రోడ్డు పనులను వారం రోజుల్లో పూర్తి చేస్తాం
ABN , Publish Date - Apr 07 , 2026 | 11:44 PM
మండలంలో చెడిపోయిన రోడ్ల మరమ్మతుల పనులను వారం రోజుల్లో పూర్తి చేస్తామని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు.
మానకొండూర్, ఏప్రిల్ 7 (ఆంధ్రజ్యోతి): మండలంలో చెడిపోయిన రోడ్ల మరమ్మతుల పనులను వారం రోజుల్లో పూర్తి చేస్తామని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. మండలంలోని మానకొండూర్, శ్రీనివాస్‌నగర్, జగ్గయ్యపల్లి, లింగాపూర్, వెల్ది, పచ్చునూర్, పోచంపల్లి, లలితాపూర్, అన్నారం రోడ్లను కలెక్టర్ చిత్రా మిశ్రాతో కలిసి ఎమ్మెల్యే మంగళవారం పరిశీలించారు. అనంతరం విలేకరులతో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ మానకొండూర్ నుంచి వేగురుపల్లి వరకు రోడ్డంతా గుంతలమయంగా తయారయి అధ్వానంగా మారిందన్నారు. రోడ్డు నిర్మాణం కోసం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరయ్యేలా చర్యలు తీసుకుంటానని అన్నారు. ఇదే విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడంతో రోడ్ల పరిశీలనకు వచ్చారన్నారు. కలెక్టర్ రోడ్ల దుస్థితిని ప్రత్యక్షంగా చూడడం వల్ల సమస్య తీవ్రతను గుర్తించి నివారణకు సానుకూలత వ్యక్తం చేసినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్, ఆర్డీవో మహేశ్వర్, తహసీల్దార్ విజయ్‌కుమార్ పాల్గొన్నారు.