ముమ్మరంగా రోడ్డు విస్తరణ పనులు
ABN , Publish Date - Mar 25 , 2026 | 11:22 PM
జిల్లా కేంద్రంలో రోడ్డు ఆక్రమణలపై మునిసిపల్ అధికారులు కొరడా ఝళిపిస్తున్నారు. కొద్దిరోజులుగా రోడ్డు ఆక్రమణల తొలగింపు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.
- జిల్లా కేంద్రంలో ఆక్రమణల తొలగింపు
- అభివృద్ది పనులకు గ్రీన్‌సిగ్నల్
- అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, విద్యుత్ ఏర్పాట్లు
- సెల్లార్లపైనా ధృష్టిసారిస్తారా..?
మంచిర్యాల, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలో రోడ్డు ఆక్రమణలపై మునిసిపల్ అధికారులు కొరడా ఝళిపిస్తున్నారు. కొద్దిరోజులుగా రోడ్డు ఆక్రమణల తొలగింపు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. నగరంలోని శ్రీనివాస టాకీస్ రోడ్డు, రాణాప్రతాప్ (డాక్టర్స్ సీ్ట్రట్) రోడ్డుతో, వాటర్ ట్యాంక్ ఏరియాలో రోడ్డు ఆక్రమణలను తొలగిస్తున్నారు. జిల్లా కేంద్రంగా ఏర్పడ్డ నాటి నుంచి ప్రజల తాకిడి ఎక్కువై ప్రధాన రోడ్లన్నీ బిజీగా మారిపోయాయి. అంతర్గత రోడ్లయితే ప్రజలు నడువలేని విధంగా కిక్కిరిసిపోతున్నాయి. ముఖ్యంగా పండుగలు, ప్రత్యేక దినాల్లో విపరీతమైన రద్దీ నెలకొంటుంది. పట్టణ ప్రజలతోపాటు వివిధ పనుల నిమిత్తం జిల్లా కేంద్రానికి వచ్చిపోయే ప్రజల సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. పెరిగిన జనసంచారానికి అనుగుణంగా రోడ్లను విస్తరించకపోవడంతో ఇంతకాలం వాహనాల పార్కింగ్ పెద్ద సమస్యగా తయారైంది. కార్ల లాంటి వాహనాల్లో ప్రధాన కూడళ్లకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఎక్కడో కిలోమీటర్ల దూరంలో వాహనాలు నిలిపి ప్రధాన సెంటర్లకు వెళ్లాల్సి వస్తోంది. ప్రజల అవస్థలను దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు ప్రత్యేక శ్రద్ధతో కబ్జాలకు గురైన అంతర్గత రోడ్ల విస్తరణకు అధికారులు నడుం కట్టారు. ఇప్పటికే బాలుర ఉన్నత పాఠశాల, మార్కెట్ రోడ్డు, అర్చన టెక్స్ చౌరస్తా, మునిసిపల్ ఆఫీస్ వెనుకవైపు రోడ్లను ఆక్రమించి వెలిసిన అక్రమ నిర్మాణాలను కూల్చి వేయగా, ప్రస్తుతం మిగిలిన ఆక్రమణలపైనా దృష్టిసారిస్తున్నారు. రోడ్డు ఆక్రమణలకు సంబంధించి ఇదివరకే అధికారులు కట్టడాలకు మార్కింగ్ చేయగా, కొన్ని చోట్లా ఆయా నిర్మాణాల యజమానులు స్వచ్ఛందంగా తొలగిస్తున్నారు. మరికొన్ని చోట్ల అధికారులే దగ్గరుండి కూల్చివేయిస్తున్నారు. అక్రమ నిర్మాణాలపై మునిసిపల్ అధికారులు దృష్టి సారించడంతో ప్రజల కష్టాలు తీరనున్నాయి.
ఫ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, విద్యుత్‌కూ ఏర్పాట్లు....
జిల్లా కేంద్రంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థతోపాటు విద్యుత్ ఏర్పాట్లు కూడా చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇందు కోసం ప్రభుత్వం ఇప్పటికే రూ. 78 కోట్ల నిధులు విడుదల చేయగా, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, విద్యుత్ ఏర్పాట్లకు సంబంధించిన ప్రణాళిక పూర్తయింది. నగరంలోని ప్రధాన అంతర్గత రోడ్లను 60 అడుగులకు విస్తరిస్తుండగా, దానికి ఇరువైపులా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. ఇందులో భాగంగా డ్రైనేజీ తవ్వకపు పనులు ప్రారంభం కాగా, వాటితోపాటు రోడ్డును ఆనుకొని పాదాచారుల కోసం ఫుట్‌పాత్ సౌకర్యం కూడా కల్పించనున్నారు. ఇక రోడ్డు మధ్యలో సెంట్రల్ లైటింగ్ పనులు చేపట్టడం ద్వారా విద్యుత్ వ్యవస్థ కూడా అండర్ గ్రౌండ్‌లోనే ఉండనుంది.
ఫ సెల్లార్లపైనా దృష్టిసారిస్తారా?
మంచిర్యాల మునిసిపల్ కార్పొరేషన్‌లో బహుళ అంతస్తుల భవనాల సెల్లార్లను భవనాల యజమానులు కొందరు కిరాయకు ఇవ్వడంతో పార్కింగ్ సమస్య తలెత్తుతోంది. మునిసిపల్ నిబంధనల ప్రకారం భవనాల సెల్లార్లను వాహనాల పార్కింగ్ కోసం వదిలివేయాలి. దీనికి భిన్నంగా సెల్లార్లలో సైతం షాపింగ్ మాల్స్, ఇతర వ్యాపారాలు నిర్వహిస్తుండటంతో వాహనాలు రోడ్ల పక్కన పార్క్ చేయాల్సి వస్తోంది. అసలే ఇరుకు రోడ్లు కావడం, వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రజలు తమ వాహనాలను రోడ్ల పక్కన నిలుపుతుండటంతో విపరీతమైన రద్దీ నెలకొంటుంది. నగరంలో ఎక్కడ చూసినా సెల్లార్లను వ్యాపార నిమిత్తం ఉపయోగిస్తున్న దృశ్యాలే కనిపిస్తున్నాయి. ప్రధాన సెంటర్లయిన మార్కెట్ రోడ్డు, వేంకటేశ్వర టాకీస్ రోడ్డు, వాటర్ ట్యాంక్ ఏరియా, గంగారెడ్డి రోడ్డులో సెల్లార్లను వ్యాపార నిమిత్తం ఉపయోగించడం గమనార్హం. వాహన పార్కింగ్ కోసం ఉద్దేశించిన సెల్లార్లను భవనాల యజమానులు అక్రమంగా కిరాయిలకు ఇస్తూ వేలకువేల రూపాయలు సంపాదిస్తున్నారు. సెల్లార్లను ఖాళీ చేయించి, వాటిని పార్కింగ్ స్థలాలుగా ఉపయోగిస్తే ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండే అవకాశం ఉండటంతో అధికారులు ఆ వైపుగా దృష్టిసారించాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కూరగాయల మార్కెట్ సమీపంలోని పాత మటన్ మార్కెట్ కాంప్లెక్స్‌లో నూతనంగా నిర్మించిన భవనం సెల్లార్‌లో పార్కింగ్ ఏర్పాటు చేస్తామని గతంలో మున్సిపల్ అధికారులు తెలిపారు. అయితే భవన నిర్మాణం పూర్తయి సంవత్సరాలు గడుస్తున్నా సెల్లార్ ఖాళీగా ఉందేగానీ, పార్కింగ్ కోసం వినియోగించడంలో మాత్రం జాప్యం జరుగుతోంది. భవనం సెల్లార్‌ను పార్కింగ్ కోసం వినియోగిస్తే మార్కెట్ ఏరియాలో వాహనాల రద్దీ తగ్గి, ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుంది. ఆ దిశగా అధికారులు ఆలోచించాలని ప్రజలు కోరుతున్నారు.