Share News

పాఠశాలలకు పునరుజ్జీవం

ABN , Publish Date - Jun 24 , 2026 | 01:03 AM

జిల్లాలో విద్యార్థుల నమోదు లేదనే కారణంతో గతంలో మూసివేసిన 12 ప్రభుత్వ పాఠశాలలు ప్రస్తుత విద్యా సంవత్సరంలో తెరుచుకున్నాయి.

పాఠశాలలకు పునరుజ్జీవం
గొల్లపల్లి మండలం తిర్మలాపూర్‌లో తెరుచుకున్న పాఠశాల వద్ద విద్యార్థుల సందడి

జగిత్యాల, జూన్‌ 23 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో విద్యార్థుల నమోదు లేదనే కారణంతో గతంలో మూసివేసిన 12 ప్రభుత్వ పాఠశాలలు ప్రస్తుత విద్యా సంవత్సరంలో తెరుచుకున్నాయి. జిల్లా విద్యా శాఖ అధికారులు సిద్ధం చేసిన నివేదిక ప్రకారం జిల్లాలో మొత్తం 53 పాఠశాలలు జీరో ఎన్‌రోల్‌మెంట్‌గా ఉండడంతో గతంలో దశల వారీగా మూతపడ్డాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత విద్యా సంవత్సరమైనా ఆయా పాఠశాలలను తెరిపించాలన్న సంకల్పంతో విద్యాశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, గ్రామస్థులు, ప్రజా ప్రతినిధుల సమష్టి కృషితో గతంలో మూతపడ్డ పలు విద్యాలయాలు తెరుచుకున్నాయి.

ఫధర్మపురి నియోజకవర్గంలో ఎక్కువ..

జిల్లాలో గత విద్యా సంవత్సరం వరకు వివిధ కారణాల వల్ల 53 పాఠశాలలు వివిధ దశల్లో మూతపడ్డాయి. ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 31 పాఠశాలలు వివిధ కారణాల వల్ల మూతపడ్డాయి. గొల్లపల్లి మండలంలో 9, ఎండపల్లిలో 2, ధర్మపురిలో 7, వెల్గటూరు మండలంలో 4, బుగ్గారంలో 1, పెగడపల్లిలో 8, పాఠశాలలున్నాయి. అదేవిదంగా జగిత్యాల నియోజకవర్గం పరిధిలోని సారంగపూర్‌లో 2, రాయికల్‌లో 1, జగిత్యాల రూరల్‌ మండలంలో 4, బీర్‌పూర్‌లో 3, కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని మెట్‌పల్లిలో 2, మల్లాపూర్‌లో 3, ఇబ్రహీంపట్నంలో 2, చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని కొడిమ్యాలలో 3, మల్యాలలో 2 పాఠశాలలు మూతపడ్డాయి. జిల్లాలో 53 పాఠశాలలు మూతపడగా ఇందులో ధర్మపురిలో రెండు ప్రాథమికోన్నత పాఠశాలలున్నాయి. మిగిలిన ప్రాంతాల్లో ప్రాథమిక పాఠశాలలు మూతపడ్డ జాబితాలో ఉన్నాయి.

ఫఅధికారుల ప్రత్యేక దృష్టి

ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో బోధన అందించి ప్రవేశాలపై దృష్టి సారించాలని కలెక్టర్‌ సత్యప్రసాద్‌ దిశా నిర్దేశం చేస్తున్నారు. దీంతో జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయులు బడి బాట కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని విద్యార్థులు లేక మూతపడిన 53 పాఠశాలలపై జిల్లా విద్యాశాఖ అధికారి రాము నేతృత్వంలో మండల విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఒక్కో విద్యార్థికి ఏటా సర్కారు రూ.లక్షలు ఖర్చు చేస్తోంది. ఉచితంగా పాఠ్యపుస్తకాలు, నోట్‌ పుస్తకాలు, యూనిఫామ్‌, మధ్యాహ్న భోజనంతో పాటు ఈ యేడాది నుంచి ఉదయం అల్పాహారం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటిపై ఉపాధ్యాయులు గ్రామాల్లో ప్రచారం చేయడంతో ప్రవేశాల పెరిగి పలు పాఠశాలలు తెరుచుకున్నాయి.

పునఃప్రారంభమైన పాఠశాలలు

ధర్మపురి నియోజకవర్గంలోని ధర్మపురి మండలం గోవిందుపల్లి ప్రాథమిక పాఠశాల, గొల్లపల్లి మండలం అబ్బాపూర్‌ ప్రాథమిక పాఠశాల, తిరుమలాపూర్‌ ప్రాథమిక పాఠశాల, శంకర్రావుపేట ప్రాథమిక పాఠశాల, పెగడపల్లి మండలం రాజారంపల్లి తండా ప్రాథమిక పాఠశాలలు తెరుచుకున్నాయి. జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని బీర్‌పూర్‌ మండలం తుంగూరు ప్రాథమిక పాఠశాల, రంగసాగర్‌ ప్రాథమిక పాఠశాల, కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని మల్లాపూర్‌ మండలం వేంపల్లి వెంకట్రావుపేట ప్రాథమిక పాఠశాల, మెట్‌పల్లి మండలం రంగారావుపేట ప్రాథమిక పాఠశాల, చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని కొడిమ్యాల మండలం పోతారం ప్రాథమిక పాఠశాల, బొల్లోనిచెరువు గ్రామ ప్రాథమిక పాఠశాలలు ఇప్పటికే తెరుచుకున్నాయి. మరిన్ని మూతబడిన పాఠశాలలను తెరిపించడానికి ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.

సమష్టి కృషితో కళకళ

ఫగొల్లపల్లి మండలం తిరుమలాపూర్‌ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు రాకపోవడంతో మూడు సంవత్సరాల క్రితం మూసివేశారు. ప్రస్తుత విద్యా సంవత్సరం గ్రామస్తులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, అధికారులు సమష్టి కృషి చేయడంతో సుమారు 60 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు. ప్రస్తుతం పాఠశాల విద్యార్థులతో కళకళలాడుతోంది.

ఫ పెగడపల్లి మండలం రాజారాంపల్లి తండాలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తగ్గిపోవడంతో నాలుగు సంవత్సరాల క్రితం మూసివేశారు. ప్రస్తుత విద్యా సంవత్సరం 12 మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పించి తిరిగి తెరిపించారు.

ఫ బీర్‌పూర్‌ మండలం రంగసాగర్‌ ప్రాథమిక పాఠశాల గ్రామానికి దూరంగా గోదావరికి సమీపంలో ఉండడంతో విద్యార్థులను తల్లిదండ్రులు బడికి పంపకపోవడంతో మూడేళ్ల క్రితం మూసివేశారు. ప్రస్తుత యేడాది సంబంధిత పాఠశాలను విద్యార్థులకు అనుకూలంగా ఉండేవిధంగా గ్రామ పంచాయతీ భవనంలో నిర్వహించడానికి నిర్ణయించడంతో తిరిగి విద్యార్థులు ప్రవేశాలు తీసుకోవడంతో పాఠశాల తెరుచుకుంది.

ఫకొడిమ్యాల మండలం బొల్లేని చెరువు గ్రామ ప్రాథమిక పాఠశాలకు విద్యార్థులు రాకపోవడంతో మూడేళ్ల కిత్రం మూతపడింది. పాఠశాలలో మౌలిక వసతులు కల్పించడంతో ప్రస్తుత విద్యాసంవత్సరం 17 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందడంతో తిరిగి పునఃప్రారంభించారు.

విద్యార్థులను చేర్పించేలా ప్రత్యేక కార్యాచరణ

- రాము, జిల్లా విద్యాశాఖ అధికారి

విద్యార్థులు లేని పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించాము. మూతపడిన పాఠశాలల్లో సుమారు 10 నుంచి 15 మంది విద్యార్థులను చేర్పించేలా చర్యలు తీసుకుంటున్నాము. ఇందుకు పాఠశాల హెచ్‌ఎం, ఉపాధ్యాయులు, పాఠశాల కమిటీ చైర్మన్‌, స్థానిక ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రుల సహకారాలతో ముందుకు వెళ్తున్నాము. ఇప్పటికే పలు పాఠశాలలను తెరిపించాము. మరిన్ని పాఠశాలలను తెరిపించడానికి ప్రయత్నాలు చేస్తున్నాము.

అన్ని వర్గాల సహకారాలతోనే..

-అనిల్‌, ప్రధానోపాధ్యాయుడు, రంగసాగర్‌ పాఠశాల, బీర్‌పూర్‌ మండలం

గ్రామంలో మూడేళ్ల క్రితం పాఠశాల మూతపడింది. గ్రామస్థులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల సహకారాలతో విద్యార్థులకు ప్రవేశాలు కల్పించాము. మూడేళ్ల క్రితం మూతపడ్డ పాఠశాల తిరిగి ప్రవేశాలు జరగడంతో ప్రస్తుత విద్యా సంవత్సరం తెరిపించాము. సమష్టి కృషి వల్ల పాఠశాల తెరుచుకుంది.

జిల్లాలో ఇప్పటి వరకు తెరుచుకున్న పాఠశాలలు

--------------------------------------------------------------------------------

మండలం...గ్రామం...పాఠశాల...ప్రవేశాలు పొందిన విద్యార్థులు

--------------------------------------------------------------------------------

గొల్లపల్లి - తిరుమలాపూర్‌ - ప్రాథమిక పాఠశాల - 60

గొల్లపల్లి - అబ్బాపూర్‌ - ప్రాథమిక పాఠశాల - 30

గొల్లపల్లి - శంకర్రావుపేట - ప్రాథమిక పాఠశాల - 21

ధర్మపురి - గోవిందుపల్లి - ప్రాథమిక పాఠశాల - 26

మెట్‌పల్లి - రంగారావుపేట - ప్రాథమిక పాఠశాల - 25

మల్లాపూర్‌ - వీవీరావుపేట - ప్రాథమిక పాఠశాల - 19

కొడిమ్యాల - బొల్లేని చెరువు - ప్రాథమిక పాఠశాల - 17

పెగడపల్లి - రాజారాంపల్లి - ప్రాథమిక పాఠశాల - 12

పెగడపల్లి - మద్దులపల్లి - ప్రాథమిక పాఠశాల - 11

బీర్‌పూర్‌ - తుంగూరు - ప్రాథమిక పాఠశాల - 6

బీర్‌పూర్‌ - రంగసాగర్‌ - ప్రాథమిక పాఠశాల - 5

కొడిమ్యాల - పోతారం - ప్రాథమిక పాఠశాల - 5

--------------------------------------------------------------------------------

మొత్తం ప్రవేశాలు పొందిన విద్యార్థులు - 237

--------------------------------------------------------------------------------

Updated Date - Jun 24 , 2026 | 01:03 AM