Share News

అధికారుల్లో జవాబుదారితనం పెంచేందుకు ఆర్‌టీఐ

ABN , Publish Date - Feb 18 , 2026 | 12:05 AM

అధికారుల్లో జవాబుదారీ తనం పెంచేందుకు ఆర్‌టీఐ చట్టం దోహదం చేస్తుందని, దరఖాస్తుదారులకు సమాచారం ఇప్పించడమే కమిషన్‌ అంతిమ లక్ష్యమని రాష్ట్ర సమాచార కమిషనర్లు తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌ సమావేశమందిరంలో రాష్ట్ర సమాచార కమిషనర్లు పీవీ శ్రీనివాస్‌రావు, బోరెడ్డి అయోధ్యరెడ్డి, మోసినా ఫర్వీన్‌, దేశాల భోపాల్‌ మీడియా సమావేశాన్ని నిర్వహించారు.

అధికారుల్లో జవాబుదారితనం పెంచేందుకు ఆర్‌టీఐ
మీడియాతో మాట్లాడుతున్న రాష్ట్ర సమాచార కమిషనర్లు

కరీంనగర్‌, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): అధికారుల్లో జవాబుదారీ తనం పెంచేందుకు ఆర్‌టీఐ చట్టం దోహదం చేస్తుందని, దరఖాస్తుదారులకు సమాచారం ఇప్పించడమే కమిషన్‌ అంతిమ లక్ష్యమని రాష్ట్ర సమాచార కమిషనర్లు తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌ సమావేశమందిరంలో రాష్ట్ర సమాచార కమిషనర్లు పీవీ శ్రీనివాస్‌రావు, బోరెడ్డి అయోధ్యరెడ్డి, మోసినా ఫర్వీన్‌, దేశాల భోపాల్‌ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2025 మే 14న రాష్ట్ర సమాచార కమిషనర్లుగా తాము బాధ్యత తీసుకునే నాటికి 17,808 అప్పీళ్లు రాష్ట్ర కమిషన్‌లో పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. ఎనిమిది నెలల్లో 15 జిల్లాలో పర్యటించి అక్కడి వాదనలను విన్నాని తొమ్మిది వేల అప్పీళ్లను పరిష్కరించామన్నారు. ఇంత త్వరగా అప్పీళ్ళను పరిష్కరించడం దేశంలోనే మొదటిసారి అని తెలిపారు.1 3శాఖల్లో కేసుల సంఖ్య జీరోకి తెచ్చామన్నారు. సగటున నెలకు 643 కేసులు పరిష్కరిస్తున్నామని వివరించారు. వీలైనంత త్వరగా మిగిలిన జిల్లాల్లో పర్యటించి పెండింగ్‌ కేసులన్నీ పరిష్కరిస్తామని తెలిపారు. ఆర్జీదారుకు సమాచారం ఇప్పించడమే కమిషన్‌ అంతిమ లక్ష్యమని అన్నారు.

ఫ పీఐవోలు, అప్పిలేట్‌ అధికారులకు అవగాహన కార్యక్రమం:

ప్రభుత్వం చేసే ప్రతి కార్యక్రమం ప్రజల ప్రయోజనం కోసమేనని రాష్ట్ర సమాచార కమిషనర్లు తెలిపారు. ప్రజా సమాచార అధికారి, సహాయ ప్రజా సమాచార అధికారి, అప్పిలేట్‌ అధికారులతో సమాచార హక్కు చట్టం అవగాహన కార్యక్రమం కలెక్టరేట్‌ ఆడిటోరియంలో నిర్వహించారు. దరఖాస్తులు, ఫిర్యాదులు, పరిష్కారం, పెండింగ్‌ దరఖాస్తులు, పరిష్కారం కోసం తీసుకునే చర్యలపై పీఐఓలతో కమిషనర్లు చర్చించారు. ఈ సమావేశంలో రాష్ట్ర కమిషనర్లు మాట్లాడుతూ సమాచార హక్కు చట్టంలో భాగంగా దరఖాస్తుల స్వీకరణ, కోరిన సమాచారం ఇవ్వడం, అప్పీళ్ల పరిష్కారం వంటివి నిరంతర కొనసాగాలన్నారు. దరఖాస్తుదారు కోరిన సమాచారం ఇవ్వడం ప్రభుత్వ అధికారుల బాధ్యత అని తెలిపారు. దరఖాస్తుదారుడు కోరినప్పుడు తప్పనిసరిగా జవాబు ఇవ్వాలన్నారు. సెక్షన్‌ 20 ప్రకారం దరఖాస్తుదారుడికి ఎలాంటి ప్రత్యుత్తరం ఇవ్వక పోతే సంబంధిత అధికారికి రోజుకు 250 రూపాయల అపరాధ రుసుము విధించి, క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దరఖాస్తుదారుడు కమిషన్‌కు ఫిర్యాదు చేసిన సందర్భంలో అధికారులు తప్పనిసరిగా కమిషన్‌ ముందు హాజరుకావాలని, అధికారులు వారికి బదులుగా క్లర్కులను, ఇతర సిబ్బందిని పంపించవద్దన్నారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయం, సంస్థల్లో ఆర్‌టీఐ కోసం ప్రత్యేక రోజు కేటాయించి ఆ రోజు దరఖాస్తులన్నింటిని పరిష్కరించేలా చూసుకోవాలని సూచించారు. ప్రతి కార్యాలయంలో ఆ కార్యాలయానికి సంబంధించిన 4(1)బి సమాచారం ఎప్పుడు డిస్‌ప్లే చేయాలన్నారు. ఆ సంస్థ లేదా కార్యాలయానికి వెబ్‌సైట్‌ ఉంటే వెబ్‌లోనూ 4 (1)బి సమచారం పొందుపరచాలని తెలిపారు. సమావేశంలో అడిషనల్‌ కలెక్టర్లు అశ్విని తానాజీ వాఖడే, లక్ష్మికిరణ్‌, డీఆర్‌వో వెంకటేశ్వర్లు, ఆర్డీవోలు మహేశ్వర్‌, రమేశ్‌బాబు, అడిషనల్‌ డీసీపీ వెంకటరమణ పాల్గొన్నారు.

Updated Date - Feb 18 , 2026 | 12:05 AM