Share News

సగానికి వరి సాగు

ABN , Publish Date - Nov 26 , 2026 | 12:51 AM

ఎల్‌నినో మరింత తీవ్రమై మార్చి మాసాంతం వరకు తన ప్రతాపాన్ని చూపెడుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

సగానికి వరి సాగు

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

ఎల్‌నినో మరింత తీవ్రమై మార్చి మాసాంతం వరకు తన ప్రతాపాన్ని చూపెడుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో యాసంగి ప్రశ్నార్థకంగా మారింది. సుమారు లక్ష ఎకరాల్లో వరిసాగు తగ్గుతుందని, రైతులు ప్రత్యామ్నాయం వైపు చూస్తారని వ్యవసాయశాఖ అంచనా వేస్తున్నది. బావులు, బోరుబావుల కింద సాగు చేసే రైతులు తమ సాగు విస్తీర్ణాన్ని తగ్గించుకుంటున్నారు. ఆ మేరకే నార్లు పోసుకుంటున్నారు. ఆయకట్టు ప్రాంత రైతులు ఈశాన్య రుతుపవనాలు, అల్పపీడనాలతో కురిసే వర్షాలపై మాత్రమే ఆశలు పెట్టుకున్నారు.

ప్రాజెక్టుల్లో అంతంతమాత్రంగా నీరు

జిల్లా సాగుకు ప్రధాన జలవనరులైన శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు, ఎల్లంపల్లి, మిడ్‌మానేరు, ఎల్‌ఎండీలో నీరు అంతంత మాత్రంగానే ఉన్నది. 80.5 టీఎంసీల సామర్థ్యం ఉన్న శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులో 33.13 టీఎంసీలు, మద్యమానేరులో 27.55 టీఎంసీలకు 22.78 టీఎంసీలు, లోయర్‌ మానేరు డ్యామ్‌లో 24.03 టీఎంసీలకు 14.76 టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉన్నది. ఈ నీటిని వర్షాకాలం వరకు ప్రజల తాగునీటి అవసరాలు తీర్చేందుకు మాత్రమే వినియోగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎల్‌నినో ప్రభావంపై, ప్రత్యామ్నాయ సాగుపై వ్యవసాయశాఖ విస్తృత ప్రచారం నిర్వహించడంతో రైతులు వరి సాగు తగ్గిస్తున్నారు.

రైతులు.. స్వచ్ఛందంగా..

గత సంవత్సరం యాసంగిలో జిల్లాలో 3,21,186 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేయగా ఈ సీజన్‌లో రెండు లక్షల ఎకరాలోన్లూ పంటలు సాగవడం ప్రశ్నార్థకంగానే మారింది. వరిసాగు విస్తీర్ణం 2,82,845 ఎకరాల నుంచి 1.5 లక్షల ఎకరాలకు పడిపోయే అవకాశాలున్నట్లు తెలుస్తున్నది. జిల్లాలో రైతులకు వరి, మొక్కజొన్న, పత్తి సాగుపై పూర్తిస్థాయిలో అవగాహన ఉన్నది. ప్రస్తుత పరిస్థితుల్లో మొక్కజొన్న సాగుపైనే రైతులు ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తున్నది. గత యాసంగితో పోలిస్తే ఈసారి ఈ సాగు విస్తీర్ణం రెట్టింపు కానున్నదని భావిస్తున్నారు. గత సంవత్సరం 36,620 ఎకరాల్లో మొక్కజొన్న సాగు జరగగా ఈసారి అది 70 వేల నుంచి 75 వేల ఎకరాలకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఈ సీజన్‌లో మొక్కజొన్నతోపాటు పప్పుధాన్యాలు, నూనె గింజలు, కూరగాయల సాగు పెంచాలని వ్యవసాయశాఖ ఖేత్‌ బచావో.. అభియాన్‌ సమావేశాల ద్వారా రైతులకు అవగాహన కల్పిస్తున్నది. 15 రోజులుగా జిల్లాలోని అన్ని గ్రామాల్లో వ్యవసాయశాఖ ఈ సమావేశాలను ఏర్పాటు చేస్తూ ఎల్‌నినో ప్రభావంపై అవగాహన కల్పిస్తూ వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని సూచిస్తున్నది. వివిధ ప్రచార ప్రసార మాధ్యమాల ద్వారా ఎల్‌నినో ప్రభావాన్ని తెలుసుకుంటున్న రైతులు స్వచ్చందంగా వరి సాగును తగ్గించుకునే ఆలోచనలో ఉండడంతో గతంతో పోలిస్తే లక్ష ఎకరాల విస్తీర్ణంలో వరిసాగు తగ్గనున్నట్లు తెలుస్తున్నది.

యాసంగి ప్రణాళిక ఎప్పుడు?

రాష్ట్రస్థాయిలో వ్యవసాయశాఖ మంత్రి, కమిషనర్‌ సమావేశం ఏర్పాటు చేసి యాసంగి సాగు ప్రణాళికను వెల్లడించారు. కలెక్టర్లు, వ్యవసాయశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్సులు నిర్వహించి ఎల్‌నినో ప్రభావ నేపథ్యంలో ప్రత్యామ్నాయ ప్రణాళికను సిద్ధం చేసి అమలు చేయాలని సూచించారు. రాష్ట్రస్థాయిలో ప్రణాళిక సిద్ధమైందని చెబుతున్నా జిల్లాలో మాత్రం వ్యవసాయశాఖ ఇప్పటికీ యాసంగి కార్యాచరణ ప్రణాళికను ప్రకటించలేదు. ఆ శాఖ రైతులతో సమావేశాలు నిర్వహించి వారిని చైతన్యవంతులను చేస్తున్నా రబీ కార్యాచరణ ఏమిటి.. ఏ పంటలు సాగు చేస్తారు... విత్తనాలు, ఎరువుల అందుబాటు.. ప్రత్యామ్నాయ సాగు చేసే రైతులకు ప్రభుత్వం నుంచి లభించనున్న ప్రోత్సాహకాలు ఏమిటి, తదితర అంశాలు ఈ కార్యాచరణ ప్రణాళికలోనే వెల్లడవుతాయి.

Updated Date - Nov 26 , 2026 | 12:51 AM