Share News

అసెంబ్లీ సమయాన్ని దుర్వినియోగం చేస్తున్న అధికార, ప్రతిపక్షాలు

ABN , Publish Date - Sep 10 , 2026 | 12:43 AM

ప్రజా సమస్యలపై చర్చించాల్సిన అసెంబ్లీ సమాయాన్ని అధికార, ప్రతిపక్షాలు దుర్వినియోగం చేస్తున్నాయని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు స్కైలాబ్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

అసెంబ్లీ సమయాన్ని దుర్వినియోగం చేస్తున్న అధికార, ప్రతిపక్షాలు

సిరిసిల్ల అర్బన్‌, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి) : ప్రజా సమస్యలపై చర్చించాల్సిన అసెంబ్లీ సమాయాన్ని అధికార, ప్రతిపక్షాలు దుర్వినియోగం చేస్తున్నాయని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు స్కైలాబ్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిరిసిల్ల పట్టణంలోని నెహ్రూనగర్‌ ఆర్‌ఎంపీ భవనంలో బుధవారం సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సీపీఎం రాష్ట్ర నేత, రైతాంగ ఉద్యమనేత సారంపల్లి మల్లారెడ్డి సంస్మరణ సభను నిర్వహించారు. ఈసందర్భంగా సారంపల్లి మాల్లారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించి మౌనం పాటించారు. అనంతరం జరిగిన సమావేశంలో స్కైలాబ్‌బాబు మాట్లాడుతూ ఏడు దశాబ్దాల పాటు నిస్వార్థ నిరాడంబర ఆదర్శ జీవితం గడిపిన గొప్ప కమ్యూనిస్టు సారంపల్లి మల్లారెడ్డి జీవితం స్ఫూర్తిదాయకంగా నిలుసుందన్నారు. సిరిసిల్లకు సారంపల్లి మల్లారెడ్డికి విడదీయలేని సంబంధం ఉందన్నారు. అసెంబ్లీ గేటు ముందు నిరసన తెలుపుతున్న బీఆర్‌ఎస్‌ మాజీ మంత్రులు, మహిళా ఎమ్మెల్యేలను పోలీసులు నెట్టివేయడం, చీరలు లాగడం, మెడను పట్టి నెట్టడం, జుట్టు పట్టి లాగడం వంటి ఘటనలు అత్యంత హేయమైనవని, దీన్ని ఖండించే నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ తాతా మధు స్పీకర్‌ తల్లిని ఉద్దేశించి అంతకంటే సంస్కారహీనమైన వ్యాఖ్యలు చేయడమే కాకుండా అధికార ప్రతిపక్షాలు కూడబలుక్కొని అసెంబ్లీ సభా సమయాన్ని వృథా చేస్తున్నారని విమర్శించారు. వీర తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలు సెప్టెంబర్‌ 17వరకు జయప్రదంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ సాయుధ పోరాట కాలంలో పుట్టని బీజేపీ పార్టీ దాని వారసులమని, అది హిందూ ముస్లింల పంచాయతీగా మార్చి చరిత్రను వక్రీకరించడానికి మతోన్మాద శక్తులు కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారని విమర్శించారు. సిరిసిల్ల ప్రాంతంలో వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో బద్దం ఎల్లారెడ్డి, అమృతులాల్‌ శుక్ల, తిరుపతిరెడ్డి, కర్రోళ్ల నర్సయ్య, సింగిరెడ్డి భూపతిరెడ్డి వంటి అనేకమంది కమ్యూనిస్టు దిగ్గజాలు ఎర్రజెండా చేతబట్టి భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా వ్యతిరేకంగా పోరాడారని గుర్తు చేశారు. సెప్టెంబర్‌ 10న ఐలమ్మ వర్ధంతి, 12న సీతారాం ఏచూరి వర్ధంతి సభలు నిర్వహించాలని కోరారు. ఈ సభలో సీపీఎం జిల్లా కార్యదర్శి మూషం రమేష్‌, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు రజినీకాంత్‌, సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కోడం రమణ, జిల్లా కమిటీ సభ్యులు సూరం పద్మ, అన్నల్దాస్‌ గణేష్‌, గురజాల శ్రీధర్‌, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి మల్లారపు ప్రశాంత్‌, నాయకులు ఎలిగేటి రాజశేఖర్‌, శ్రీరామ్‌ సదానందం, నరేందర్‌, సావనపల్లి రాములు, నరసింహారెడ్డి, రజిత, గిరిబాబు, కమలాకర్‌, స్వప్న తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 10 , 2026 | 12:43 AM