బోనమో నమః
ABN , Publish Date - Jul 17 , 2026 | 12:35 AM
ఆషాఢ మాసంలో బోనాల పండుగకు విశిష్టత ఉంది.
మెట్‌పల్లి టౌన్, జూలై16 (ఆంధ్రజ్యోతి): ఆషాఢ మాసంలో బోనాల పండుగకు విశిష్టత ఉంది. ఈనెల 15న బుధవారం నుంచి ఆషాఢ మాసం ప్రారంభమైంది. నెత్తిన బోనం.. ఆకట్టుకునే పోతరాజుల విన్యాసం... చెట్టు కొమ్మ.. పసుపు నీళ్లు.. రాగి కలశంతో అలంకరించిన అమ్మవారి రూపం వింటుంటేనే తెలంగాణ సంప్రదాయం ఉట్టిపడుతుంది. తెలంగాణలో సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా బోనాల పండుగ నిలుస్తోంది. జగిత్యాల జిల్లాలోని మారు మూల పల్లె నుంచి మొదలుకొని మండల కేంద్రాలు, పట్టణాలు, జిల్లా కేంద్రం వరకు నిర్వహించే బోనాల పండుగను వైభవంగా నిర్వహిస్తారు. ఈనెల 25న తొలి ఏకాదశి పండుగను జరుపుకోనున్నారు. జిల్లాలో జరిగే బోనాల పండుగ విశిష్టపై ‘ఆంధ్రజ్యోతి’ అందిస్తున్న ప్రత్యేక కథనం.
ఫఆచారాలు ఇలా...
ప్రతీ సంవత్సరంలో ఆషాఢ మాసంలో నిర్వహించే బోనాల ఆచారాలు ప్రత్యేకంగా ఉంటాయి. అమ్మవారికి భోజనాన్ని(ఆహారం, ప్రసాదం) మొక్కుకున్న విధంగా సమర్పించడాన్ని బోనం అంటారు. మహిళలు మడితో అమ్మవారికి బోనం తయారు చే చేసి నైవేద్యంగా సమర్పిస్తుంటారు. ప్రత్యేకంగా బోనాల కుండను భక్తులే స్వయంగా తయారు చేస్తుంటారు. కుండలపై తెల్లముగ్గుతో అలంకరించి దానిపై దీపం ఉంచడం ఆనవాయితీ. డప్పు చప్పుళ్ల మధ్య పోతరాజుల నృత్యాలతో బోనాల శోభాయాత్ర అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. అనంతరం గ్రామ దేవతల ఆలయాలకు తరలివెళ్లి బోనాలు సమర్పిస్తారు. ఇలా బోనాలు సమర్పించడం వల్ల దేవతలు శాంతించి అంటువ్యాధులు, రోగాలు రాకుండా కాపాడుతారని ప్రజల విశ్వాసం. ప్రత్యేకంగా బీరప్ప, మల్లన్న, గంగమ్మ, మహాలక్ష్మమ్మ, రేణుక ఎల్లమ్మ, పోచమ్మ, మైసమ్మ, ఎల్లమ్మ, పెద్దమ్మ, డొక్కాలమ్మ, అంకాలమ్మ, పోలేరమ్మ, మారెమ్మలకు భక్తులు బోనాలను సమర్పిస్తుంటారు.
ఫ పెద్దాపూర్‌లో వైభవంగా మల్లన్న బోనాలు..
జిల్లాలో నిర్వహించే బోనాల పండుగకు ప్రత్యేకతలు ఉన్నాయి. ఆలయాన్ని బట్టి ఆచార సంప్రదాయాలు పాటిస్తూ భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. కోరుట్ల మండలం పెద్దాపూర్ మల్లన్నకు సమర్పించే బోనాల వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. రాష్ట్రంలోని నలుమూలల నుంచే గాక ముంబై లాంటి ప్రదేశాల నుంచి భక్తులు వచ్చి మల్లన్నకు బోనాలు సమర్పిస్తుంటారు. జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, మల్లాపూర్, ఇబ్రహీంపట్నంతో పాటు ఆయా మండలాల్లో బోనాల పండుగను వైభవంగా నిర్వహిస్తుంటారు. పల్లెల్లో గ్రామ దేవతలకు అన్ని వయస్కులకు చెందిన వ్యక్తులు బోనాలు నెత్తిన పెట్టుకొని ఊరేగింపులో పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పిస్తుంటారు. ఆషాఢమాసంలో పల్లెల్లో ఎక్కువగా వన భోజనాలకు వెళ్తారు.
ఫ పోతరాజుల విన్యాసాలు...
పోతరాజుల నృత్యాలు బోనాల పండుగలో ప్రత్యేక ఆకర్శణగా నిలుస్తాయి. పోతరాజులు ఒంటిపై పసుపు, నుదుటిపై కుంకుమ, కాలికి గజ్జెలు కలిగి చిన్న ఎర్రని ధోతిని ధరించి డప్పు వాయిద్యాలకు అనుగుణంగా నృత్యాలు చేస్తారు. అన్ని వయస్కుల వారు పోతరాజుల నృత్యాలను ఆస్వాదిస్తుంటారు. కాగా పోతరాజుల వేషం వేసిన వ్యక్తుల్లో కొందరికి పూనకం వస్తుంది. పోతరాజుల కోపాన్ని తగ్గించేందుకు అక్కడ ఉండే భక్తులు కొమ్ములు తిరిగిన గొర్రెపోతును సమర్పిస్తుంటారు. గొర్రెపోతును పోతరాజు తన దంతాలతో కొరికి తలా, మొండెం వేరు చేస్తాడు. దీన్నే తెలంగాణ భాషలో గావుపట్టడం అని పిలుస్తుంటారు.
వైభవంగా పోచమ్మ బోనాలు
ధర్మపురి, జూలై 16 (ఆంధ్రజ్యోతి): ధర్మపురి పట్టణంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో పోచమ్మ బోనాలు గురువారం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని తోట్లవాడ, కాశెట్టివాడ, పలు వాడలకు చెందిన అనేక మంది మహిళలు ఆలయం చుట్టూ పోచమ్మ బోనాలతో ప్రదక్షిణలు చేసి అమ్మవారికి బోనాలు సమర్పించారు. పంటలు సమృద్ధిగా పండాలని మొక్కులు చెల్లించుకున్నారు. మండలంలోని పలు గ్రామాల్లో పోచమ్మ, మారెమ్మ బోనాలు వేడుకలు ఘనంగా నిర్వహించారు.