గణపతి, దుర్గా నవరాత్రులపై ఆంక్షలు సరికాదు
ABN , Publish Date - Jul 18 , 2026 | 12:20 AM
పోలీసుల వైఫల్యంతో కరీంనగర్‌లో శాంతిభద్రతలు అదుపు తప్పుతున్నాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ విమర్శించారు.
కరీంనగర్ టౌన్, జూలై 17 (ఆంధ్రజ్యోతి): పోలీసుల వైఫల్యంతో కరీంనగర్‌లో శాంతిభద్రతలు అదుపు తప్పుతున్నాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ విమర్శించారు. నగరంలో గణపతి నవర్రాతి ఉత్సవాల నిర్వహణపై పోలీసుల ఆంక్షలు, శాంతిభద్రతల వైఫల్యంపై ఎమ్మెల్యే తీవ్రస్థాయిలో మండిపడ్డారు. స్థానిక సప్తగిరికాలనీలో వినాయక మండపాల ఏర్పాటుకు పోలీసులు అనుమతులు నిరాకరించడంతో కాలనీవాసుల అభ్యర్థన మేరకు శుక్రవారం ఎమ్మెల్యే కమలాకర్ అక్కడికి వెళ్లి పోలీసుల తీరును తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా గంగుల మాట్లాడుతూ గత 38 ఏళ్లుగా ఈ ప్రాంతంలో ప్రజలు గణపతి, దుర్గా నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుంటున్నారని, అలాంటిది ఇప్పుడు మండ పాలు పెట్టవద్దని చెప్పడం ఎంతవరకు సమంజసమని పోలీసులను ప్రశ్నించారు. కేవలం ఒక రాజకీయ పార్టీకి అనుకూ లంగా వ్యవహరిస్తూ ఇతర మండపాలకు అనుమతులు నిరాకరించడం సరికాదని అన్నారు. బొమ్మకల్ హనుమాన్ విగ్ర హం చోరి ఘటనను ఆయన ప్రస్తావిస్తూ తీవ్ర అసహనం వ్యక్తంచేశారు. విగ్రహాన్ని దొంగిలించిన వ్యక్తులను పట్టుకోవలసిన పోలీసులు, అది ఎక్కడుందో వెతికి పట్టుకొని ప్రతిష్టించిన తనపై, బీఆర్‌ఎస్ శ్రేణులపైనే క్రిమినల్ కేసులు నమోదు చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు. తన క్యాంపు కార్యాలయంపై బిజేపీ శ్రేణులు దాడిచేసినపుడు వారిపై ఎలాంటి కేసు లు నమోదు చేయకుండా, స్టేషన్‌కు పిలిపించి రాచమర్యాదలు చేసి పంపండం దేనికి సంకేతమని మండిపడ్డారు. సీఎం రేవంత్‌రెడ్డి స్పందించి కరీంనగర్ పోలీసు వ్యవస్థను గాడినపెట్టాలని అన్నారు.