ఆర్వోబీ పనులను వేగవంతం చేయాలి
ABN , Publish Date - Jul 27 , 2026 | 11:39 PM
తీగలగుట్టపల్లిలోని ఆర్వోబీ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ చిత్రామిశ్రా, రైల్వే అధికారులను కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ ఆదేశించారు.
కరీంనగర్, జూలై 27 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): తీగలగుట్టపల్లిలోని ఆర్వోబీ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ చిత్రామిశ్రా, రైల్వే అధికారులను కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ ఆదేశించారు. కరీంనగర్-చొప్పదండి మార్గంలో ప్రయాణికుల ఇబ్బందులను తొలగించేందుకు పనులను వేగవంతం చేయాలన్నారు. సర్వీస్ రోడ్లు, భూసేకరణతో పాటు అనుబంధ పనులపై ప్రత్యేకంగా దృష్టి సారించాలపి తెలిపారు. సర్వీస్ రోడ్డు నిర్మాణానికి మూడు నెలల కిందనే నిధులు కేటాయించి, వర్షాకాలం లోపు పనులు పూర్తవ్వాలని సమీక్షలో ఆదేశించినా జాప్యం జరుగుతోందన్నారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఆర్వోబీ నిర్మాణ పనులు ఈ ఏడాది చివరిలోగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
ఫ ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా పనులు చేయాలి
కరీంనగర్ రూరల్: తీగలగుట్టపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ) పనులను మరింత వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ చిత్రా మిశ్రా ఆర్‌అండ్‌బీ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ ఆర్వోబీ పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించి సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రిడ్జి నిర్మాణంతోపాటు నాలుగు వైపులా నిర్మించాల్సిన సర్వీస్ రోడ్లు, భూసేకరణ, డ్రైనేజీ, ఇతర అనుబంధ పనుల పురోగతిపై ఆరా తీశారు. పనులు వేగంగా సాగేందుకు అవసరమైన చర్యలను చేపట్టాలని అధికారులకు సూచించారు. నిర్మాణ పనుల్లో ఎలాంటి జాప్యం జరగకుండా ప్రతి రోజూ పర్యవేక్షించాలని, పనుల నాణ్యతలో రాజీ పడొద్దని ఆదేశించారు. ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడకుండా ట్రాఫిక్ నిర్వహణకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. సర్వీస్ రోడ్ల ఏర్పాటు ఈ ప్రాజెక్టులో అత్యంత కీలకమని, పనులను వేగవంతం చేస్తున్నామని తెలిపారు. ఆర్వోబీ పూర్తయితే కరీంనగర్- చొప్పదండి మార్గంలో ట్రాఫిక్ సమస్య తగ్గడంతోపాటు రైల్వే గేటు పడ్డప్పుడు నిరీక్షించే అవసరం ఉండదన్నారు. ఏమైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఆర్‌అండ్‌బీ ఈఈ కుమారస్వామి, డీఈ కిరణ్, ఏఈ మధు పాల్గొన్నారు.