పల్లెపల్లెకు ఆర్టీసీ బస్సు
ABN , Publish Date - Sep 23 , 2026 | 01:18 AM
ఎన్నో ఏళ్లుగా పెద్దపల్లి జిల్లా ప్రజలు ఎదురుచూస్తున్న ఆర్టీసీ బస్‌డిపో కల ఎట్టకేలకు సాకారం కానుంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పెద్దపల్లి పర్యటన సందర్భంగా శంకుస్థాపనకు నోచుకున్న బస్‌డిపో నిర్మాణ పనులు చకచకా సాగుతున్నాయి.
- చకచకా సాగుతున్న పెద్దపల్లి డిపో నిర్మాణ పనులు
- వచ్చే నెల 14న ప్రారంభానికి ఏర్పాట్లు
- తీరనున్న జిల్లా ప్రజల ప్రయాణ కష్టాలు
పెద్దపల్లి, సెప్టెంబర్ 22 (ఆంధ్రజ్యోతి): ఎన్నో ఏళ్లుగా పెద్దపల్లి జిల్లా ప్రజలు ఎదురుచూస్తున్న ఆర్టీసీ బస్‌డిపో కల ఎట్టకేలకు సాకారం కానుంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పెద్దపల్లి పర్యటన సందర్భంగా శంకుస్థాపనకు నోచుకున్న బస్‌డిపో నిర్మాణ పనులు చకచకా సాగుతున్నాయి. అక్టోబర్ 14న డిపోను ప్రారంభించేందుకు ముహూర్తం ఖరారైనట్లు అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు ప్రారంభోత్సవానికి అవసరమైన ఏర్పాట్లపై అధికార యంత్రాంగం దృష్టి సారించింది. రాష్ట్రస్థాయి ప్రముఖులను కార్యక్రమానికి ఆహ్వానించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం.
ఫ పరుగులు పెడుతున్న పనులు
డిపోకు సంబందించిన అన్ని పనులు చకాచకా జరుగుతున్నాయి. ప్రధాన ద్వారం వద్ద నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఒకవైపు సెక్యూరిటీ గది, మరోవైపు టైం ఆఫీస్ నిర్మాణాలు దాదాపు పూర్తయ్యే దశకు చేరుకున్నాయి. మహిళా సిబ్బంది కోసం విశ్రాంతి గదుల నిర్మాణం కొనసాగుతోంది. సిబ్బంది అవసరాల కోసం మూత్రశాలల నిర్మాణ పనులు కూడా జరుగుతున్నాయి. డిపోలో అత్యంత కీలకమైన మెకానికల్ షెడ్ నిర్మాణం పూర్తయింది. షెడ్ కింద సీసీ పనులు ప్రస్తుతం చురుగ్గా సాగుతున్నాయి. బస్సుల నిర్వహణ, మరమ్మతులకు షెడ్ కీలకం. డిపో ఆవరణ మొత్తాన్ని సీసీగా మార్చేందుకు మట్టి, కంకర పనులు వేగంగా చేపడుతున్నారు. ఈ పనులు పూర్తవడంతో ఆవరణలో ఉన్న పాత భవనాలలో పరిపాలనపరమైన కార్యాలయాలను నిర్వహించనున్నారు. రెండు భవన సముదా యాలు ఆర్టీసీ కార్యాలయాల నిర్వహణకు అందుబాటులో ఉండడంతో కేవలం డిపో ఆవరణ పనులు పూర్తికావలసి ఉంది. డిపోలో ఏర్పాటు చేయనున్న పెట్రోల్ బంక్ నిర్మాణ పనులు ప్రారంభించాల్సి ఉంది. పనులను వేగంగా పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని అధికారులు భావిస్తున్నారు.
ఫ దశాబ్దాల కల సాకారం
పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు బస్‌డిపో ఏర్పాటుపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. పెద్దపల్లిలో ఆర్టీసీ బస్ డిపో ఏర్పాటు చేయాలన్న డిమాండ్ దశాబ్దాల తరబడి ఉంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అనేక చిన్న చిన్న పట్టణాల్లో సైతం డిపోలు ఏర్పాటయ్యాయి. పెద్దపల్లిలో మాత్రం డిపో ఏర్పాటు కాలేదు. నాటి చంద్రబాబు ప్రభుత్వం హయాం నుంచి డిపో ఏర్పాటు ప్రతిపాదన ఉంది. కానీ కార్యరూపం దాల్చలేకపోయింది. గత అసెంబ్లీ ఎన్నికలలో తన ఎన్నికల హామీలో విజయరమణారావుకు ఇదొక కీలక ఘట్టంగా మారింది. ప్రస్తుత ఆర్టీసీ బస్‌స్టేషన్‌ను ఆనుకుని ఉన్న ప్రభుత్వ కార్యాలయాల దాదాపు 4 ఎకరాల 30 గుంటల స్థలం డిపో ఏర్పాటుకు అనువైనదిగా నిర్ధారించారు. ఈ కార్యాలయాలను ఇతర ప్రాంతాలకు తరలించి ఆ స్థలాన్ని అందులోని భవనాలను సైతం ఆర్టీసీ కోసం అప్పగించారు. డిపో పనులకు డిసెంబర్ 2024లో సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. రూ. 5.66 కోట్ల నిధులు కేటాయించారు. ప్రభుత్వ విప్ విజయమరణారావు పనుల పురోగతిని ఎప్పటికప్పుడు పరిశీలించి వేగవంతం చేశారు.
ఫ ప్రజల చిరకాల కోరిక
పెద్దపల్లి జిల్లా కేంద్రంగా ఏర్పడినప్పటి నుంచి ఆర్టీసీ డిపో కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం బస్‌డిపో నిర్మాణం తుది దశకు చేరుకోవడంతో వారి నిరీక్షణకు తెరపడనుంది. డిపో అందుబాటులోకి వస్తే పెద్దపల్లి నుంచి వివిధ గ్రామాలకు బస్సు సర్వీసుల నిర్వహణ మరింత సులభతరం కానుంది. కాల్వశ్రీరాంపూర్, ఓదెల, దర్మారం, ఏలిగేడు, జూలపల్లి వంటి మారుమూల గ్రామాలకు రాత్రి వరకు బస్సులు అందుబాటులో ఉంటాయి.