Share News

భద్రత గాలికి...

ABN , Publish Date - May 07 , 2026 | 01:16 AM

పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు కోట్ల రూపాయల లావాదేవీలు జరుపుతున్నప్పటికీ కనీస భద్రతా చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తున్నాయి.

భద్రత గాలికి...

కరీంనగర్‌ క్రైం, మే 6 (ఆంధ్రజ్యోతి): పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు కోట్ల రూపాయల లావాదేవీలు జరుపుతున్నప్పటికీ కనీస భద్రతా చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తున్నాయి. కరీంనగర్‌ జ్యోతి నగర్‌లో పీఎంజే జ్యువెలర్స్‌లో ఆదివారం జరిగిన దోపిడీ ఘటన ఇందుకు సాక్ష్యం. పీఎంజే జ్యువెలర్స్‌లో 10 కోట్లపైగా బంగారు, వజ్రాల ఆభరణాలు ఉంటాయి. కోట్ల రూపాయల వ్యాపారం సాగించే ఈ జ్యువెలరీ షాపులో ప్రధాన ముఖ ద్వారం వద్ద కనీసం మెటల్‌ డిటెక్టర్‌ ఫ్రేమ్‌ను ఏర్పాటు చేసుకోలేదు. సెక్యూరిటీ గార్డు కనీసం హ్యాండ్‌ మెటల్‌ డిటెక్టర్‌తోని కూడా షాపులోకి వచ్చిన వారిని తనిఖీ చేయలేదు. షాపు లోపల ఉన్న సెక్యూరిటీ గార్డు డోర్‌ తీసి ఒక్కొక్కరిని లోపలికి ఆహ్వానించాడు తప్ప వారిని తనిఖీ చేయలేదు. తనిఖీ చేస్తే నడుము భాగంలో వెనుకవైపున పెట్టుకున్న పిస్టల్స్‌ బయటపడేవి. ఎటువంటి తనిఖీలు లేకపోవడంతో దోపిడీ దొంగలు ఐదుగురు పిస్టళ్లను తమ నడుము భాగంలో భద్రపరుచుకుని లోపలికి ప్రవేశించారు.

ఫ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు అనుసంధానం కాని సీసీ కెమెరాలు

సీసీ కెమెరాలు కూడా హై రెజల్యూషన్‌, ఆధునికమైనవి ఏర్పాటు చేసుకోలేదని తెలుస్తోంది. పీఎంజే జ్యువెల్లరీ షోరూంలో ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాలను కమాండ్‌ కంట్రోల్‌కు అనుసంధానం చేయకపోవడంతో ఘటన జరిగిన చాలాసేపటికి పోలీసులకు సమాచారం అందింది. దోపిడీ, కాల్పుల ఘటన జరిగిన సమయంలో సమీపంలోనే కేంద్రమంత్రి బండి సంజయ్‌ ఒక అభివృద్ధిపరమైన కార్యక్రమంలో ఆయన సెక్యూరిటీ సిబ్బందితోపాటు ఉన్నారు. ఘటన సమీపంలోనే వెనుకవైపున పరీక్షా కేంద్రం వద్ద ఆరుగురు సాయుధ పోలీసులున్నారు. సీసీ కెమెరాలను అనుసంధానం చేస్తే కమాండ్‌ కంట్రోల్‌ నుంచి పరిశీలించి పోలీసులు అప్రమత్తమయ్యేవారు. సంఘటన స్థలం సమీపంలో ఉన్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుంటే దోపిడీ దొంగలను పట్టుకునేందుకు కొంత అవకాశం ఉండేదని భావిస్తున్నారు. కోట్ల రూపాయలు పెట్టుబడిగా పెట్టి వ్యాపారం చేస్తున్న సంస్థలు చిన్నచిన్న భద్రతా చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం కారణంగానే ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.

ఫ పీఎంజేలో ఒక్కడే సెక్యూరిటీ గార్డ్‌

పెద్ద ఎత్తున ఆర్థికపరమైన విక్రయాలు జరిపే సంస్థలలో ఎక్కడైనా సెక్యూరిటీ గార్డు బయట, లోపల వేరువేరుగా ఉండాల్సి ఉంటుంది. పీఎంజే జ్యువెలర్స్‌లో ఒక్కడే సెక్యూరిటీ గార్డ్‌ ఎలాంటి ఆయుధం లేకుండా, కనీసం మెటల్‌ డిక్టేటర్‌ లేకుండా ఉండడం దొంగలకు కలిసి వచ్చింది. పెద్ద పెద్ద సంస్థలలో నేరస్థులను, నేరాలను అడ్డుకునేందుకు డోర్‌ ఫ్రేమ్‌ మెటల్‌ డిటెక్టర్‌(డీఎఫ్‌ఎండీ), హాండ్‌ హెల్డ్‌ మెటల్‌ డిటెక్టర్‌(హెచ్‌హెచ్‌ఎండీ)లను ఉపయోగిస్తారు. సెక్యూరిటీ గార్డు వద్ద లైసెన్స్‌డ్‌ ఆయుధం ఉంటుంది. ఆయుధం ఉపయోగించడంలో శిక్షణ పొందిన సెక్యూరిటీ గార్డులను నియమించుకోవాల్సి ఉంటుంది. పీఎంజే జ్యువెలర్స్‌లో ఇలాంటి రక్షణ చర్యలు, భద్రతా చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించలేదు. జిల్లాలోని పలు బంగారం షాపులు, బ్యాంక్‌లు, ఇతర ఆర్థిక లావాదేవీలు అధికంగా జరిగే సంస్థల్లోనూ భద్రతాపరమైన లోపాలు ఉన్నాయి. ఏటీఎంలు, ఫైనాన్స్‌, చిట్‌ఫండ్స్‌లో సెక్యూరిటీ గార్డులు కనపడడంలేదు. ఏదైనా ఘటన జరిగినప్పుడే పోలీసు అధికారులు హాడావుడి చేసి బ్యాంక్‌, ఇతర ఆర్థిక సంస్థల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి, భద్రతా చర్యలు తీసుకోవాలని చెబుతూ చేతులు దులుపుకుంటున్నారు తప్ప నిర్ధిష్టమైన ఆదేశాలు, సమీక్షలు, పరిశీలన లేకుండడా పోతున్నదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

ఫ ఆరో వక్తి ఎవరు..?

పీఎంజే జ్యువెలర్స్‌లో భద్రతాలోపాలు ఉన్నాయని రెక్కీలో గుర్తించిన దుండగులు దోపిడీకి అనువైనదిగా భావించి పక్కా పథకం, ప్రణాళికతో దోపిడీకి పాల్పడ్డట్లు స్పష్టమవుతుంది. దోపిడీకి ముందు దుండగులు శాతవాహన విశ్వవిద్యాలయం వద్ద ఒక టీ స్టాల్‌లో ఛాయ్‌ తాగినట్లు పోలీసులు గుర్తించారు. ఈ నెల 1న ఆరుగురు దుండగులు ధర్మపురికి చేరుకుని అక్కడే రెండు రోజులు మకాం వేసి, దోపిడి పథకం రచించినట్లు తెలుస్తోంది. ధర్మపురిలోని ఒక అద్దె గదిలో ఉన్న ఆరుగురిలో ఐదుగురు మాత్రమే కరీంనగర్‌లోని పీఎంజేలో దోపిడీలో పాల్గొన్నాడు. ఆరో వ్యక్తి ఎవరు? ఎక్కడకు వెళ్లాడు అనేది అంతుబట్టకుండా ఉంది. ఆరో వ్యక్తి పథకం రచించి, దోపిడి సొమ్మును గ్యాంగ్‌ లీడర్‌లకు అందచేసేందుకు నియమించిన ‘రిసీవర్‌’గా పోలీసులు అనుమానిస్తున్నారు. ఆరో వ్యక్తి స్థానికుడై ఉంటాడని కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఫ బిహార్‌ ముఠాల తీరే వేరు...

బిహారీ దోపిడి ముఠాలు బ్యాంకులు, జ్యువెల్లరీ షాపులు లూటీ చేయడం, అవసరమైతే కాల్పులకు తెగబడుతుంటాయి. దోపిడీ దొంగలు కేవలం గ్యాంగ్‌ లీడర్‌ వద్ద ఉద్యోగులుగా పనిచేస్తుంటారు. వీరికి వేతనాలతోపాటు కుటుంబాలకు అన్ని రకాల సహాయ సహకారాలు గ్యాంగ్‌ లీడర్లు అందిస్తుంటారు. ఈ దోపిడీ దొంగలు కొన్ని టార్గెట్లను పెట్టుకుని టార్గెట్‌ పూర్తిచేసిన అనంతరం దోపిడీ సొమ్మును ఆ గ్యాంగ్‌ లీడర్లకు చేర్చడమే వీరి పని. ఆ సొమ్ములను అమ్ముకొని క్యాష్‌ చేసుకోవడం, ముఠా సభ్యులను కాపాడడం, అవసరమైతే బెయిలు ఇప్పించడం మిగతా వ్యవహారాలన్నీ గ్యాంగ్‌ లీడర్లే చూసుకుంటాయి. దోపిడీ దొంగలు ఆ గ్యాంగుల లీడర్ల వద్ద వేతనాలతో పనిచేస్తుంటారు కాబట్టి కేసులకు భయపడకుండా ఈ దొంగలు ఏదో ఒకచోట దోపిడీలకు పాల్పడడం చేస్తూనే ఉంటారు. ఈ దోపిడీ దొంగల కుటుంబాలు స్థిరంగా ఒక ప్రాంతంలో నివాసం ఏర్పరుచుకోకుండా తరచూ మార్చుతుంటారు. దోపిడీ గ్యాంగులను పట్టుకోవడానికి వచ్చే సమయంలో పోలీసుల పైకి తిరగబడిన సందర్భాలు కూడా ఉన్నాయి.

Updated Date - May 07 , 2026 | 01:16 AM