రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు
ABN , Publish Date - Apr 11 , 2026 | 12:15 AM
ప్రయాణించే ప్రతి ఒక్కరు సురక్షితంగా గమ్యం చేరాలి ఆరైవ్-అలైవ్ అనే నినాదంతో రోడ్డు భద్రతపై కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ బి సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు.
కలెక్టర్ బి. సత్యప్రసాద్
జగిత్యాల అర్బన, ఏప్రిల్ 10 (ఆంధ్రజ్యోతి): ప్రయాణించే ప్రతి ఒక్కరు సురక్షితంగా గమ్యం చేరాలి ఆరైవ్-అలైవ్ అనే నినాదంతో రోడ్డు భద్రతపై కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ బి సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల ప్రణాళికలో భాగంగా శుక్రవారం అరైవ్-అలైవ్ క్యాంపెయిన డీఆర్‌ఎస్‌సీ సమావేశంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. రోడ్డు భద్రతలో భాగంగా బ్లాక్ స్పాట్‌ల గుర్తింపు, ట్రాఫిక్ సిగ్నల్స్ మరమ్మతులు, సీసీ కెమెరాల ఏర్పాటుపై అవగాహన కల్పించాలన్నారు. జగిత్యాల పట్టణంలోని ట్రాఫిక్ సిగ్నల్స్ మరమ్మతులకు సంబంధిత ఏజెన్సీకి నోటీసులు జారీ చేసినట్లు ఆర్‌ఆండ్‌బీ అధికారులు కలెక్టర్‌కు తెలిపారు. బస్టాండ్ ప్రాంగణంలో సీసీ కెమెరాల లభ్యతపై సమీక్షించి పార్కింగ్ ప్రాంతంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆర్టీసీ డిపో మేనేజర్‌ను ఆదేశించారు. సమీప ఆసుపత్రులకు తగినంత అంబులెన్సలు అందుబాటులో ఉండేలా వైద్యాధికారికి సూచించారు. కొండగట్టు ప్రాంతంలో బిటీ రోడ్డుపై ఉన్న ఆక్రమణలు తొలగించి ప్రమాద నివారణ చర్యలు చేపట్టాలని నేషనల్ హైవే అధికారులకు సూచించారు. అనంతరం ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ మైనర్ డ్రైవింగ్, డ్రంకెన డ్రైవ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు బీఎస్ లత, రాజాగౌడ్, ఆర్డీవో మధుసూదన, తదితరులు పాల్గొన్నారు.
ఆరు రోజులు అవగాహన కార్యక్రమాలు
జగిత్యాల టౌన: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 99 రోజుల ప్రజాపాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా రోడ్డు ప్రమాదాలను నియంత్రించడం, ప్రజల్లో ట్రాఫిక్ నియమాలపై బాధ్యతాభావం పెంపొందించడం లక్ష్యంగా ఆరైవ్ ఆలైవ్ కార్యక్రమాన్ని ఏప్రిల్ 13 నుండి 18 వరకు జిల్లావ్యాప్తంగా విస్తృతంగా నిర్వహించనున్నట్లు ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. కార్యక్రమంలో భాగంగా గ్రామ స్థాయిలో రోడ్ సేప్టీ కమిటీలను ఏర్పాటు చేసి, స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులు, వలంటీర్లు, యువత భాగస్వామ్యంతో గ్రామసభల ద్వారా రోడ్డు భద్రతపై చర్చలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అరైవ్ అలైవ్ కార్యక్రమంలో యువత చురుకుగా పాల్గొనాలని ఎస్పీ కోరారు.