస్సీ సంక్షేమశాఖ డీడీ తిరుపతిరావు, బీసీ సంక్షేమశాఖ అధికారి అనిల్ ప్రకాశ్, డీపీవో జగదీశ్వర్, ఆర్‌సీవో అంజలి, విద్యాశాఖ ఏడీ మాధవి, విద్యాశాఖ కో ఆర్డినేటర్లు అశోక్‌రెడ్డి, మిల్కూరి శ్రీనివాస్ పాల్గొన్నారు.