Share News

రైతు భరోసా సాయం రూ.207 కోట్లు

ABN , Publish Date - Jul 11 , 2026 | 01:15 AM

వానాకాలం సాగుకు ఎరువులు, విత్తనాలు కొనేందుకు రైతులు ఎదురుచూడకుండా ప్రభుత్వం పెట్టుబడి సాయాన్ని అందించింది. రైతు భరోసా పథకం కింద జిల్లాకు చెందిన రైతులందరికీ తొమ్మిది రోజుల్లో ముందు ప్రకటించిన విధంగానే వారివారి ఖాతాల్లో ఎకరాకు 6వేల రూపాయల చొప్పున 54 ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు భరోసా సాయాన్ని అందించారు.

రైతు భరోసా సాయం రూ.207 కోట్లు

- 1,92,922 మంది రైతులకు లబ్ధి

- తొమ్మిది రోజుల్లో చెల్లింపులు పూర్తి

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

వానాకాలం సాగుకు ఎరువులు, విత్తనాలు కొనేందుకు రైతులు ఎదురుచూడకుండా ప్రభుత్వం పెట్టుబడి సాయాన్ని అందించింది. రైతు భరోసా పథకం కింద జిల్లాకు చెందిన రైతులందరికీ తొమ్మిది రోజుల్లో ముందు ప్రకటించిన విధంగానే వారివారి ఖాతాల్లో ఎకరాకు 6వేల రూపాయల చొప్పున 54 ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు భరోసా సాయాన్ని అందించారు. జూన్‌ 30న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ సీజన్‌లో రైతులకు సహాయాన్ని అందించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొలిరోజు రెండెకరాల వరకు భూమి ఉన్న రైతులకు నిధులు జమచేశారు. ఆ తర్వాత వరుసగా సెలవు రోజుల్లో మినహా ఒక్కొక్క ఎకరం పెంచుతూ సీలింగ్‌ మేరకు 54 ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు కూడా శుక్రవారం సాయంత్రానికి నిధులు జమచేశారు. జిల్లాలో 1,92,922 మంది రైతుల ఖాతాల్లో 207 కోట్ల 11 లక్షల 13వేల 234 రూపాయలు జమచేశారు. జిల్లావ్యాప్తంగా అందుబాటులో ఉన్న రికార్డుల మేరకు 2,15,433 మంది పట్టాదారులకు వారికి ఉన్న భూ విస్తీర్ణాన్ని బట్టి 213 కోట్ల 75 లక్షల 76వేల 166 రూపాయలు అవసరమవుతాయని భావించారు. అయితే రైతులు రైతుభరోసా సాయం కోసం దరఖాస్తు చేసుకొని పట్టాదారు పాసుపుస్తకాలు, బ్యాంకు ఖాతా వివరాలను అందజేసిన మేరకు వారి 2,01,231 మంది పరిశీలించి 1,92,922మంది ఖాతాలకు 207.11 కోట్ల రూపాయలు ట్రెజరీకి పంపించారు. ఈ నెల 10 ఉదయం 7 గంటల వరకు 1,90,359 మంది రైతులకు 191.82 కోట్ల రూపాయలు వారి ఖాతాల్లో జమ అయ్యాయి. 10న సాయంత్రం వరకు మిగతా రైతుల ఖాతాల్లోకి 207 కోట్ల 11 లక్షల 13వేల 234 రూపాయలు చేరాయి. జిల్లాలోని మానకొండూర్‌ నియోజకవర్గంలో అత్యధికంగా 82,925 మంది రైతులకు 97 కోట్ల 38 లక్షల 42 వేల 123 రూపాయల భరోసా సాయం అందింది. చొప్పదండి నియోజకవర్గంలోని 76,166 మంది రైతులకు 83 కోట్ల 76 లక్షల 54,435 రూపాయలు, హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని 68,573 మంది రైతులకు 70 కోట్ల 68 లక్షల 88,201 రూపాయలు, కరీంనగర్‌ నియోజకవర్గంలోని 18,538 మంది రైతులకు 15 కోట్ల 84 లక్షల 75,640 రూపాయల రైతు భరోసా సాయం అందింది. గత సీజన్‌లో కేవలం రెండు ఎకరాల వరకు రైతులందరికీ ఎకరాకు ఆరు వేల రూపాయల చొప్పున భరోసా నిధులు విడుదల చేశారు. ఈ సీజన్‌లో మాత్రం రైతులందరికీ 54 ఎకరాల భూమి ఉన్నవారికి కూడా రైతు భరోసా అందించారు.

Updated Date - Jul 11 , 2026 | 01:15 AM