Share News

పరుగో.. పరుగు..

ABN , Publish Date - Jan 09 , 2026 | 12:51 AM

అద్దె భవనాల్లో ఉన్న కార్యాలయాలు ఖాళీ చేసి ప్రభుత్వ భవనాల్లోకి వెళ్లాలని సర్కార్‌ ఆదేశాలు జారీ చేసింది.

పరుగో.. పరుగు..

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)

అద్దె భవనాల్లో ఉన్న కార్యాలయాలు ఖాళీ చేసి ప్రభుత్వ భవనాల్లోకి వెళ్లాలని సర్కార్‌ ఆదేశాలు జారీ చేసింది. ఫిబ్రవరి మాసం నుంచి అద్దె చెల్లింపులు నిలిపివేస్తున్నట్లు కూడా ప్రకటించింది. దీంతో ఆయా శాఖల అధికారులు ప్రభుత్వానికి సంబంధించిన భవనాల కోసం పరుగులు తీస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయ భవనంలో జిల్లా కార్యాలయాలు కొనసాగుతున్నాయి. వాటికి సంబంధించిన కిందిస్థాయి కార్యాలయాలు అద్దె భవనాల్లో ఉన్నాయి. కొన్ని ప్రభుత్వ కార్యాలయాలకు స్థలాలు ఉండడమే కాకుండా గత ప్రభుత్వాల హయాంలోనే శంకుస్థాపన చేసిన పనులు మొదలు పెట్టనివి ఉన్నాయి. మరికొన్ని నిర్మాణాలు మధ్యలోనే నిలిచిపోయిన భవనాలు ఉన్నాయి. ప్రభుత్వానికి ఆదాయాన్ని తెచ్చిపెడుతున్న ఎక్సైజ్‌ అండ్‌ ప్రొహిబిషన్‌ సర్కిల్‌ కార్యాలయాలు సొంత భవనాలకు నోచుకోక ఏళ్ల తరబడి అద్దె చెల్లిస్తూ ప్రైవేట్‌ భవనాల్లోనే కొనసాగుతున్నాయి. జిల్లాలో ఎక్సైజ్‌ ప్రధాన కార్యాలయం కలెక్టరేట్‌ భవనంలో కొనసాగుతుండగా సిరిసిల్ల, వేములవాడ, ఎల్లారెడ్డిపేట సర్కిల్‌ కార్యాలయాలు ఉన్నాయి. సిరిసిల్లలో స్థలం విరాళం ఇవ్వడంతో సబ్‌ రిజిస్టర్‌ కార్యాలయం భవనం నిర్మాణం చేశారు. వేములవాడలో అద్దె భవనంలోనే కొనసాగుతోంది. సిరిసిల్ల వేములవాడ ఐసీడీఎస్‌ కార్యాలయాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. సిరిసిల్లలో ఐసీడీఎస్‌ భవన నిర్మాణానికి వేసిన శిలాఫలకం వెక్కిరిస్తోంది.

మండలాల్లో ఇబ్బందులే..

రాజన్న సిరిసిల్ల జిల్లాలో 12 మండలాలు, 260 గ్రామపంచాయతీలు ఉన్నాయి. ఇందులో ప్రధానంగా కొత్తగా ఏర్పడిన తంగళ్ళపల్లి, రుద్రంగి, వీర్నపల్లి, వేములవాడ రూరల్‌ మండలాల్లో కార్యాలయాలకు భవనాలు లేవు. పాత మండలాల్లో కొన్ని కార్యాలయాలు ఉండగా సొంతభవనాలు అరకొర వసతులతో ఉన్నాయి. వీర్లపల్లి మండల కేంద్రంలో తహసీల్దార్‌, ఎంఆర్‌సీ, ఎంపీడీవో, ముస్తాబాద్‌ మండలంలో ఇరిగేషన్‌, గ్రంథాలయం, హోమియోపతి వైద్యశాల అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. రుద్రంగి మండలంలో తహసీల్దార్‌, పోలీస్‌ స్టేషన్‌ వద్ద భవనాల్లో కొనసాగుతున్నాయి. కొత్త గ్రామపంచాయతీలకు భవనాలు లేవు. కోనరావుపేట మండలంలో అజ్మీరతండా, భూక్యరెడ్డి తండా, ఊరుతండా, చందుర్తిలో నర్సింగాపూర్‌, ఎల్లారెడ్డిపేట మండలంలో జై సేవాలాల్‌ తండా, రాచర్ల బాకురుపల్లి తండాలో అద్దె ఇళ్లలో కొనసాగుతున్నాయి. గంభీరావుపేటలో హీరాలాల్‌ తండా పంచాయతీ కార్యాలయంలో కొనసాగుతోంది. కొన్ని గ్రామపంచాయతీలో భవనాలు పనులు అసంపూర్తిగా ఉండిపోయాయి.

కమ్యూనిటీ భవనాలపైనే దృష్టి..

జిల్లా కేంద్రంతో పాటు మండలాల్లో అద్దె భవనాల్లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలను కమ్యూనిటీ హాళ్లలోకి మార్చే విధంగా దృష్టి సారించారు. మహిళా సంఘాల కోసం నిర్మించిన భవనాలు కొన్నిచోట్ల నిరుపయోగంగానే ఉన్నాయి. వాటిని గుర్తించి అందులోకి మార్చే విధంగా అధికారులు పరిశీలిస్తున్నారు. కమ్యూనిటీ భవనాలు చిన్నగా ఉండడంతో కార్యాలయాల నిర్వహణ ఇబ్బందికరంగానే ఉంటుందని భావిస్తున్నారు. కొత్త మండల కేంద్రాల్లో కమ్యూనిటీ హాళ్లు, ఖాళీగా ఉన్న ప్రభుత్వ భవనాలు లేకపోవడంతో అధికారులు అయోమయంలో ఉన్నారు.

Updated Date - Jan 09 , 2026 | 12:51 AM