Share News

రేవంత్‌రెడ్డిది అబద్దాల పాలన

ABN , Publish Date - Oct 03 , 2026 | 12:25 AM

రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రజాపాలన ప్రభుత్వం సంక్షేమాన్ని విస్మరించి, బీఆర్‌ఎస్‌ నాయకులపై కక్ష సాధింపే ధ్యేయంగా పోలీస్‌ రాజ్యం నడుపుతోందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు కొప్పుల ఈశ్వర్‌ విమర్శించారు.

రేవంత్‌రెడ్డిది అబద్దాల పాలన

కరీంనగర్‌ టౌన్‌, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రజాపాలన ప్రభుత్వం సంక్షేమాన్ని విస్మరించి, బీఆర్‌ఎస్‌ నాయకులపై కక్ష సాధింపే ధ్యేయంగా పోలీస్‌ రాజ్యం నడుపుతోందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు కొప్పుల ఈశ్వర్‌ విమర్శించారు. శుక్రవారం నగరంలోని ఓహోటల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి పూర్తిగా అబద్దాల పాలన చేస్తున్నారన్నారు. రేవంత్‌రెడ్డి కేవలం కేసీఆర్‌, కేటీఆర్‌, హరీష్‌రావుపై కక్ష సాధింపు చర్యలు, ఆరోపణలు చేయడానికే ప్రాధాన్యతనిస్తున్నారని ఆరోపించారు. 35 నెలల కాంగ్రెస్‌ పాలనలో ప్రజలకిచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీలను నెరవేర్చలేదని, అభివృద్ధిని పూర్తిగా పక్కన పెట్టారని విమర్శించారు. కేసీఆర్‌ ప్రభుత్వం బతుకమ్మ చీరల ఆర్డర్లు, సబ్సిడీలు, నేతన్నకు భరోసా, బీమా పథకాల ద్వారా చేనేత రంగాన్ని ఆదుకున్నారని, ప్రస్తుత ప్రజాపాలన ప్రభుత్వం ఆ సంక్షేమాన్ని పూర్తిగా విస్మరిస్తోందని అన్నారు. గతంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉండగానే సిరిసిల్లలో చేనేత కార్మికుల ఆత్మహత్యలు కొనసాగి ఉరిసిల్లగా మారిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో కేసీఆర్‌ బతుకమ్మ చీరలు, రాజీవ్‌ ఆరోగ్యశ్రీ, విద్యార్థుల యూనిఫారమ్‌ ఆర్డర్లను నేరుగా సిరిసిల్ల పవర్‌లూమ్‌ కార్మికులకే ఇచ్చి వేల కోట్ల రూపాయల ఉపాధి కల్పించి ఆర్థిక చేయూతనిచ్చారని అన్నారు. గల్ఫ్‌కార్మికులకు 5 లక్షల ప్రమాదబీమా ప్రకటనలకే పరిమితమైందని అన్నారు. ఓటుకు నోటు కేసులో దొరికిన చరిత్ర ఉన్న రేవంత్‌రెడ్డికి నిజాయితీ గురించి మాట్లాడే అర్హతే లేదని అన్నారు. తెలంగాణ ఉద్యమమే లేకుంటే రేవంత్‌రెడ్డి అడ్రస్‌ ఎక్కడ ఉండేదని అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు విద్యాసాగర్‌రావు, సుంకె రవిశంకర్‌, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మన్‌రావు, మాజీ మేయర్‌ సర్దార్‌ రవీందర్‌సింగ్‌, జిల్లా గ్రంథాలయ సంస్త మాజీ చైర్మన్‌ పొన్నం అనిల్‌కుమార్‌గౌడ్‌, మాజీ జడ్పీటీసీ తన్నీరు శరత్‌రావు, కార్పొరేటర్లు గుగ్గిళ్ళ జయశ్రీ, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 03 , 2026 | 12:25 AM