Share News

ఎర్లీబర్డ్‌ స్కీమ్‌కు స్పందన

ABN , Publish Date - May 01 , 2026 | 01:00 AM

నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీల్లో 2026-27 ఆర్థిక సంవత్సరం ఆస్తిపన్నులను ఏకమొత్తంలో చెల్లించిన వారికి పన్నులో ఐదు శాతం రాయితీ కల్పిస్తూ అమలు చేసిన ఎర్లీబర్డ్‌ స్కీమ్‌ గురువారంతో ముగిసింది.

ఎర్లీబర్డ్‌ స్కీమ్‌కు స్పందన

కరీంనగర్‌ టౌన్‌, ఏప్రిల్‌ 30 (ఆంధ్రజ్యోతి): నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీల్లో 2026-27 ఆర్థిక సంవత్సరం ఆస్తిపన్నులను ఏకమొత్తంలో చెల్లించిన వారికి పన్నులో ఐదు శాతం రాయితీ కల్పిస్తూ అమలు చేసిన ఎర్లీబర్డ్‌ స్కీమ్‌ గురువారంతో ముగిసింది. రెండు, మూడు సంవత్సరాలుగా ఏడాది పన్నులను ఒకేసారి అడ్వాన్స్‌గా చెల్లించిన వారికి 5శాతం రాయితీ కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఎర్లీబర్డ్‌ స్కీమ్‌ను అమలు చేస్తోంది. ఈ స్కీమ్‌ ద్వారా ఆస్తిపన్ను చెల్లింపుదారులకు ఐదు శాతం రాయితీ లభించడమే కాకుండా ఆలస్యంగా చెల్లిస్తే పడే వడ్డీ భారాన్ని తగ్గిస్తుండడంతో నగర ప్రజలు ఈ పథకానికి చక్కటి ఆదరణ చూపిస్తున్నారు.

- 25 శాతం వసూలు

నగరపాలక సంస్థకు ఏడాదిలో ఆస్తిపన్ను రూపేణ 61 కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుందని అధికారులు అంచనా వేయగా అందులో దాదాపు 25శాతం పన్నులను ఏప్రిల్‌ 30లోపే చెల్లిస్తుండడంతో అడ్వాన్స్‌గా చెల్లిస్తున్న ఆస్తిపన్నుల ద్వారా వచ్చే ఆదాయంతో నగరంలో అభివృద్ది పనులకు వాటిని వెచ్చించే వీలు కలుగుతుంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌ 30వ తేదీ వరకు ఏర్లీబర్డ్‌ స్కీమ్‌ ద్వారా 16 కోట్లపై చిలుకు ఆస్తిపన్నులు వసూలు కావడంతో ఈసారి కూడా కొంత అటుఇటుగా 16 కోట్లు వస్తాయని అంచనా వేశారు. అయితే 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఎర్లీ బర్డ్‌ స్కీమ్‌ ద్వారా 17.50 కోట్ల ఆస్తిపన్నులు అడ్వాన్స్‌గా వసూలు అయ్యాయి. ఏప్రిల్‌ 2 నుంచి ఈ పథకాన్ని అమలు చేసి నగరంలో విస్తృత ప్రచారం చేశారు. ప్రజలకు ఇబ్బంది కలుగకుండా నగరపాలక సంస్థ కార్యాలయంలో అదనంగా ఆస్తి పన్ను చెల్లింపు కౌంటర్లను ఏర్పాటు చేసి రాత్రి 8 గంటల వరకు పన్నులను స్వీకరించారు. వార్డు ఆఫీసర్లు, ఆన్‌లైన్‌ ద్వారా కూడా ఆస్తిపన్నులు చెల్లించే వెసులుబాటు కల్పించారు. దీంతో నగర ప్రజలు పెద్ద ఎత్తున ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఏప్రిల్‌ 30 చివరిరోజు కావడంతో గురువారం ఒక్కరోజే 1.72 కోట్ల ఆస్తిపన్నులను చెల్లించారు. ఎర్లీబర్డ్‌ పథకానికి ఈసారి మంచి ఆదరణ లభించిందని డిప్యూటీ కమిషనర్‌ ఖాదర్‌ మోహియుద్దీన్‌ తెలిపారు.

Updated Date - May 01 , 2026 | 01:00 AM