Share News

రూ.400 కోట్ల బియ్యం స్వాహా

ABN , Publish Date - Aug 26 , 2026 | 12:59 AM

పైసా పెట్టుబడి లేకుండా పదిహేనేళ్లుగా ప్రభుత్వం కస్టమ్‌ మిల్లింగ్‌ కోసం ఇచ్చిన ధాన్యాన్ని కొందరు రైస్‌మిల్లర్లు పక్కదారి పట్టించి 400చకోట్ల రూపాయలు స్వాహా చేశారు.

రూ.400 కోట్ల బియ్యం స్వాహా

(ఆంధజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

పైసా పెట్టుబడి లేకుండా పదిహేనేళ్లుగా ప్రభుత్వం కస్టమ్‌ మిల్లింగ్‌ కోసం ఇచ్చిన ధాన్యాన్ని కొందరు రైస్‌మిల్లర్లు పక్కదారి పట్టించి 400చకోట్ల రూపాయలు స్వాహా చేశారు. ఆ సొమ్మును ముక్కుపిండి వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం కలకలం సృష్టిస్తున్నది. మిల్లర్లతోపాటు లోపాయికారిగా సహకరించిన అధికారుల గుండెల్లోనూ గుబులు మొదలైంది. అక్రమాలకు పాల్పడిన రైసుమిల్లర్ల బండారం బయటపెట్టేందుకు సివిల్‌ సప్లయిస్‌ శాఖ కమిషనర్‌ గ్రేహౌండ్స్‌, అక్టోపస్‌ నుంచి ఎంపిక చేసిన పోలీసులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి రంగంలోకి దింపారు. దీతో పాత బకాయిల వసూళ్లు ఒక కొలిక్కివచ్చే అవకాశముందని భావిస్తున్నారు.

ఫ డీఫాల్టర్లుగా 109 మంది రైస్‌మిల్లర్లు

జిల్లాలో 209 కోట్ల రూపాయల విలువచేసే బియ్యాన్ని మిల్లర్లు ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంది. 2011-12 నుంచి 2024-25 వరకు 109 మంది రైస్‌మిల్లర్లు కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ను అక్రమంగా అమ్ముకుని డీఫాల్టర్లుగా మారారు. 400 కోట్ల రూపాయల విలువ చేసే బియ్యం పదిహేనేళ్లుగా దారి మళ్లింది. ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు కేంద్రాల ద్వారా ఖరీదు చేసిన ధాన్యాన్ని జిల్లాలోని రైసుమిల్లులకు కస్టమ్‌ మిల్లింగ్‌ కోసం ఇస్తుంది. మిల్లర్లు ఆ ధాన్యాన్ని మర ఆడించి క్వింటాల్‌కు 67నుంచి 68 కిలోల బియ్యం ప్రభుత్వానికి తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రభుత్వం నిర్ణయించిన మొత్తాన్ని చెల్లించడంతోపాటు తవుడు, నూకను మిల్లర్లకే ఇస్తుంది.

ఫ పెట్టుబడి లేకుండా దందా..

జిల్లాలోని మెజార్టీ మిల్లులు మొదట్లో బియ్యం సక్రమంగానే చెల్లించినా ఆ తర్వాత వాటిని దారిమళ్లించి స్థానికంగానే కాకుండా ఇతర ప్రాంతాలకు సరఫరా చేసి వ్యాపారం చేయడం ప్రారంభించారు. పెట్టుబడి లేకుండా వచ్చిన బియ్యం లాభాలను చేకూర్చి పెడుతుండడంతో మెజార్టీ మిల్లర్లు ఒకరిని చూసి ఒకరు అదే దారిన నడవడం ప్రారంభించారు. మరికొందరు కొన్ని మిల్లులను లీజుకు తీసుకోవడం ద్వారా ఈ వ్యాపారంలో ప్రవేశించారు. ఇంకొందరు ముగ్గురు, నలుగురు చొప్పున కలిసి మిల్లులను ప్రారంభించడం, లీజుకు తీసుకోవడం చేసి కస్టమ్‌ మిల్లింగ్‌తో అక్రమవ్యాపారాన్ని చేస్తూ వచ్చారు. దీనికి సివిల్‌ సప్లయిస్‌ అధికారుల లోపాయికారి సహకారం లభించింది. రాజకీయ నాయకుల అవసరాలు తీర్చుతూ వారి అండదండలను పొందిన వ్యాపారులు నిర్ణీత గడువులోగా బియ్యం తిరిగి ప్రభుత్వానికి ఇవ్వకుండా అక్రమ వ్యాపారం చేయడంతో కోట్లాది రూపాయల బకాయిలు పేరుకొని పోయాయి. వాటిని వసూలు చేయాల్సిన అధికార యంత్రాంగం నోటీసులివ్వడం, మొక్కుబడిగా కేసులు నమోదు చేస్తూ చర్యలకు ఉపేక్షించడంతో మిల్లర్లు తమ అక్రమదందాను యథేచ్ఛగా కొనసాగిస్తూ వచ్చారు. దీంతో జిల్లాలో 2011-12 నుంచి 2024-25 వరకు 109 మంది రైస్‌మిల్లర్లు డీఫాల్టర్లుగా మారారు. సుమారు 400 కోట్ల రూపాయల విలువ చేసే బియ్యం ప్రభుత్వానికి ఇవ్వకుండా దారి మల్లించిన మిల్లర్లు ఆ బియ్యాన్ని ఏళ్లు గడిచినా చెల్లించకుండా పెండింగ్‌లో పెట్టారు.

ఫ 25 శాతం ఫెనాల్టీ

రాష్ట్ర ప్రభుత్వం అక్రమార్కులపై కొరడా ఝలిపించడం ప్రారంభించింది. 25 శాతం ఫెనాల్టీ వేస్తూ రెవెన్యూ రికవరీ యాక్టు, పీడీ యాక్టు ప్రయోగిస్తూ వస్తున్నది. దీంతో 109 మంది డిఫాల్టర్లలో 35 మంది 25శాతం ఫెనాల్టీతో కలిపి మొత్తం బకాయి చెల్లించారు. మరో 33 మంది వంద శాతం బియ్యం విలువను డబ్బు రూపంలో చెల్లించి ఫెనాల్టీ ఇంకా చెల్లించలేదు. 41 మంది ఇప్పటికీ డీఫాల్టర్లుగా 57,613 టన్నుల బియ్యం ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉన్నది. బకాయి ఉన్న బియ్యం విలువ 209 కోట్ల రూపాయలు. ప్రభుత్వం వీరి నుంచి ఆ డబ్బును వసూలు చేసేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించి 16 మందిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేసింది. మరో 11 మంది మిల్లులపై దాడులు నిర్వహించి పంచనామా పూర్తి చేశారు. త్వరలోనే కేసులు నమోదు చేసేందుకు రంగం సిద్ధమైంది. కేసులు నమోదైన మిల్లుల నుంచి 157.02 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి రావలసి ఉన్నది.

కోరపల్లికి చెందిన మహాలక్ష్మి ఆగ్రో ఇండస్ట్రీస్‌, పెద్దపాపయ్యపల్లికి చెందిన పరమేశ్వర ఇండస్ట్రీస్‌, మొలంగూర్‌కు చెందిన పవనసుత ట్రేడర్స్‌, బోర్నపల్లికి చెందిన సాయి ట్రేడర్స్‌, ఇల్లందకుంటకు చెందిన శ్రీహనుమాన్‌ సీతారామాంజనేయ మిల్‌, శ్రీరాములపల్లికి చెందిన శ్రీసీతారామా ఆగ్రో ఇండస్ట్రీస్‌, లక్షీదేవిపల్లికి చెందిన శ్రీవీరభద్ర ఎంఆర్‌ఎం, బూజూనుర్‌కు చెందిన శ్రీవేంకటేశ్వర రైసుమిల్లులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఈ మిల్లుల నుంచి ఇప్పటికీ 157 కోట్ల 2 లక్షల రూపాయల బకాయి ప్రభుత్వానికి రావలసి ఉన్నది. మిగతా మిల్లుల నుండి మరో 52 కోట్లు ప్రభుత్వానికి చెల్లించాల్సిఉన్నది.

ఫ ప్రభుత్వ ఆదేశాల మేరకు చర్యలు..

రజనీకాంత్‌, సివిల్‌ సప్లయిస్‌ జిల్లా మేనేజర్‌

ప్రభుత్వ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటివరకు 16 మందిపై క్రిమినల్‌ కేసులు, రెవెన్యూ రికవరీ యాక్ట్‌ను నమోదు చేశాం. త్వరలోనే మిగితా వారిపై చర్యలు తీసుకుంటాం.

Updated Date - Aug 26 , 2026 | 12:59 AM