Share News

వరి కోత...అన్నదాతకు భారం

ABN , Publish Date - Apr 25 , 2026 | 01:54 AM

దుక్కి దున్నడం నుంచి పంట విక్రయం వరకు ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఓర్చుతున్న అన్నదాతలకు ఆదాయం అంతంతమాత్రంగానే వస్తోంది. ఈ యేడాది యాసంగిలో తెగుళ్లు, వడగళ్ల వానలు నష్టం మిగల్చగా వరి కోతలతో రైతులకు ఆర్థిక మోత పడుతోంది. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా వరికోతలు ఊపందుకుంటున్నాయి.

వరి కోత...అన్నదాతకు భారం

- అధిక వ్యయంతో ఆర్థికంగా కుదేలు

- కూలీల కొరతతో యంత్రాలకు పెరిగిన డిమాండ్‌

- గత ఏడాదితో పోలిస్తే పెరిగిన యంత్రాల అద్దె ధరలు

- జిల్లాలో యాసంగిలో 3.03 లక్షల ఎకరాల్లో వరి సాగు

జగిత్యాల, ఏప్రిల్‌ 24 (ఆంధ్రజ్యోతి): దుక్కి దున్నడం నుంచి పంట విక్రయం వరకు ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఓర్చుతున్న అన్నదాతలకు ఆదాయం అంతంతమాత్రంగానే వస్తోంది. ఈ యేడాది యాసంగిలో తెగుళ్లు, వడగళ్ల వానలు నష్టం మిగల్చగా వరి కోతలతో రైతులకు ఆర్థిక మోత పడుతోంది. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా వరికోతలు ఊపందుకుంటున్నాయి. యంత్రాల అద్దె ధరలు సైతం కొంత మేర పెరిగాయి. ధాన్యాన్ని కల్లాలకు, కొనుగోలు కేంద్రాలకు, మిల్లులకు, ఇళ్లలోకి తరలించడానికి రవాణా చార్జీలు సైతం తడిసిమోపెడవుతున్నాయి. ఇంధనం ధరల హెచ్చు తగ్గులను సాకుగా చూపుతూ యంత్రాలు, ట్రాక్టర్ల యజమానులు అద్దె ధరలను పెంచేస్తున్నారని రైతులు ఆవేదన చెందుతున్నారు. అకాల వర్షాలతో ముప్పు ఉన్న ప్రస్తుత తరుణంలో వ్యయానికి వెనుకాడకుండా వరి కోతలను ముమ్మరం చేసే పనిలో రైతులు నిమగ్నమయ్యారు.

జిల్లాలో అధికంగా వరి సాగు..

జిల్లాలో యాసంగి సీజనలో 3,60,500 ఎకరాల్లో వివిధ పంటలను రైతులు సాగు చేశారు. ఇందులో ప్రధానంగా వరి 3,03,000, మొక్కజొన్న 47 వేలు ఎకరాలు, నువ్వు సుమారు 8,000 ఎకరాల్లో సాగు కాగా, మిగిలిన ఎకరాల్లో వివిధ పంటలను సాగు చేశారు. జిల్లాలో అధిక భాగం వరి సాగు అవుతోంది.

పెరిగిన యంత్రాల అద్దె ధరలు..

వరి కోతల కోసం రైతులు ప్రధానంగా యంత్రాలపైనే ఆధారపడుతున్నారు. డిమాండ్‌ ఎక్కువగా ఉండడంతో యంత్రాల యజమానులు ధరలను సైతం పెంచుతున్నారు. గత యాసంగిలో వరి కోతలు చేసే టూ వీలర్‌ హార్వెస్టర్‌ యంత్రానికి గంటకు రూ. 1,800 ఉండగా, ఇప్పుడు గంటకు 2,000 వేల రూపాయలు వసూలు చేస్తున్నారు. ఫోర్‌ వీల్‌ హార్వేస్టర్‌కు గతంలో రూ. 3,000 చొప్పున తీసుకోగా ప్రస్తుతం ఆ ధరను రూ. 3,200లకు పెంచారు. తడి నేలలు, నీటితో ఉన్న వ్యవసాయ స్థలాల్లో వరిని కోసేందుకు ట్రాక్‌ చైన యంత్రానికి గత యాసంగిలో ఒక గంటకు రూ. 3,500 వసూలు చేయగా, ప్రస్తుతం 3,700 రూపాయలు వసూలు చేస్తున్నారని అన్నదాతలు అంటున్నారు. టూ వీలర్‌ హార్వేస్టర్‌ ఒక గంట సమయంలో ఎకరం వరి కోస్తుందని అంచనా ఉంది. గంటకు 2,000 చొప్పున లెక్కిస్తే 3.03 లక్షల ఎకరాల్లో వరిని కోసేందుకు సుమారు రూ. 60.06 కోట్లను జిల్లా రైతులు యాసంగిలో పంట కోతలకు వ్యయం చేయాల్సి వస్తోంది. వరి కోత యంత్రాల అద్దె, ధాన్యాన్ని ట్రాక్టర్లలో తరలించేందుకు రవాణా చార్జీలు తడిసి మోపెడవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పశుగ్రాసం సేకరణలో భాగంగా ఎండుగడ్డిని కట్ట కట్టేందుకు బేలర్‌ యంత్రాలు, గడి రవాణాకు ట్రాక్టర్‌ చార్జీలను యజమానులు పెంచుతున్నారని రైతులు ఆవేదన చెందుతున్నారు.

ఖర్చులు పెరిగాయి

- నేరెళ్ల శ్రీనివాస్‌, రైతు, తిమ్మాపూర్‌, జగిత్యాల

యాసంగిలో వరిసాగుకు పెట్టుబడి బాగా పెరిగింది. యూరియా, ఎరువుల ధరలు విపరీతంగా పెరగడంతో పాటు కూలీల కొరతతో ఖర్చులు గతంలో కంటే ఎకరాకు రూ. 10 వేల మేర పెరిగింది. మొత్తంగా ఎకరాకు రూ. 30 వేల నుంచి రూ. 35 వేల వరకు వ్యయం అవుతోంది.

Updated Date - Apr 25 , 2026 | 01:54 AM