Share News

డిగ్రీ వరకు ‘బడి బాట’

ABN , Publish Date - Jan 02 , 2026 | 12:46 AM

విద్యారంగంలో పోటీ పెరగడంతో పలు డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు తగ్గుతున్నాయి.

డిగ్రీ వరకు ‘బడి బాట’

జగిత్యాల, జనవరి 1 (ఆంధ్రజ్యోతి): విద్యారంగంలో పోటీ పెరగడంతో పలు డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు తగ్గుతున్నాయి. దీంతో డిగ్రీ కళాశాలల్లో విద్యార్థుల ప్రవేశాల సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వం పాఠశాల స్థాయిలో నిర్వహిస్తున్న బడిబాటను కళాశాల స్థాయిలో సైతం నిర్వహించాలని కార్యాచరణ రూపొందిస్తోంది. అలాగే డిగ్రీలో కొత్త కోర్సులను ప్రవేశ పెట్టనుంది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణి ఉన్నత విద్యామండలి అధికారులకు ఇటీవల మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. జిల్లా వ్యాప్తంగా 18 ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. ఇందులో ఆరు ప్రభుత్వ, 12 ప్రైవేటు, ఎయిడెడ్‌ డిగ్రీ కళాశాలలున్నాయి. వీటిల్లో 3,173 మంది విద్యార్థులు తొలి సంవత్సరం ప్రవేశాలు పొందారు.

ఫ2026-27 విద్యాసంవత్సరం నుంచి అమలు

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాల సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రొఫెసర్‌ జయశంకర్‌ బడిబాట కార్యక్రమం విజయవంతమైంది. దీంతో ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో సైతం బడిబాట కార్యక్రమం అమలు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. గతంలో కొన్ని డిగ్రీ కళాశాలల లెక్చరర్లు బడి బాట కార్యక్రమం మాదిరిగా ప్రచారం చేపట్టారు. 2026-27 విద్యా సంవత్సరంలో రాష్ట్ర విద్యా శాఖ ఉన్నత విద్యలో కూడా బడిబాట చేపట్టనుండటంతో ఇప్పుడు అన్ని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో తప్పనిసరి కానుంది. కాలేజీ లెక్చరర్లు ప్రభుత్వ, ప్రైవేటు కస్తూర్బా, గురుకుల కాలేజీల్లోకి వెళ్లి తమ కళాశాలల్లో ఉన్న కోర్సులపై విద్యార్థులకు అవగాహన కల్పించనున్నారు.

ఫకొత్త కోర్సులు...

సంప్రదాయ డిగ్రీ కోర్సులైన బీఏ, బీకాం, బీఎస్సీ, బీఎస్సీ (మాథ్స్‌) కోర్సులు ఉండగా వీటితో పాటు బీకాం కంప్యూటర్‌, బీబీఏ, బీఎస్సీ కంపూటర్స్‌ వంటి కోర్సులు రాగా విద్యార్థులకు ప్రయోజనం అంతంత మాత్రంగా ఉంది. దీంతో బీటెక్‌ వంటి సాంకేతిక కోర్సులకు సమానంగా పాఠ్యాంశాల రూపకల్పన చేయనున్నారు. ఆనర్స్‌ ఇంటిగ్రేటెడ్‌, బీఎస్సీ డాటా సైన్స్‌, మల్టీ డిసిప్లినరీ కోర్సులు ప్రస్తుతమున్న వాటికి అనుసంధానంగా తీసుకురావడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) డేటా సైన్స్‌ కంప్యూటర్‌ కోర్సులను పరిచయం చేయనున్నారు.

మౌఖిక ఆదేశాలు అందాయి

-అశోక్‌, ప్రిన్సిపాల్‌, ఎస్‌కేఎన్‌ఆర్‌ డిగ్రీ కళాశాల, జగిత్యాల

డిగ్రీ కాలేజీల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ప్రతి విద్యాసంవత్సరం లెక్చరర్లు ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో బడిబాట కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దీంతో విద్యార్థుల సంఖ్య పెరిగింది. ఈ ఏడాది ప్రభుత్వం నుంచి బడిబాటపై మౌఖిక ఆదేశాలు అందాయి. కాలేజీ లెక్చరర్లు బడిబాట చేపడతారు.

ప్రవేశాలు పెరిగే అవకాశం

-రామకృష్ణ, ప్రిన్సిపాల్‌, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, జగిత్యాల

ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహిస్తున్న మాదిరిగానే ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో సైతం బడి బాట కార్యక్రమాన్ని నిర్వహించడం వల్ల ప్రవేశాలు పెరిగే అవకాశాలున్నాయి. జగిత్యాలలో ఇప్పటికే ప్రతియేటా లెక్చరర్లు, సిబ్బంది బడి బాట నిర్వహిస్తున్నారు. విద్యార్థుల ఇళ్ల వద్దకు వెళ్లి ప్రవేశాలపై లెక్చరర్లు అవగాహన కల్పిస్తున్నారు.

Updated Date - Jan 02 , 2026 | 12:46 AM