తుది దశకు సదర్‌మాట్ బ్యారేజీ నిర్మాణం
ABN , Publish Date - Jan 11 , 2026 | 12:53 AM
జగిత్యాల-నిర్మల్ జిల్లాల మధ్య గోదావరి నదిపై నిర్మిస్తున్న సదరమాట్ బ్యారేజీ పనులు తుది దశకు చేరుకొని ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది. ప్రస్తుత యాసంగిలో పంటలకు ఈ బ్యారేజీ నుంచి సాగు నీరు అందించాలన్న లక్ష్యంతో ఇరిగేషన్ శాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. వారం, పది రోజుల్లో బ్యారేజీని ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు.
- వారం రోజుల్లో పూర్తి చేసేందుకు అధికారుల చర్యలు
- 18 వేల ఎకరాల ఆయకట్టుకు నీరందించడమే లక్ష్యం
- ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి హాజరయ్యే అవకాశం
జగిత్యాల, జనవరి 10 (ఆంధ్రజ్యోతి): జగిత్యాల-నిర్మల్ జిల్లాల మధ్య గోదావరి నదిపై నిర్మిస్తున్న సదరమాట్ బ్యారేజీ పనులు తుది దశకు చేరుకొని ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది. ప్రస్తుత యాసంగిలో పంటలకు ఈ బ్యారేజీ నుంచి సాగు నీరు అందించాలన్న లక్ష్యంతో ఇరిగేషన్ శాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. వారం, పది రోజుల్లో బ్యారేజీని ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హాజరయ్యే అవకాశాలున్నట్లు ఇరిగేషన్ శాఖ, రెవెన్యూ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు అంటున్నారు. గోదావరి నది నుంచి వచ్చే నీటిని సదర్‌మాట్ బ్యారేజీ వద్ద నిలుపుదల చేసేందుకు ఇరిగేషన్ శాఖ అధికారులు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ)కు లేఖను రాశారు. యాసంగి పంటల కోసం సదరమాట్ బ్యారేజీ వద్ద నీటిని నిల్వ చేసేందుకు అనుమతులు రానున్నట్లు అధికారులు అంటున్నారు.
ఫరూ.676 కోట్ల నిధులతో ప్రతిపాదనలు
జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం, నిర్మల్ జిల్లా పోన్కల్ వద్ద నిర్మించతలపెట్టిన సదర్‌మాట్ బ్యారేజీ పనులకు బీఆర్‌ఎస్ సర్కారు హయాంలో రూ.676 కోట్ల నిధులతో ప్రతిపాదించి, 1.58 టీఎంసీల నీటి నిల్వతో సుమారు 18,016 ఎకరాలకు సాగు నీరు అందించాలని లక్ష్యంగా నిర్ణయించారు. మిగిలిన నిధులతో బ్యారేజీ నిర్మాణ పనులు చేపట్టారు. బ్యారేజీ నిర్మాణానికి ఇరు జిల్లాల్లో 1,170 ఎకరాల భూమిని సేకరించి ఇందుకు గాను రూ.120 కోట్లను భూములు కోల్పోయిన నిర్వాసితులకు పరిహారంగా చెల్లించారు. ఇబ్రహీంపట్నం మండలం మూలరాంపూర్, ఎర్దండి, నిర్మల్ జిల్లా పొన్కల్ గ్రామశివారులో గోదావరినదిపై 2016లో అప్పటి భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు సదర్‌మాట్ బ్యారేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పలు కారణాల వల్ల బ్యారేజీ పనులు నత్తనకడన సాగాయి. అనంతరం అడ్డంకులను తొలగించడంతో అధికారులు పనుల వేగం పెంచారు. సదర్‌మాట్ ప్రాజెక్టు ఒక కిలోమీటర్ పొడవుతో, 55 క్రస్ట్ గేట్లు బిగించి నిర్మాణం చేశారు. ప్రస్తుతం ప్రాజెక్టు నీటి సామర్ధ్యం 1.58 టీఎంపీసీలు కాగా 14 కిలోమీటర్ల పొడవున బ్యాక్ వాటర్ స్టోరేజీ ఉంటుంది.
ఫఇరు జిల్లాల్లో 18 వేల ఎకరాల ఆయకట్టు
జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని మూలరాంపూర్, యామాపూర్, ఫకీర్‌కోండాపూర్, వేములకుర్తి, మల్లాపూర్ మండలంలోని నడికుడ, సంగెం, శ్రీరాంపూర్, పాత దాంరాజ్‌పల్లి, కొత్త దాంరాజ్‌పల్లి, వాల్గొండ, ఓబులాపూర్ గ్రామాలో 4,896 వేల ఎకరాలకు సదర్‌మాట్ ప్రాజెక్టు నుంచి సాగునీరు అందేలా నిర్మించారు. అదేవిదంగా నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం, కడెం మండలాల్లోని పలు గ్రామాల్లోని 13,120 ఎకరాలకు సాగునీరు అందేలా నిర్మాణం చేపట్టారు. ప్రస్తుత సదర్‌మాట్ బ్యారేజీ నిర్మాణ పనులు దాదాపుగా పూర్తి కావచ్చాయి.
ఫసీఎం పర్యటనకు హెలీపాడ్ నిర్మాణం
సదర్‌మాట్ బ్యారేజీ నిర్మాణ పనులు దాదాపుగా పూర్తవుతున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రాజెక్టును ప్రారంభించడానికి ప్రజాప్రతినిధులు, అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఈ దిశగా కార్యాచరణ చేపట్టారు. పనులు ముగింపు దశలో ఉన్న కారణంగా ఈనెల రెండు, మూడు వారాల్లో సదర్‌మాట్ బ్యారేజీని సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభింపజేయాలని అధికారులు నిర్ణయించారు. ముఖ్యమంత్రి పర్యటన కోసం ప్రాజెక్టు వద్ద హెలిపాడ్ నిర్మాణం, ప్రారంభోత్సవానికి పైలాన్ నిర్మాణ పనులు చేపట్టారు. జగిత్యాల, నిర్మల్ జిల్లాలకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డికి సదర్‌మాట్ బ్యారేజీ నిర్మాణం వల్ల ఒనగూరే ప్రయోజనాలను వివరించారు.
ప్రారంభోత్సవానికి సదర్‌మాట్ బ్యారేజీ
-సురేందర్, డీఈఈ, సదర్‌మాట్ బ్యారేజీ
జగిత్యాల-నిర్మల్ జిల్లాల మద్య గోదావరి నదిపై సదర్‌మాట్ ప్రాజెక్టు నిర్మాణం దాదాపుగా పూర్తయ్యింది. ఇరు జిల్లాల్లో 18 వేల ఎకరాలకు సాగు నీరు అందించాలన్న లక్ష్యంతో నిర్మాణం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం.